దేవుడ్ని నమ్మని నిర్మాత దేవుడి సినిమా తీసి బంపర్ హిట్ కొట్టారు
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. పెద్దగా ప్రచార అర్భాటం లేని మూవీకి.. టికెట్లు దొరకని పరిస్థితి ఉండటం ఇటీవల కాలంలో చూసింది లేదు. ఆ కొరతను తీర్చింది మహావతార్ నరసింహ మూవీ.
By: Tupaki Desk | 31 Aug 2025 11:00 AM ISTఅద్భుత విజయం ఉత్తనే రాదు. అందుకోసం తీవ్రంగా శ్రమించాలి.కష్టపడాలి. కమిట్ మెంట్ .. నిజాయితీ కలగలిస్తే అద్భుతమైన ఫలితం వస్తుంటుంది. అందుకు నిలువెత్తు రూపంగా ఇటీవల కాలంలో సూపర్ హిట్ చిత్రంగా.. వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన మూవీ ‘మహావతార్ నరసింహ’.ఈ కన్నడ డబ్బింగ్ సినిమాకు మొదట్లో పెద్దగా థియేటర్లే లేవు. అయితే.. అనూహ్య రీతిలో కలెక్షన్ల వరదతో స్క్రీన్ల సంఖ్య భారీగా పెరిగిన పరిస్థితి.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. పెద్దగా ప్రచార అర్భాటం లేని మూవీకి.. టికెట్లు దొరకని పరిస్థితి ఉండటం ఇటీవల కాలంలో చూసింది లేదు. ఆ కొరతను తీర్చింది మహావతార్ నరసింహ మూవీ. షాకింగ్ నిజం ఏమంటే.. ఈ దేవుడి సినిమా తీసిన దర్శక నిర్మాత అశ్విన్ కుమార్ జీవితంలో దేవుడ్ని అస్సలంటే అస్సలు నమ్మరన్నది తెలిస్తే నమ్మాలనిపించదు. కానీ.. ఇది నిజం. యానిమేషన్ సినిమా.. అందునా దేవుడి సినిమా అంటే.. అదెంత రిస్కు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలబై కోట్లతో తీసిన ఈ మూవీకి ఏకంగా రూ.282 కోట్ల కలెక్షన్లు రావటం.. ఇప్పటికి కొన్ని స్క్రీన్లతో ఈ సినిమా రన్ అవుతోంది.
ఐదేళ్ల పాటు వీరు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని తాజాగా అందుకున్నారు. మొదటి సినిమాతో అదిరే కలెక్షన్లతో భారీ సక్సెస్ సినిమాను తీసిన క్రెడిట్ ను అశ్విన్ కుమార్ సొంతం చేసుకున్నారు. అయితే..ఈమూవీని నిర్మించే వేళలో ఎదురైన సవాళ్ల గురించి తెలిసినప్పుడు మాత్రం.. అద్భుత విజయానికి వంద శాతం అర్హులన్న భావన కలుగక మానదు. చిన్నప్పటి నుంచి అశ్విన్ కుమార్ కు దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు.
వీఎఫ్ఎక్స్ రంగంలో ఉన్న అనుభవంతో ఢిల్లీలో క్లీం పేరుతో వీఎఫ్ఎక్స్ స్టూడియాను ప్రారంభించిన అశ్విన్.. మెక్ డొనాల్డ్స్.. మారుతి.. లెనొవా.. ఎరోస్ ఇంటర్నేషనల్ లాంటి పెద్ద సంస్థలకు పని చేశారు. కొన్నేళ్ల క్రితం భగవద్గీత చదవటం మొదలైనప్పటి నుంచి అందులో ఆసక్తితో పాటు.. క్రిష్ణ భక్తుడిగా మారాను. అలా ఐదేళ్ల క్రితం ప్రహ్లాదుడు.. నరసింహస్వామి కథను సినిమాగా తీయాలనిపించిందని చెబుతారు.
ఈ సినిమా కోసం తమ దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందని అశ్విన్ ఆయన సతీమణి శిల్పా భావించారు. పెళ్లికి ముందు శిల్ప లండన్ లో పని చేసి బాగానే ఆర్జించారు.దీంతో..వీరి వద్ద ఉన్న ఆస్తులు.. బ్యాంకు బ్యాలెన్స్ తో తాము అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయొచ్చని మహావతార్ మూవీని షురూ చేవారు.
అయితే.. అనూహ్య రీతిలో పెరిగిన బడ్జెట్ తో కోట్లకు కోట్లు అవసరమయ్యాయి. ఇన్వెస్టర్లను వెతకాల్సి వచ్చింది. ఈ క్రమంలో వందకు పైగా ఇన్వెస్టర్లను.. నిర్మాతల్నీ కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఓవైపు ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఫిక్సెడ్ డిపాజిట్లు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఇష్టంగా కట్టుకున్న ఇంటిని తాకట్టు పెట్టేశాం. నగలు.. కారు.. ఇలా అన్నింటినీ అమ్మేశాం. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు. చివరకు శిల్ప కూడా తన పుట్టింటి వారి ఆర్థిక సహకారాన్ని తీసుకున్నారు. అయినా సరిపోలేదు.
దేవుడి సినిమా ఆడే పరిస్థితి లేదని భయపెట్టేవారని.. చివరకు ఏమీ పాలు పోలేని పరిస్థితుల్లో.. సినిమా పోయినా ఫర్లేదు.. తిరిగి యానిమేషన్.. వీఎఫ్ ఎక్స్ పనులు చేసుకుందామని తామిద్దరం డిసైడ్ అయినట్లు అశ్విన్ కుమార్ చెబుతారు. ముంబయికి చెందిన అపార్ గ్రూపు సంస్థ సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు రావటం.. సినిమాను మార్కెట్ చేయటానికి హొంబలె సంస్థ (కేజీఎఫ్.. సలార్) సంస్థ ముందుకు రావటంతో ఈ మూవీ జులై 25న రిలీజ్ అయ్యింది. మొదటి పది రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ప్రస్తుతానికి రూ.282 కోట్లతో దేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి యానిమేషన్ మూవీగా నిలిచింది. కష్టం ఊరికే పోదంటారు. అందుకు నిలువెత్తు నిదర్శంగా మహావతార్ నరసింహ మూవీ నిర్మాణాన్ని చెప్పకతప్పదు.
