ఖలేజా రీ రిలీజ్.. అక్కడ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు
నెల రోజులుగా మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న 'ఖలేజా' సినిమా రీ రిలీజ్ అయింది.
By: Tupaki Desk | 30 May 2025 11:19 AM ISTనెల రోజులుగా మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న 'ఖలేజా' సినిమా రీ రిలీజ్ అయింది. నిన్నటి నుంచే థియేటర్లలో ఖలేజా సందడి మొదలైంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో మాత్రమే సినిమా రీ రిలీజ్ సందడి ఉంటుందని అంతా భావించారు. కాని తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా ఖలేజా సినిమా రీ రిలీజ్ సందడి కనిపిస్తోంది. థియేటర్ల వద్ద మహేష్ బాబు అభిమానుల కోలాహలం ఓ రేంజ్‌లో ఉంది. విదేశాల్లోనూ ఖలేజా సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానుల సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఓ రేంజ్‌లో ఖలేజా సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ జరిగిన విషయం ముందు నుంచే ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.
మహేష్ బాబు కొత్త సినిమా వస్తే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గురించి అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఖలేజా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఖలేజా సినిమా రీ రిలీజ్‌కి అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు. మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ అంటే ఎప్పుడూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉంటుంది.
ఖలేజా సినిమా రీ రిలీజ్‌కి ఉత్సాహంగా వెళ్లిన వారికి మేకర్స్ షాక్ ఇచ్చారు. చాలా థియేటర్‌లలో సినిమాకు అత్యంత కీలకమైన సెకండ్ హాఫ్‌లోని సన్నివేశాలను తొలగించారు, అంతే కాకుండా సండే మండే పాట కూడ ఆ తొలగించారు. సినిమా నిడివిని తగ్గించడం ద్వారా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతాయని మేకర్స్ భావించి ఉంటారు. కానీ ఏ థియేటర్‌లో అయితే ఆ పాట, కొన్ని మహేష్ బాబు కామెడీ సీన్స్‌ను తొలగించారో ఆ థియేటర్లలో ఫ్యాన్స్ ఆందోళన చేశారు. థియేటర్ల యాజమాన్యం ఈ పని చేసి ఉంటుందని ఫ్యాన్స్ గొడవకు దిగారు. సీట్లపై నిలబడి నినాదాలు చేస్తూ షో ఆపించారు. కొన్ని చోట్ల చేసేది లేక షో రద్దు చేస్తే కొన్ని చోట్ల అలాగే కంటిన్యూ చేశారు.
థియేటర్లలో వస్తున్న స్పందన, ఆ సీన్స్ తొలగించడం వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో వెంటనే మకర్స్ సర్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రి ఖలేజా ఒరిజినల్ ప్రింట్స్‌ను రెడీ చేశారని తెలుస్తోంది. నేటి నుంచి అప్పట్లో థియేటర్ లో ఉన్న నిడివితో, టీవీలో వచ్చిన నిడివితో సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఖలేజా సినిమాను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే నేటి నుంచి థియేటర్లలో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మొదట నిడివి తగ్గించడం అనేది తెలివి తక్కువ తనం అంటూ అభిమానులు మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖలేజా రీ రిలీజ్‌తో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని, అత్యధిక వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
