నరసింహస్వామి అవతారంపై హోంబలే సినిమా
కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి పాన్ ఇండియన్ చిత్రాలను అందించిన హోంబలే సంస్థ వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 12 May 2025 4:45 AMపురాణేతిహాసాలపై భారీ పాన్ ఇండియన్ సినిమాలు తెరకెక్కించాలనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఫిలింమేకర్స్ లో ఉంది. అయితే దీనికోసం వందల కోట్ల బడ్జెట్లు అవసరం. పైగా ప్రతి భాష నుంచి స్టార్లను వెతికి హాలీవుడ్ స్థాయిలో సాంకేతిక నిపుణులను సమకూర్చుకుని, విజువల్ వండర్ ని క్రియేట్ చేస్తేనే జనం థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి కథలను ఒరిజినాలిటీ చెడకుండా ఉన్నది ఉన్నట్టు తీయలి. లేదంటే మనోభావాల కాలంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాలి. ఇంత చేసినా రిలీజయ్యాక హిట్టవుతుందంటే చెప్పలేం.
ఏ యుద్ధం వచ్చిందనో, కరోనా రంగ ప్రవేశం చేసిందనో వార్త వెలువడితే చాలు జనం ఓటీటీలో చూద్దాం.. థియేటర్లకు ఎందుకులే! అనుకుంటున్నారు. మరి ఇలాంటి క్లిష్ఠ పరిస్థితిలో పురాణేతిహాసాలను ప్రజలకు ఎలా చూపించాలో ఇప్పుడు హోంబలే ఫిలింస్ చేసి చూపిస్తోంది. మహావతార్ నరసింహా పేరుతో విష్ణువు అవతారాల్లో అత్యంత కీలక అవతారాన్ని ప్రజలకు యానిమేటెడ్ ఫిలిం రూపంలో చూపించేందుకు సన్నాహకాల్లో ఉంది హోంబలే. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి పాన్ ఇండియన్ చిత్రాలను అందించిన హోంబలే సంస్థ వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తోంది.
హోంబలేతో కలిసి అశ్విన్ కుమార్ నిర్మించిన 'మహావతార్ నరసింహ' జూలైలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహావతార్ సిరీస్ నుండి మొదటి ప్రాజెక్ట్ టీజర్ ని మూడు నెలల క్రితం విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. విష్ణువు అనేక అవతారాలను ఈ సిరీస్ లో చూపించబోతున్నామని హోంబలే ప్రకటించింది. తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ, థియేటర్లకు రావాల్సిందిగా హోంబలే సంస్థ కోరింది. నరసింహ స్వామి శక్తివంతమైన గర్జనను అనుభూతి చెందడానికి.. పెద్ద తెరపై ఇంతకు ముందు ఎన్నడూ లేని అనుభవాన్ని పొందడానికి! #మహావతార్ నరసింహ గ్లింప్స్‌ను ప్రదర్శిస్తున్నాము. గర్జనతో మీ ఆత్మను మేల్కొల్పండి! అనుభవించండి. జీవించండి... బీ రెడీ.. ! అంటూ టీజ్ చేసింది.
`మహావతార్ నరసింహ` అద్భుతమైన పురాణేతిహాస కథ. అత్యంత క్రూరమైన, సగం మనిషి- సగం సింహం అవతారం.. విష్ణువు అత్యంత శక్తివంతమైన అవతారం అయిన నరసింహ భగవానుడి పురాణ కథకు ప్రాణం పోసే ప్రయత్నమిది. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు కథను ఇందులో చూపిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదల కానుంది.