Begin typing your search above and press return to search.

మహావతార్ యూనివర్స్‌తో హోంబలే సంచలనం

పాన్ ఇండియా హిట్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 3:28 PM IST
మహావతార్ యూనివర్స్‌తో హోంబలే సంచలనం
X

పాన్ ఇండియా హిట్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్, ‘కాంతారా’, ‘సలార్’ వంటి చిత్రాలతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు భారతీయ మానవతా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.


‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరిట విష్ణువు దశావతారాల ఆధారంగా 7 భారీ యానిమేటెడ్ సినిమాలను రూపొందించేందుకు హోంబలే ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. క్లీం ప్రొడక్షన్స్‌తో కలిసి రూపొందిస్తున్న ఈ యూనివర్స్‌ను దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించబోతున్నారు. సహ నిర్మాతగా శిల్పా ధావన్ వ్యవహరిస్తుండగా, సినిమాలన్నీ భారతీయ ఆధ్యాత్మికతకు, పురాణాలకు తగ్గట్టుగా నిలవనున్నాయని మేకర్స్ స్పష్టం చేశారు.

2025 జూలై 25న మొదటి సినిమా 'మహావతార్ నరసింహ' విడుదల కానుంది. ఈ సినిమాను 3Dలో, ఐదు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రేక్షకులకు విశిష్టమైన విజువల్ అనుభూతిని అందించేందుకు అన్ని సాంకేతిక ప్రమాణాలు పాటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యానిమేషన్ ఫార్మాట్‌లో రాబోతున్న ఈ చిత్రాలు పిల్లలు, యువత, కుటుంబ ప్రేక్షకులందరికీ చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఈ యూనివర్స్‌లో భాగంగా మహావతార్ కామిక్స్ పేరుతో 100 ఎడిషన్లు విడుదల కానున్నాయి. అదే సమయంలో 'మహావతార్ బ్రహ్మాండ' పేరుతో గేమ్స్ సిరీస్ కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ దేవతల ప్రాధాన్యాన్ని, వారి కథనాలను యువతకు సరికొత్త రూపంలో పరిచయం చేయడమే ఈ యూనివర్స్ ఉద్దేశమని అంటున్నారు.

ఈ యూనివర్స్‌లో రాబోయే సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి:

2025 – మహావతార్ నరసింహ

2027 – మహావతార్ పరశురామ్

2029 – మహావతార్ రఘునందన్

2031 – మహావతార్ ద్వారకాధీశ్

2033 – మహావతార్ గోకులానంద

2035 – మహావతార్ కల్కి పార్ట్ 1

2037 – మహావతార్ కల్కి పార్ట్ 2