దేవతలనే సవాల్.. హిరణ్యకశిపుడి ప్రోమో చూశారా?
ఇప్పుడు అదే జోష్ తో రాక్షస రాజు హిరణ్యకశిపుడి పాత్రను మేకర్స్ మంగళవారం పరిచయం చేశారు. ఆ సమయంలో వీడియో కూడా రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 1 July 2025 2:04 PM ISTప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ గురించి అందరికీ తెలిసిందే. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పలు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను అనౌన్స్ చేసింది.
యూనివర్స్ లో భాగంగా ఏకంగా ఏడు సినిమాలు తీసుకురానున్నట్లు తెలిపింది. విష్ణుమూర్తి పది అవతారాలపై చిత్రాలు తీస్తున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగా ఇప్పుడు తొలి చిత్రం మహావతార్: నరసింహను రూపొందిస్తోంది. జూలై 25న ఆ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న మహావతార్ నరసింహ మూవీని శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. భారీ రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలను నెలకొల్పింది. మేకర్స్ విజన్ పై బజ్ క్రియేట్ చేసి వారిలో జోష్ నింపింది.
ఇప్పుడు అదే జోష్ తో రాక్షస రాజు హిరణ్యకశిపుడి పాత్రను మేకర్స్ మంగళవారం పరిచయం చేశారు. ఆ సమయంలో వీడియో కూడా రిలీజ్ చేశారు. అధర్మానికి రూపం.. దేవతలనే సవాలు చేసే తత్వం అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియన్స్ ను యమా రెస్పాన్స్ అందుకుంటోంది.
అన్నీ నాశనమైపోయాయి అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో గ్లింప్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత విష్ణువును పూజిస్తున్నావా అంటూ రాక్షస రాజు అందరినీ చంపేస్తుంటాడు. "ఇకపై మీరందరికీ ఏకైక భగవంతుడిని నేనే.. దేవాలయాల్లో నా విగ్రహాలు ఉండాలి.. కాచుకో విష్ణు.. భక్తులందరినీ వెతికి చంపుతూ.. నీవు ఎప్పుడైనా నా ముందుకు రాక తప్పదు" అంటూ హిరణ్యకశిపుడిని పరిచయం చేశారు.
అయితే వీడియో వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం మూవీ అందించనున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ప్రతి ఒక్క విజువల్ కూడా రిచ్ గా ఉంది. యానిమేషన్ ఓ రేంజ్ లో ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఓవరాల్ గా గ్లింప్స్.. అంచనాలు పెంచుతుందని అంటున్నారు.
