అంత పెద్ద హిట్లిచ్చిన బ్యానర్ చివరికిలా
స్త్రీ 2, చావా లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లను అందించిన మడాక్ ఫిలింస్ తన తాజా చిత్రం 'భూల్ చుక్ మాఫ్' థియేట్రికల్ విడుదల ప్రక్రియను డైలమాలో ఉంచింది.
By: Tupaki Desk | 9 May 2025 9:29 PM ISTభారతీయ సినీపరిశ్రమ గర్వించదగ్గ భారీ హిట్ చిత్రాలను అందిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఓ సినిమా రిలీజ్ విషయంలో తీసుకున్న నిర్ణయం విస్మయపరుస్తోంది. ముఖ్యంగా ఆ చిత్రంలో నటించిన నటీనటులు, ఇతర చిత్రబృందాన్ని ఈ ఒక్క నిర్ణయం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ తప్పదు.. మారిన ప్రేక్షకుడి అభిరుచి, దేశంలో పెరుగుతున్న టెన్షన్ల దృష్ట్యా సదరు నిర్మాణ సంస్థ తెలివైన నిర్ణయం తీసుకుందని అందరూ విశ్లేషిస్తున్నారు.
ఆ నిర్మాణ సంస్థ ఏది? ఆ సినిమా ఏది? నిర్మాత తీసుకున్న డెసిషన్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే.. స్త్రీ 2, చావా లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లను అందించిన మడాక్ ఫిలింస్ తన తాజా చిత్రం 'భూల్ చుక్ మాఫ్' థియేట్రికల్ విడుదల ప్రక్రియను డైలమాలో ఉంచింది. చివరికి ఈరోజు ఊహకందని విధంగా ఈ సినిమామాని ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది చిత్రబృందం ఊహించనిది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ డెసిషన్ చాలా సముచితమైనదని కూడా ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది.
ప్రజలు థియేటర్లకు వెళ్లాలంటే ఆచితూచి ఆలోచించే పరిస్థితి నేడు ఉంది. థియేటర్లకు వెళ్లడం అనేది సామాన్యమధ్యతరగతికి పెనుభారంగా మారిన వేళ చాలా అరుదుగా ప్రత్యేకత ఉన్న భారీతనం నిండిన సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. దీనికి తోడు భారత్ - పాక్ మధ్య టెన్షన్ వాతావరణం కూడా భయపెడుతోంది. భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ తో భీకర పోరాటం చేస్తోంది. దీని పర్యవసానం ఈ సమయంలో పాక్ ముష్కరుల పన్నాగాలు కూడా ప్రమాదకరంగా మారతాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందుతున్నాయి. అందుకే ఇప్పుడు జనం థియేటర్లకు రావాలంటే ఆలోచించుకునే పరిస్థితి కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మే 16న రావాల్సిన రాజ్ కుమార్ రావు సినిమాని తెలివిగా ఓటీటీకి అప్పజెప్పిందని అంచనా వేస్తున్నారు.
రెగ్యులర్ వీకెండ్స్ లోనే జనం థియేటర్లకు రావాలంటే భారీ స్టార్ డమ్ ఉన్న హీరో అయితేనే పాజిబుల్ అవుతోంది. రాజ్ కుమార్ రావు లాంటి ద్వితీయ శ్రేణి కథానాయకుడి కోసం జనం థియేటర్లకు వస్తారని భావించలేము. ఇప్పుడు స్త్రీ 2 మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అనుకోవడం కూడా మూర్ఖత్వం. అందుకే మడాక్ తెలివైన నిర్ణయం తీసుకుందని అంతా విశ్లేషిస్తున్నారు. భూల్ చుక్ మాఫ్ అమెజాన్ ప్రైమ్ లో అదే తేదీకి విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు నటించిన స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు పైగా నికర వసూళ్లను సాధించడం ఒక సెన్సేషన్. అదే హీరో నటించిన సినిమాని అనూహ్యంగా ఇలా ఓటీటీలో రిలీజ్ చేస్తుండడం చూస్తుంటే పరిణామాలు ఎంత వేగంగా మారిపోతాయో అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా రిలీజ్ కి చాలా కలిసి రావాలని కూడా ఇది నిరూపిస్తోంది.
