చివరికి రాజమౌళికే ఆ ఛాన్స్ ఉంటుందేమో!
భారతీయ పురాణేతిహాసాలు రామాయణం, మహాభారతంపై సినిమాలు తీయాలనేది చాలా మంది కల.
By: Tupaki Desk | 10 May 2025 1:40 PMభారతీయ పురాణేతిహాసాలు రామాయణం, మహాభారతంపై సినిమాలు తీయాలనేది చాలా మంది కల. ఇటీవలే రాజమౌళి మహాభారతం సినిమాని తెరకెక్కిస్తానని మరోసారి ప్రకటించడంతో దేశవ్యాప్తంగా దీనిపై అందరి దృష్టి మరలింది. అయితే అంతకు ముందే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, తమిళ దర్శకుడు లింగుస్వామి మహాభారతాన్ని ఫ్రాంఛైజీలను నడిపిస్తామని ప్రకటించారు.
మహాభారతం ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తే మూడు భాగాల సిరీస్ గా రూపొందించే అవకాశం ఉందని అమీర్ ఖాన్ చెప్పారు. అయితే లింగుస్వామి తాను రెండు భాగాల సిరీస్ గా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. అతడు ఏకంగా 700 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నామని వెల్లడించాడు. అయితే ప్రకటనల సంగతి అటుంచితే ఈ ప్రాజెక్టు కోసం ఆ ఇద్దరూ ముందస్తుగా ఏం చేస్తున్నారనేది తేలాల్సి ఉంది.
ప్రస్తుతం లింగుస్వామి, అమీర్ కూడా స్క్రిప్టు పనులపై దృష్టి సారించనున్నారని కథనాలొస్తున్నాయి. కానీ అధికారికంగా దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. అలాగే మహాభారతంలో ఒకదానిని మించి ఒకటిగా వచ్చే పాత్రల కోసం స్టార్లను ఎంపిక చేయడం తలకుమించిన భారంగా పరిణమించనుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే `తారే జమీన్ పర్` సీక్వెల్ `సితారే జమీన్ పర్` రిలీజ్ ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా వేడి పెంచుతున్నాయి. అతడు కర్ణుడు లేదా శ్రీకృష్ణుడి పాత్రలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాడని తన మాటలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగానే అమీర్ ప్రకటనలను రొటీన్ గా చూడాలని, లింగుస్వామి ప్రకటనను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఇద్దరూ షూటింగ్ ప్రారంభించాలనుకున్న సమయానికి రాజమౌళి కూడా మహేష్ తో సినిమాని పూర్తి చేసి తదుపరి మహాభారతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారని కూడా అంచనా వేస్తున్నారు.
సితారే జమీన్ పర్ రిలీజ్ ముందు అమీర్ ప్రకటనలు కేవలం ప్రచారార్భాటం కోసం ఉద్ధేశించినవని కూడా కొందరు గెస్ చేస్తున్నారు. అయితే అమీర్ ఖాన్, లింగుస్వామి ప్రకటనలతో పని లేకుండా విజయేంద్ర ప్రసాద్ మహాభారతం కథల్ని త్వరగా వండి వారిస్తే బావుంటుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి - విజయేంద్ర ప్రసాద్ జోడీ అధికారికంగా మహాభారతంని గ్రాండ్ స్కేల్ లో ప్రకటిస్తే ఇతరులు సైలెంట్ అయిపోతారని కూడా ఊహాగానాలు సాగిస్తున్నారు.