అవకాశాల కోసం నటుడి భార్య దుస్తులతో!
స్టూడియోలకు లేదా ఆఫీసులకు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో శేఖర్ సుమన్ తన మోటార్ బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లేవారని చెప్పారు.
By: Srikanth Kontham | 26 May 2026 6:00 AM ISTబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో `ధక్ ధక్ గర్ల్ గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటి మాధురీ దీక్షిత్. నేడు ఆమె సాధించిన స్టార్‌డమ్ -వైభవం వెనుక ఎంతో కష్టం, పట్టుదల ఉన్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తారల విజయాల గురించే అందరూ మాట్లాడుకుంటారు. కానీ వారి కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సాధారణ జీవితం చాలా మందికి తెలియదు. తాజాగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాధురీ దీక్షిత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల నాటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శేఖర్ సుమన్ - మాధురీ దీక్షిత్ కెరీర్ ఆరంభంలో ఒకరికొకరు బాగా పరిచయం. ఆ సమయంలో మాధురి ఇంకా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేదు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. శేఖర్ సుమన్ కుటుంబంతో ఆమెకు ఎంతో మంచి అనుబంధం ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే వారు ఒకే కుటుంబ సభ్యులలా కలిసి ఉండేవారు. మాధురిని తమ ఇంట్లో ఒకరిగా భావించేవారమని ఆమె పట్ల తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయత ఉండేదని శేఖర్ సుమన్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో మాధురీ దీక్షిత్‌కు సొంతంగా పెద్దగా వనరులు గానీ, ఖరీదైన దుస్తులు గానీ ఉండేవి కావు. ఆడిషన్స్ , షూటింగ్స్ కోసం వెళ్లేటప్పుడు శేఖర్ సుమన్ భార్య అల్కా సుమన్ దుస్తులను మాధురి అడిగి మరీ వేసుకువారట.
స్టూడియోలకు లేదా ఆఫీసులకు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో శేఖర్ సుమన్ తన మోటార్ బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లేవారని చెప్పారు. కాబోయే స్టార్ నటి ఇలా సాధారణ బైక్‌పై ప్రయాణించడం, ఇతరుల దుస్తులు ధరించడం ఆనాటి ఆమె నిరాడంబరతకు నిదర్శనం. పరిశ్రమలో నిలదొక్కుకునే క్రమంలో ఎదురయ్యే ఆర్థిక, మానసిక ఇబ్బందులను అధిగమించడంలో ఇలాంటి పరస్పర సహకారాలు ఎంతో మేలు చేస్తాయి. శేఖర్ సుమన్ కుటుంబం అందించిన ఆదరణ, ప్రోత్సాహం మాధురిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం అనేది ఆనాటి కాలంలో కళాకారుల మధ్య ఉన్న నిష్కల్మషమైన బంధాన్ని .. కుటుంబ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని శేఖర్ సుమన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాలక్రమేణా మాధురీ దీక్షిత్ అద్భుతమైన నటన అంకితభావంతో బాలీవుడ్‌లో తిరుగులేని నటిగా అవతరించారు. వరుస విజయాలతో పరిశ్రమను ఏలారు. అయితే ఆమె ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా? పాత రోజులను , కష్టకాలంలో తనకు సహాయం చేసిన వారిని ఎన్నడూ మరువలేదని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి. నేటి తరం నటీనటులకు ఇలాంటి కథనాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి.
