Begin typing your search above and press return to search.

జక్కన్న 'వారణాసి'.. కాశీ సెట్స్ లా త్రిశూలంతో మహేష్ నడిచి వస్తుంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   27 May 2026 9:26 PM IST
జక్కన్న వారణాసి.. కాశీ సెట్స్ లా త్రిశూలంతో మహేష్ నడిచి వస్తుంటే..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్న ఆ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ ఇప్పటికే హాట్ టాపిక్‌ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త సెట్ ఫొటోస్, హాలీవుడ్ మీడియా పోస్టులు చూస్తుంటే.. రాజమౌళి ఈసారి మరో ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారనే ఫీలింగ్ కలుగుతోంది.

హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి కోసం భారీ రేంజ్ లో కాశీ నగరాన్ని రీ క్రియేట్ చేశారు. గంగ ఘాట్లు, పురాతన దేవాలయాలు, రాతి శిల్పాలు, దేవతా విగ్రహాలతో రూపొందించిన ఆ సెట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా హాలీవుడ్ మీడియా ప్రతినిధులు పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు సినిమాపై హైప్‌ ను మరింత పెంచేశాయి. కాశీని ఇంత గొప్పగా ఎప్పుడూ చూడలేదంటూ చేసిన కామెంట్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఆ సెట్ నిర్మాణానికి రూ.50 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రతి రాయి, ప్రతి విగ్రహం, ప్రతి షాడో కూడా నిజమైన కాశీ వాతావరణాన్ని గుర్తు చేసేలా డిజైన్ చేశారట. రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉందో ఆ సెట్స్ చూస్తే అర్థమవుతుందని చెప్పాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ రేంజ్ లో మరో విజువల్ వండర్ సృష్టించేందుకు సిద్ధమయ్యారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇక సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. రుద్ర అనే పవర్‌ ఫుల్ క్యారెక్టర్‌లో మహేష్ కనిపించబోతున్నారు. రాముడిగా కాసేపు సందడి చేయనున్నారు. అయితే చేతిలో త్రిశూలంతో కాశీ ఘాట్లపై మహేష్ నడుస్తూ వచ్చే సన్నివేశాలు ఊహించుకుంటేనే గూస్‌ బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేష్ లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.

గతేడాది నవంబర్‌ లో వారణాసి టైటిల్ గ్లింప్స్ కోసం నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ సందర్భంగా హాలీవుడ్ మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా సెట్స్‌ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు మీడియాకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదనే చర్చ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.

రాజమౌళి సినిమాల్లో విజువల్స్ మాత్రమే కాదు.. ఎమోషన్, కల్చర్, మైథాలజీకి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. వారణాసిలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులకు చూపించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కాశీ నేపథ్యాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో మిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి.. మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని కాశీ ఘాట్లపై నడుస్తూ కనిపించే రోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.