Begin typing your search above and press return to search.

SSMB29 : సమ్మర్‌ హాలీడేస్‌ పూర్తి

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వచ్చి అప్పుడే మూడు ఏళ్లు పూర్తి అయింది. ఇటీవలే ఆయన కొత్త సినిమాను మహేష్‌ బాబు హీరోగా ప్రారంభించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   6 Jun 2025 12:58 PM IST
SSMB29 : సమ్మర్‌ హాలీడేస్‌ పూర్తి
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వచ్చి అప్పుడే మూడు ఏళ్లు పూర్తి అయింది. ఇటీవలే ఆయన కొత్త సినిమాను మహేష్‌ బాబు హీరోగా ప్రారంభించిన విషయం తెల్సిందే. గత ఏడాది చివర్లోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటికీ ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటున్నాడు. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేసిన రాజమౌళి ఆ తర్వాత ఒడిశాలో రెండో షెడ్యూల్‌ చేసిన విషయం తెల్సిందే. మూడో షెడ్యూల్‌ను గత నెలలో చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మహేష్‌ బాబు సమ్మర్‌ హాలీడేస్‌ను తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

గత నెల మొత్తం షూటింగ్‌కు దూరంగా ఉన్న మహేష్ బాబు ఎట్టకేలకు షూటింగ్‌కి జాయిన్‌ కాబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్‌ 9 నుంచి సినిమా కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కార్తికేయ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. రాజమౌళి సినిమాలు అంటే భారీ సెట్టింగ్‌లు ఉంటాయి. ఈ సినిమా కోసం కూడా హైదరాబాద్‌లో భారీ సెట్‌ వర్క్‌ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ను ఆఫ్రికాలో నిర్వహించాలని భావించారు. కానీ ఒక చిన్న షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చేయబోతున్నట్లు కొత్త ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాను భారీ యాక్షన్‌ అడ్వంచర్‌గా రూపొందిస్తున్నాడు. రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని, హాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం మెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మహేష్ బాబు చేయబోతున్న మొదటి పాన్‌ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాతో మహేష్ బాబు పాన్‌ వరల్డ్‌ హీరోగా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయి సినిమాగా కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్‌ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సినిమా నేపథ్యం గురించి, మహేష్ బాబు పాత్ర గురించి ఏమైనా హింట్ లభిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీడియా వారికి, ఇండస్ట్రీలో కీలకంగా ఉండే వారికి, చివరకు మహేష్ బాబు ఆప్తులకు సైతం సినిమా గురించి పెద్దగా తెలియడం లేదట. రాజమౌళి ఎప్పుడు నోరు విప్పుతాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను వెళ్లడిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా జోనస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 2027లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.