'రామాయణం' ఆఫర్ మహేష్ తిరస్కరించారా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ `రామాయణం` లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని వదులుకున్నారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 5 July 2025 9:29 AM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ `రామాయణం` లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని వదులుకున్నారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. నిజానికి భారతదేశంలో ఏ దర్శకుడు `రామాయణం` కథతో సినిమా తీయాలనుకున్నా, శ్రీరాముడి పాత్రకు కచ్ఛితంగా మహేష్ బాబు మొదటి ఆప్షన్ అవుతాడు. అతడి తీరైన రూపం, ఆకర్షణ రాముడి పాత్ర విలువను పెంచగలవు. ఇప్పుడు నితీష్ తివారీ కూడా మొదట తనకు మహేష్ కావాలని పట్టుబట్టాడు.
సూపర్ స్టార్ మహేష్ తో రామాయణం కథ గురించి, రాముడి పాత్ర గురించి నితీష్ చర్చించారు. అతడు ఆఫర్ చేసిన దానికి మహేష్ కూడా చాలా ఆసక్తిని కనబరిచారు. కానీ చివరి నిమిషంలో విధి వేరొకలా ఉంది. అప్పటికే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో ప్రాజెక్ట్ కి కమిటైన మహేష్ రామాయణం కోసం కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి తలెత్తింది. పర్యవసానంగా అతడు నితీష్ జీ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది.
అయితే దంగల్ లాంటి పాన్ వరల్డ్ హిట్ సినిమాని తెరకెక్కించిన నితీష్ తివారీ దేశంలోని ప్రముఖ డైరెక్టర్లలో ఒకరు. అతడితో సినిమా చేసేందుకు ఏ హీరో అయినా వెనకాడరు. కానీ రాజమౌళితో ఆఫర్ కోసం మహేష్ అతడిని కాదనుకున్నాడని అర్థమవుతోంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ హోదాను ఆస్వాధిస్తున్నాడు. పాన్ ఇండియన్ మార్కెట్లో అతడికి తిరుగే లేదు. ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ ని భారతదేశానికి అందించి ప్రపంచ సినీప్రముఖుల దృష్టిని ఆకర్షించాడు. అందువల్ల అతడి మార్కెట్ రేంజ్ పాన్ వరల్డ్ కి ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఇకపై 1000 కోట్ల రేంజ్ నుంచి 2000 కోట్లు అంతకుమించిన వసూళ్ల దిశగా ప్రయాణించగలు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లు సులువుగా వస్తున్నాయి. గ్యారెంటీగా మాస్ ని థియేటర్లకు రప్పించగల సమర్థుడు. అందువల్ల అతడి ముందు వేరొక దర్శకుడిని నిలబెట్టడం కష్టం. అందుకే నిరభ్యంతరంగా మహేష్ మొదటి ఆప్షన్ రాజమౌళి.
అయితే మహేష్ తిరస్కరించిన తర్వాత నితీష్ తివారీ సెకండ్ ఆప్షన్ గా రణబీర్ కపూర్ ని శ్రీరాముడి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడు. కానీ రణబీర్ కపూర్ ఎంపిక సరికాదని బాలీవుడ్ ప్రముఖ వెటరన్ నటులు కొందరు నిరాశను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ నితీష్ కి ఉన్న ఏకైక ఆప్షన్ రణబీర్ మాత్రమే. అందుకే అతడు తక్షణమే అతడికి అవకాశం కల్పించి ప్రాజెక్టును టేకాఫ్ చేసాడు. ఇటీవలే రామాయణం తొలి టీజర్ విడుదలైంది. నితీష్ శ్రీరాముడి పాత్రను లార్జర్ దేన్ లైఫ్ రేంజులో ఆవిష్కరిస్తున్నాడు.