Begin typing your search above and press return to search.

మహేష్ చెప్పిందే నిజమైంది.. అతిథి రీరిలీజ్ రెస్పాన్స్ వైరల్!

టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ గత కొన్నేళ్లుగా ఊపందుకుంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 May 2026 12:10 PM IST
మహేష్ చెప్పిందే నిజమైంది.. అతిథి రీరిలీజ్ రెస్పాన్స్ వైరల్!
X

టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ గత కొన్నేళ్లుగా ఊపందుకుంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన హీరోల క్లాసిక్ సినిమాల‌ను బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రతి రీరిలీజ్‌కు ఒకే రకమైన రెస్పాన్స్ వస్తుందనే గ్యారంటీ లేదని తాజాగా మహేష్ బాబు నటించిన అతిథి సినిమా నిరూపించినట్టుగా కనిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య రీరిలీజ్ అయిన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన కేంద్రాల్లో కొన్ని సింగిల్ స్క్రీన్లలో మాత్రమే ప్రేక్షకుల సందడి కనిపించగా, మిగతా ప్రాంతాల్లో ఆక్యుపెన్సీలు సాధారణంగానే నమోదయ్యాయి. అంతేకాదు, మహేష్ బాబుకు స్ట్రాంగ్ మార్కెట్‌గా పేరున్న అమెరికాలో కూడా ఈ సినిమాకు రెస్పాన్స్ అంతగా లేకపోవడం విశేషం.

ఈ పరిణామం తర్వాత సోషల్ మీడియాలో రీరిలీజ్‌ల అవసరంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రతి నెలా ఒక స్టార్ హీరో సినిమా రీరిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జరిగే రీరిలీజ్‌లు ఇప్పుడు సాధారణ వ్యవహారంగా మారిపోయాయని, దీంతో రీరిలీజులు వాటి ప్రత్యేకత కోల్పోతున్నాయని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ అభిమానులే కొన్ని సినిమాలకు మాత్రమే మళ్లీ మళ్లీ ప్రేక్షకాదరణ ఉంటుందని చెబుతున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాల‌కు ఎప్పుడైనా రీరిలీజ్ క్రేజ్ ఉంటుందని, కానీ అన్ని సినిమాలు అదే స్థాయి ఆదరణ పొందలేవని అభిప్రాయపడుతున్నారు. స్టోరీ, ఎంట‌ర్టైన్మెంట్, ఎమోషనల్ కనెక్ట్, కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సినిమాల‌కే ఆడియ‌న్స్ మళ్లీ టికెట్ కొనడానికి సిద్ధపడతారని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు గతంలో చెప్పిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల‌వుతోంది. తన సినిమాలను బాగుంటేనే అత‌ని ఫ్యాన్స్ చూస్తార‌ని, బాగోలేకపోతే వాళ్లు కూడా చూడర‌ని మహేష్ స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. త‌న ఫ్యాన్స్ స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆయన అప్పుడే పేర్కొన్నారు. ఇప్పుడు అతిథి రీరిలీజ్ ఫలితాన్ని చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అభిమాన హీరో సినిమా అయినప్పటికీ, ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాల‌కే మద్దతు ఇస్తారనే వాదనకు ఇది ఉదాహరణగా మారిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే, రీరిలీజ్‌ల ట్రెండ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ప్రతి సినిమాకు ఒకే స్థాయి ఆదరణ దక్కదనే విషయాన్ని అతిథి మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కేవలం స్టార్ ఇమేజ్‌ను కాకుండా ప్రేక్షకుల నిజమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని రీరిలీజ్‌లను ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.