Begin typing your search above and press return to search.

‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ

మహేంద్రగిరి అనే ఊరిలో రాజవంశీకులైన ఓ కుటుంబాన్ని 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం వెంటాడుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 Sept 2026 2:00 PM IST
‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ
X

‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ

నటీనటులు: సుమంత్- సిద్ధు జొన్నలగడ్డ- ఐశ్వర్య రాజేష్- మాళవిక నాయర్- ప్రభ- బ్రహ్మానందం- కమల్ కామరాజు- వెన్నెల కిషోర్- రాజీవ్ కనకాల-సురేష్ తదితరులు

సంగీతం: అనూప్ రూబెన్స్

ఛాయాగ్రహణం: ప్రతాప్ ఆర్.కృష్ణ

నిర్మాతలు: మధు-లక్ష్మణ్

రచన-దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి

అప్పుడప్పుడో ఓ మంచి సినిమాతో పలకరించి.. ఆ తర్వాత నిరాశపరుస్తూ ఉంటాడు సుమంత్. ‘అనగనగా’ తర్వాత తన నుంచి మళ్లీ ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ‘న్యూటన్స్ థర్డ్ లా’ పర్వాలేదనిపించింది కానీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

మహేంద్రగిరి అనే ఊరిలో రాజవంశీకులైన ఓ కుటుంబాన్ని 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం వెంటాడుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో పుట్టిన మగవాళ్లలో ఎవ్వరైనా 33 జన్మతిథులు రాగానే చనిపోతుంటారు. రాజేంద్ర వర్మ (సిద్ధు జొన్నలగడ్డ) కూడా అలాగే మరణిస్తే.. అతడి తర్వాత ఆ కుటుంబ వారసుడైన వ్యక్తి తనకు 33వ తిథి సమీపిస్తుండేసరికి ఆందోళనకు గురవుతాడు. అతణ్ని కాపాడడానికి కాశీ నుంచి వచ్చిన పండితుడు కూడా అనూహ్యంగా మరణిస్తే.. 33వ జన్మతిథి రోజూ ఊరి ఆలయంలో జరిగిన ప్రమాదంలో ఆ వ్యక్తి కూడా చనిపోతాడు. రాజవంశీయుడితో పాటు అనుకోకుండా తన సోదరుడు కూడా మరణించడంతో సిద్దార్థ (సుమంత్) ఆ ఊరికి వచ్చి ఈ మరణాల వెనుక ఉన్న గుట్టేంటో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. మరి అమ్మవారి శాపమే ఈ మరణాలకు దారి తీసిందా.. లేక వేరే కారణముందా? ఈ మర్మమేంటో సిద్దార్థ కనిపెట్టాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘ఫంకీ’ సినిమాలో చిన్న క్యామియో చేసిన నిర్మాత దిల్ రాజు.. అందులో డైరెక్టర్ అయిన హీరో తన దగ్గర ఏదో కథ గురించి ప్రస్తావిస్తే.. ఇప్పుడది ట్రెండు కాదు.. ఏదైనా దేవుడి కథ ట్రై చెయ్యి.. కొత్త కొత్త ఆయుధాలు పెట్టు.. శ్లోకాలు జోడించు.. అంటూ సెటైర్ వేస్తాడు. ‘కాంతార’.. ‘కార్తికేయ-2’ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడేశాయని.. ఫిలిం మేకర్స్ డివైన్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు చేయడం చూస్తే అక్కడ దిల్ రాజు సెటైరిగ్గా అన్న మాటనే ఫాలో అయిపోతున్నారా అనిపిస్తుంది. ఐతే ట్రెండును ఫాలో అవడంలో తప్పు లేదు కానీ.. ఈ కథలను ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు.. చెప్పాలనుకున్నది ఎంత కన్విన్సింగ్ గా చెప్పారు అన్నది కీలకం. ‘మహేంద్రగిరి వారాహి’లో వారాహి అమ్మవారి చుట్టూ కథను నడిపించి.. చివర్లో అమ్మవారి విశ్వరూప దర్శనం చేయించడం చూస్తే.. ఇప్పుడున్న ట్రెండులో కథ ఇలా ఉంటే.. అలాంటి సన్నివేశాలు పెడితే జనం చూసేస్తారన్న భ్రమతో ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. లేదంటే తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. కథల ఎంపికలో మంచి అభిరుచి ఉందని చాటే సుమంత్ ఇలాంటి పేలవమైన స్క్రిప్టును ఓకే చేసి సినిమా చేయడం.. ఇలాంటి ఔట్ పుట్ తో సినిమాను బయటికి తీసుకురావడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

థ్రిల్లర్ లక్షణాలున్న కథల్లో చివర్లో ఎవ్వరూ ఊహించని వ్యక్తి విలన్ అని తేలితే.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టడం సహజం. కానీ ఇక్కడ విలన్ ఎవరో తెలిసినపుడు.. ప్రేక్షకులు వెటకారంగా నవ్వడం మొదలుపెడితే.. తాను చేసిన హత్యలకు కారణమేంటో చెప్పినపుడు ఇదేం లాజిక్కురా బాబూ అని జుట్టు పీక్కుంటారు అంటే.. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. ప్రేక్షకుల ఏమాత్రం కన్విన్స్ కాలేని విలన్ క్యారెక్టర్లను పెట్టడం.. కారణాలను చూపించడం వల్ల మొత్తం సినిమానే నవ్వుల పాలైపోయే పరిస్థితి వచ్చిందన్నది కఠిన వాస్తవం. అంత అన్ కన్విన్సింగ్ గా.. చాలా సిల్లీగా పతాక సన్నివేశాలను డీల్ చేశాడు దర్శకుడు. విలన్లు ఎవరన్నది తెలియడం ఒకెత్తయితే.. ఆ తెలిసే సన్నివేశాలను తీర్చిదిద్దిన వైనం ఇంకో ఎత్తు. తెర మీద నటుడు భయానక రసాన్ని పండిస్తుంటే.. అది చాలా కామెడీగా అనిపిస్తుందంటే ఆ సన్నివేశాన్ని ఎంత పేలవంగా తీశారో అర్థమైపోతుంది. ఒక గొప్ప ఆర్టిస్టు కూడా పూర్తిగా తేలిపోయే పరిస్థితి వచ్చింది ‘మహేంద్రగిరి వారాహి’ పతాక సన్నివేశాల్లో.

ఒక ఊరిలో వరుస మరణాలు సంభవిస్తుంటాయి. ఊరి జనాలేమో అది దాని వెనుక దేవుడో దయ్యమో ఉందంటారు. అలాంటి చోటికి సైంటిఫిక్ టెంపర్ బాగా ఉన్న హీరో వచ్చి ఆ మరణాల వెనుక గుట్టును కనిపెడతాడు. అదే సమయంలో బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద దేవుడి పాత్రనూ ఎలివేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ‘కార్తికేయ’ సహా ఎన్నో సినిమాల్లో చూసిన లైనే ‘మహేంద్రగిరి వారాహి’లోనూ చూస్తాం. కథ మొదలైన తీరుతోనే.. ఇది ఎలా నడుస్తుందన్నది అర్థమైపోతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్టులతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర జంట మరణాలతో కథ కాస్త రసకందాయంలో పడ్డట్లు కనిపిస్తుంది. కానీ ఆ క్యూరియాసిటీని ద్వితీయార్ధం ఏమాత్రం కొనసాగించలేకపోయింది. ఒక కంటిన్యుటీ లేకుండా.. చాలా పరిమిత వనరుల మధ్య తీసిన సన్నివేశాలు సినిమాలో ఆసక్తిని అంతకంతకూ తగ్గించేస్తాయి. ఇక పతాక సన్నివేశాలు చూశాక ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయి దండం పెట్టేసే పరిస్థితి వస్తుంది. సినిమా మీద ఏ కాస్త ఇంప్రెషన్ ఉన్నా.. చివరి సన్నివేశాలు చూశాక పోతుంది. తెలుగులో వచ్చిన కాస్త పేరున్న సినిమాల్లో వరస్ట్ క్లైమాక్స్ అవార్డుకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నాయి పతాక సన్నివేశాలు. అలాంటి సీన్లు చూశాక సినిమా మీద చివరగా ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నటీనటులు:

కొన్ని సినిమాలు చేస్తున్నపుడే వాటి ఫలితమేంటో నటీనటులకు అర్థమైపోతుందేమో. కొన్ని చోట్ల సుమంత్ హావభావాలు చూస్తే ఈ సందేహమే కలుగుతుంది. మంచి నటుడైన అతను కూడా కొన్ని చోట్ల క్లూ లెస్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడీ సినిమాలో. కొన్ని చోట్ల బాగానే నటించినా.. చాలా వరకు సుమంత్ అన్యమనస్కంగానే నటించినట్లు అనిపిస్తుంది. సినిమాకు ఆకర్షణ తేవాలని పెట్టారేమో కానీ.. సిద్ధు జొన్నలగడ్డ ఇందులోని రాజేంద్ర వర్మ పాత్రకు పూర్తిగా మిస్ ఫిట్. మాళవిక నాయర్ ఓకే. ఐశ్వర్య రాజేష్ చిన్న క్యామియోలో మెరిసింది. సీనియర్ నటి ప్రభ తన పాత్రకు న్యాయం చేసింది. ‘హ్యాపీడేస్’ వంశీ.. కమల్ కామరాజు.. రాజీవ్ కనకాల.. వీళ్లంతా ఓకే. బ్రహ్మానందం.. వెన్నెల కిషోర్ గురించి ప్రస్తావించాల్సిందేమీ లేదు.

సాంకేతిక వర్గం:

పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ‘మహేంద్రగిరి వారాహి’లో సాంకేతిక హంగులు కూడా కంటెంటుకి తగ్గట్లే తయారయ్యాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అనూప్ రూబెన్స్ పాటలు-నేపథ్య సంగీతం విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రతాప్ కృష్ణ కెమెరా పనితనం కూడా ఏమంత గొప్గపా లేదు. నిర్మాణ విలువల విషయంలో బాగా రాజీ పడ్డారు. చాలా సన్నివేశాలను మొక్కుబడిగా చుట్టేశారు. రైటర్ కమ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లమూడి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. రైటింగ్.. టేకింగ్ అన్నింట్లోనూ తేలిపోయాడు.

చివరగా: మహేంద్రగిరి వారాహి.. మహా బోర్

రేటింగ్ - 2/5