ప్రిన్స్ మహేశ్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు.. ఎందుకు?
టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరు ప్రిన్స్ మహేశ్ బాబు. తాజాగా ఆయనకు ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది.
By: Tupaki Desk | 7 July 2025 11:00 AM ISTటాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరు ప్రిన్స్ మహేశ్ బాబు. తాజాగా ఆయనకు ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేశ్ బాబుకు.. సదరు సంస్థను నమ్మి మోసపోయినట్లుగా కమిషన్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మూడో ప్రతివాదిగా మహేశ్ బాబును చేరుస్తూ ఫిర్యాదు నమోదైంది.
అసలేం జరిగిందంటే.. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు మహేశ్ బాబు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారని.. ఆయన ఫోటోతో ఉన్న బ్రోచర్ లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బులు చెల్లించినట్లుగా పేర్కొన్నారు. ప్లాటు కోసం రూ.34.80 లక్షలు చెల్లించినట్లుగా ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ యజమాని కంచర్ల సతీశ్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా చేరుస్తూ నోటీసులు జారీ చేవారు.
ఈ కేసును ఒక లేడీ డాక్టర్ వేశారు. సాయి సూర్య డెవలపర్స్ యజమాని మాటల్ని నమ్మి బాలాపూర్ గ్రామంలో డబ్బులు చెల్లించినట్లుగా పేర్కొన్నారు. అన్ని అనుమతులు ఉన్నట్లుగా మహేశ్ బాబు ఫోటోతో బ్రోచర్ ఉండటంతో తాను నమ్మి.. డబ్బులు చెల్లించినట్లుగా సదరు వైద్యురాలు పేర్కొన్నారు. అయితే. ఆ వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవని.. దీంతో తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమంటే.. అతి కష్టమ్మీదా కేవలం రూ.15 లక్షల్ని వాయిదాల పద్దతిలో తనకు అందినట్లుగా పేర్కొన్నారు.
ఆ తర్వాత నుంచి డబ్బులు ఇచ్చే అంశాన్ని అదే పేనిగా ఆలస్యం చేస్తున్నారని.. ఇటీవలకాలంలో ముఖం చాటేయటంతో తనకు రావాల్సిన మొత్తాన్ని తనకు ఇప్పించాల్సిందిగా కోరుతూ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై మహేశ్ బాబు ఎలా రియాక్టు అవుతారు? జోరుగా సాగుతన్న ఆయన బ్రాండింగ్ వ్యవహారాలు.. తాజా నోటీసుల నేపథ్యంలో కాస్త స్లో అయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
