Begin typing your search above and press return to search.

స్టూడియో అంతా ప‌రుగులెట్టించిన మ‌హేష్‌!

కోట్ల మంది అభిమానులను నటనతో అలరిస్తున్న హీరో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి ముందు సినిమాలంటే అస్సలు ఇష్టపడలేదనే నిజం చాలా మందికి తెలియదు.

By:  Srikanth Kontham   |   26 Jun 2026 10:00 PM IST
స్టూడియో అంతా ప‌రుగులెట్టించిన మ‌హేష్‌!
X

సూపర్ స్టార్ మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ స్టైల్ , లార్జర్-దెన్-లైఫ్ క్యారెక్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ అడ్వెంచర్ ఎపిక్ `వారణాసి` కోసం అంతర్జాతీయ స్థాయి మేకోవర్‌తో సిద్ధమవుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌హేష్‌ చిన్నప్పుడు సెట్స్ లో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన ఆసక్తికర సంఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల మంది అభిమానులను నటనతో అలరిస్తున్న హీరో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి ముందు సినిమాలంటే అస్సలు ఇష్టపడలేదనే నిజం చాలా మందికి తెలియదు.

ఈ క్రేజీ ఇన్సిడెంట్ మహేష్ బాల్యంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ సెట్స్ లో జరిగింది. అప్పట్లో తండ్రి షూటింగ్‌లను చూడటానికి సరదాగా స్టూడియోకి వెళ్లిన చిన్నారి మహేష్‌ను.. అక్కడ ఉన్న మేకర్స్ ఒకసారి పలకరిస్తూ `సినిమాలో యాక్ట్ చేస్తావా మహేష్? అని క్యాజువల్‌గా అడిగారు. అంతే ఆ ప్రశ్న వినడమే ఆలస్యం.. ఏమాత్రం ఆలోచించకుండా గట్టిగా లేదు.. నేను చేయను అంటూ మహేష్ ఆ స్టూడియో అంతా ఎవరికీ చిక్కకుండా పరుగుల లంకించుకున్నారు. షూటింగ్ క్రూ మొత్తం ఆ చిన్నారిని పట్టుకోవడానికి ప్రయత్నించినా? ఎవరికీ దొరకకుండా స్టూడియో నలుమూలలా పరుగెత్తిస్తూ అందరినీ ముప్పితిప్పలు పెట్టారు.

ఆ సమయంలో స్టూడియోలో ఉన్న వారంతా మహేష్ చేసిన ఆ పరుగుల హడావుడిని చూసి నవ్వుకున్నారట. సినిమాల బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ చిన్న వయసులో కెమెరా ముందుకు రావడానికి ఆయన ఎంతగా మొహమాటపడ్డారో? ఈ సంఘటన నిరూపిస్తోంది. ఒక స్టార్ కిడ్‌గా పుట్టి సెట్స్ లోనే పెరుగుతున్నా.. చైల్డ్ హుడ్‌లో నటన పట్ల పెద్దగా ఆసక్తి చూపించని మహేష్ ఆ తర్వాత కాలంలో అదే స్టూడియోలను తన నటనతో, రికార్డులతో రూల్ చేస్తారని అప్పట్లో అక్కడ ఉన్నవారెవ్వరూ ఊహించి ఉండరు.

ఆ తర్వాత కాలంలో తండ్రి కృష్ణ ప్రోత్సాహంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెమెరా ముందుకు వచ్చిన మహేష్ బాలనటుడిగానే `పోరాటం`, `శంఖారావం`, `బజార్ రౌడీ`, `కొడుకు దిద్దిన కాపురం` వంటి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్నారు. చిన్నప్పుడు ఏ స్టూడియోలో అయితే దొరకకుండా పరుగెత్తారో? అదే స్టూడియో ఫ్లోర్స్‌పై బాలనటుడిగా క్లిష్టమైన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా మార్కులు కొట్టేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆయన చూపించిన నటన, క్రమశిక్షణే ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ అవ్వడానికి బలమైన పునాదిగా మారాయి.

మహేష్ కెరీర్ గ్రాఫ్ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. చిన్ననాటి ఆ అమాయకత్వపు పరుగుల నుంచి.. నేడు ఇంటర్నేషనల్ వైడ్ గా జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లలో కఠినమైన ట్రెకింగ్ ట్రైనింగ్ తీసుకునే స్థాయికి ఆయన ఎదగడం వెనుక అసాధారణమైన కష్టం ఉంది. నటనంటే భయపడి పారిపోయిన చిన్నారి నేడు భారతీయ సినిమా వ్యాపార రంగాన్ని శాసించే స్థాయికి ఎదగడం, గ్లోబల్ మార్కెట్ పై కన్నేయడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డుగా చెప్పొచ్చు.