Begin typing your search above and press return to search.

బాబోయ్ ఆపేయండి... మహేష్‌ ఫ్యాన్స్‌ వేడుకోలు!

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు గత ఏడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   20 April 2025 3:00 AM IST
బాబోయ్ ఆపేయండి... మహేష్‌ ఫ్యాన్స్‌ వేడుకోలు!
X

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు గత ఏడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఆయన తదుపరి సినిమా ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు కారం తర్వాత కనీసం మూడు ఏళ్ల గ్యాప్‌ తర్వాత మహేష్‌ బాబు సినిమా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇప్పటికే ఏడాదిన్నర కావస్తుంది. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ప్రారంభం అయింది. వచ్చే ఏడాదిలో విడుదల కావడం సాధ్యం కాదని ఇప్పటికే తేలిపోయింది. 2027లో మహేష్‌-జక్కన్న సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మూడు సంవత్సరాలు మహేష్ బాబు ఫ్యాన్స్‌ సినిమాలు లేకుండా ఉండనక్కర్లేదు అంటూ ఆయన పాత సినిమాలను బ్యాక్‌ టు బ్యాక్‌ రీ రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు అత్యధిక సినిమాలను రీ రిలీజ్‌ చేసిన హీరోగా మహేష్ బాబు నిలిచాడు. ఇప్పటికే మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పోకిరి, బిజినెస్‌మెన్‌, ఒక్కడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే రీ రిలీజ్ అయ్యాయి. అవి చాలవు అన్నట్లుగా మరో మూడు సినిమాలు రెండు నెలల గ్యాప్‌లో రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఈనెల 26న మహేష్‌ బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్‌ అనే నేను సినిమా రీ రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి.

మే 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్‌ బాబు నటించిన రెండు సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. మే 30వ తారీకు ఖలేజా సినిమా రీ రిలీజ్ కాబోతుంది. అతడు తర్వాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇండస్ట్రీలో అతి పెద్ద డిజాస్టర్‌లలో ఖలేజా ఒకటి ఉంటుందని అంటారు. అయితే థియేటర్‌ రిలీజ్‌ ఫ్లాప్ అయిన ఖలేజా సినిమా టీవీ లో సూపర్ హిట్‌ అయింది. అందుకే ఖలేజా సినిమాను థియేటర్‌లో మళ్లీ చూడాలని కొందరు భావిస్తున్నారు. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఖలేజా సినిమా వెండి తెరపై రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయా అనే ఆసక్తి నెలకొంది.

ఖలేజా సినిమా మాత్రమే కాకుండా అతిథి కూడా రీ రిలీజ్ కాబోతుంది. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈమధ్య కాలంలో రీ రిలీజ్‌లు కామన్‌ అయ్యాయి. కానీ మరీ ఇంతగా రీ రిలీజ్‌లు చేస్తే అభిమానులు చూస్తారా అనే ఆలోచన కూడా లేకుండా మేకర్స్ సినిమాలను తీసుకు రావడం విడ్డూరంగా ఉందని కొందరు అంటున్నారు. రీ రిలీజ్ అంటే అభిమానులపై ఆర్థిక భారం పెంచడం తప్ప మరేం లేదు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను రీ రిలీజ్ చేస్తే పర్వాలేదు కానీ మరీ ఏడాదికి అయిదు నుంచి పది సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఎలా చూసేది అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సినిమాలు చాలా రీ రిలీజ్‌ అయ్యాయి. ఇకపై అయినా రీ రిలీజ్‌లను ఆపేయండి బాబోయ్‌ అంటూ ఫ్యాన్స్ కొందరు సోషల్‌ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో మహేష్‌ బాబు సినిమాల రీ రిలీజ్ గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్‌ పడుతున్నాయి.