Begin typing your search above and press return to search.

సింగిల్ విండో : వినోద రంగానికి వరమా లేక శాపమా?

మహారాష్ట్ర ప్రభుత్వం లైవ్ ఈవెంట్స్ -కన్సర్ట్‌ల నిర్వహణ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

By:  Srikanth Kontham   |   29 April 2026 7:29 PM IST
సింగిల్ విండో : వినోద రంగానికి వరమా లేక శాపమా?
X

మహారాష్ట్ర ప్రభుత్వం లైవ్ ఈవెంట్స్ -కన్సర్ట్‌ల నిర్వహణ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశంలో లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నమూనా ఆధారంగా ఓ సమగ్రమైన ఎస్ఓపీ ని రూపొందించాలని ఓ కమిటీని ఆదేశించింది. ఇప్పటి వరకు విభిన్న శాఖల నుండి అనుమతులు పొందడం కోసం నిర్వాహకులు పడుతోన్న ఇబ్బందులను తొలగించి పారదర్శకతను పెంచడం ఈ కొత్త విధానం యొక్క ప్రధాన లక్ష్యం.

నిర్వాహకులు , పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం పరిశ్రమకు ఒక గొప్ప వరం. బుక్ మై షో వంటి ప్రముఖ సంస్థలు ఈ మార్పును స్వాగతిస్తున్నాయి. గతంలో వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈవెంట్ నిర్వహణలో తీవ్రమైన జాప్యం జరిగేదని కొత్త విధానం వల్ల సులభంగా వ్యాపారం చేసుకునే వీలుంటుందని వారు భావిస్తున్నారు. వేగవంతమైన అనుమతులు , పారదర్శక పాలన వల్ల కన్సర్ట్ ఎకానమీ స్థిరమైన వృద్ధిని సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ వ్యవస్థ మెట్రో నగరాల్లోనే కాకుండా టైర్ 2 , టైర్ 3 నగరాల్లో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఈవెంట్ తేదీకి అతి దగ్గరలో అనుమతులు లభించడం వల్ల ప్లానింగ్ అమలులో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సింగిల్ విండో విధానం వల్ల టర్న్ అరౌండ్ టైమ్ తగ్గి నిర్వాహకులకు స్పష్టత లభిస్తుంది. ఇది కొత్తగా వచ్చే ఈవెంట్ నిర్వాహకులకు కూడా ఎంతో మేలు చేస్తుందని సన్‌బర్న్ వంటి సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

అయితే ఈ విధానం వల్ల కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ కొత్త విధానం ఇప్పటికే ఉన్న పాత పద్ధతులకు అదనపు పొరగా మారితే పనిభారాన్ని మరింత పెంచుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ప్రక్రియలను సులభతరం చేయకుండా మరో నియంత్రణ వ్యవస్థను జోడిస్తే అది శాపంగా మారే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి అమలులో స్పష్టత, స్థిరత్వం , విశ్వసనీయత ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్ ట్రాకింగ్ , రియల్ టైమ్ అనుమతుల పర్యవేక్షణ ఈ వ్యవస్థలో కీలకం కానున్నాయి. దీనివల్ల చివరి నిమిషంలో జరిగే మార్పులు, ఆర్టిస్టుల షెడ్యూల్ సమస్యలు తగ్గుతాయి. నిర్వాహకులు తమ వనరులను పరిపాలనపరమైన అడ్డంకులపై కాకుండా కార్యక్రమాల నాణ్యతను పెంచడంపై కేంద్రీకరించొచ్చు. అలాగే టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఈవెంట్ రద్దు అయితే టికెట్ ధరను రీయింబర్స్ చేస్తాయి. కానీ ప్రయాణ , హోటల్ ఖర్చులను భరించవు. ఈ కొత్త విధానం వల్ల ఈవెంట్స్ రద్దు అయ్యే అవకాశాలు తగ్గి ప్రేక్షకులకు ఆర్థిక నష్టం కలగకుండా ఉంటుందని ఆశిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వ ఈ చొరవ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా పడిన ఒక ముందడుగుగా భావించొచ్చు. దీని అమల అయ్యే విధానంపైనే వరమా లేక శాపమా? అనేది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నియంత్రణను పెంచడమే కాకుండా ప్రక్రియను నిజంగానే సులభతరం చేస్తే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు , వినోద రంగానికి గొప్ప ఊతాన్ని ఇస్తుందని విశ్లేష‌కులు భావిస్తున్నారు.