పితృస్వామ్య భావజాలంపై మా బెహన్ చెంపపెట్టు!
సమాజంలో మహిళలు మనుగడ కోసం నిరంతరం పోరాడాల్సి వస్తోంది కాదనలేని నిజం. కొన్నిసార్లు బ్రతకడం కోసం అబద్ధాలు ఆడటం.. మోసాలు చేయడం.. చివరకు చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.
By: Srikanth Kontham | 6 Jun 2026 8:15 AM ISTసమాజంలో మహిళలు మనుగడ కోసం నిరంతరం పోరాడాల్సి వస్తోంది కాదనలేని నిజం. కొన్నిసార్లు బ్రతకడం కోసం అబద్ధాలు ఆడటం.. మోసాలు చేయడం.. చివరకు చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన `మా బెహన్`చిత్రం సరిగ్గా ఇలాంటి కోణాన్నే స్పృశిస్తూ సాగుతుంది. సురేష్ త్రివేణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ కామెడీ చిత్రంలో రేఖ (మాధురీ దీక్షిత్), ఆమె కుమార్తెలు జయ (తృప్తి దిమ్రి), సుష్మ (ధర్నా దుర్గా) సమాజం విధించిన పితృస్వామ్య హద్దులను, ఇబ్బందులను ఎదుర్కొనే అబలలుగా కాకుండా.. తిరగబడే సరికొత్త నారీమణులుగా కనిపించారు.
ఈ చిత్రంలో పాత్రల పేర్లు - వారి నేపథ్యాలు సమాజం మహిళలను చూసే పాతకాలపు దృక్పథాన్ని ఎద్దేవా చేసేలా రూపొందించారు . నిర్మా డిటర్జెంట్ ప్రకటనలోని పాత్రల ఆధారంగా ఈ పేర్లను ఎంపిక చేయడం ఒక వ్యంగ్యాస్త్రం. పురుషులు చేసిన తప్పులను లేదా వారు సృష్టించిన గందరగోళాన్ని శుభ్రం చేయడమే మహిళల ప్రధాన కర్తవ్యం అన్నట్లు భావించే సమాజానికి ఈ చిత్రం గట్టి సమాధానం ఇస్తుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదురైన విషాదాల తర్వాత కూడా సమాజం కోసం తమ ప్రవర్తనను .. వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి నిరాకరించడమే ఇక్కడి అసలు కథాంశం.
స్త్రీలను కించపరచడానికి తరతరాలుగా సమాజం వాడుతోన్న అత్యంత హీనమైన బూతు పదాన్ని (మా బెహన్) ఈ చిత్రం శీర్షికగా మార్చుకుని.. ఆ పదజాలంపై ఒకరకమైన తిరుగుబాటును ప్రకటించింది. సమాజం తమను ఎంతగా అవమానించినా? తమ నైతికతను నిరూపించుకోవాలని ఒత్తిడి తెచ్చినా? ఈ పాత్రలు లొంగిపోవడానికి సిద్ధపడవు. ఆంక్షలను బద్దలు కొడుతూ తమను తక్కువ చేసి చూసే పితృస్వామ్య భావజాలానికి వారు నవ్వుతూనే చెప్పుదెబ్బ కొట్టారు. అయితే ఈ నవ్వు ఆనందానికి సంకేతం కాదు. సమాజం మారుతుందేమోనని ఎదురు చూసి అలసిపోయిన తర్వాత వచ్చిన ఒక రకమైన విరక్తి. దర్శకుడు సురేష్ త్రివేణి మునుపటి చిత్రాలైన `తుమహారీ సులు`, `జల్సా` తరహాలోనే మహిళల చుట్టూ సమాజం అల్లే అపోహలు, ముద్రలు , ప్రజా తీర్పులను కథలో ప్రధానంగా చర్చిం చారు.
సమాజం మహిళలకు కేటాయించే సాంప్రదాయ గౌరవ స్థానాలను పక్కన పెట్టి.. వారి ఆత్మరక్షణ , మనుగడ కోసం చేసే ప్రయత్నాలను ఎంతో వాస్తవికంగా చూపించారు. సమాజం మార్పు కోసం వారిక ఎంతమాత్రం వేచి ఉండరనే సందేశాన్ని ఈ చిత్రం బలంగా ఇస్తుంది. చిత్రంలో మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి, డిజిటల్ క్రియేటర్ ధర్నా దుర్గాల నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఆదర్శవంతమైన తల్లి పాత్రలకే పరిమితం కాకుండా సాధారణ మధ్యతరగతి మహిళలోని లోపాలను, ఆమెలోని తిరుగుబాటు తత్వాన్ని మాధురి అద్భుతంగా పండించారు. తృప్తి దిమ్రి తన పాత్రకు కావాల్సిన నిశ్శబ్ద పరిణతిని అందించగా.. ధర్నా దుర్గా నేటి ఇంటర్నెట్ తరం అమ్మాయిగా హాస్యాన్ని.. భావోద్వేగాలను చక్కగా పండించారు. ఈ ముగ్గురి మధ్య ఉన్న కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా సహజంగా కుదిరింది.
