చరిత్ర పాఠ్యాంశాల వక్రీకరణపై మాధవన్ విశ్లేషణ
ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను చూపడంతో పాటు, సృజనాత్మక స్వేచ్ఛ ఎక్కువ తీసుకున్నారని విమర్శలొచ్చాయి
By: Tupaki Desk | 4 May 2025 5:00 PM ISTఇటీవల విమర్శకుల ప్రశంసలు పొందిన `కేసరి- చాప్టర్ 2`లో నటించాడు మాధవన్. ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను చూపడంతో పాటు, సృజనాత్మక స్వేచ్ఛ ఎక్కువ తీసుకున్నారని విమర్శలొచ్చాయి. చరిత్ర పాఠ్యాంశాలపై ఈ సందర్భంగా పెద్ద డిబేట్ మొదలైంది.
తాజా డిబేట్ లో మాధవన్ ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాల నుంచి మొఘలులకు చెందిన చరిత్రను సవరించి మహా కుంభమేళా, భేటీ బచావో భేటీ పడావో, మేకిన్ ఇండియా సహా పలు భారతీయ అంశాలను చేర్చడం సరైన నిర్ణయమని మాధవన్ అన్నారు. అలాగే చరిత్ర పుస్తకాల్లో మన దేశ చరిత్రకు అంతగా ప్రాధాన్యతనివ్వలేదని, మొఘలుల చరిత్ర కోసం ఎక్కువ అధ్యాయాలు కేటాయించి భారతీయ చరిత్రను పలుచన చేసారని కూడా మాధవన్ అభిప్రాయపడ్డారు. 800 ఏళ్ల పాటు మొఘలులు, బ్రిటీషర్లు భారతదేశాన్ని పాలించగా, చోళులు 2400 సంవత్సరాలు పాలించారని కూడా గుర్తు చేసారు. సముద్ర అన్వేషణలో, విదేశాల్లో ప్రభావం చూపడంలో భారతీయుల ఘన చరిత్రను చరిత్ర పాఠాల్లో లేకుండా చేసారని మ్యాడీ విమర్శించారు. జైన-బౌద్ధ-హిందూ మతాలు విదేశాలకు విస్తరించాయని అన్నారు. కొరియన్లు తమిళం కూడా మాట్లాడతారని గుర్తు చేసారు. అయితే పాఠ్యాంశాల్లో తమిళ భాష నిర్లక్ష్యం చేయబడిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాల్లో సిలబస్‌ను ఎవరు నిర్ణయిస్తారు? తమిళం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి. అయినప్పటికీ ఎవరూ దానిని అంగీకరించరు. మన సంస్కృతిలో పొందుపరచిన శాస్త్రీయ జ్ఞానం ఇప్పుడు అపహాస్యం చేయబడుతోంది. కేసరి చాప్టర్ 2 ఆ కథనాన్ని మార్చడానికి ఒక అడుగు.. అని అభిప్రాయపడ్డారు.
చరిత్రను వక్రీకరిస్తే తిట్టండి.. కానీ చిన్నపాటి స్వేచ్ఛ తీసుకుంటే నిందించవద్దు! అని మాధవన్ కోరారు. బ్రిటీష్ వాళ్లు తమకు అనుకూలంగా నిజాల్ని దాచి చరిత్రను తిరగ రాయించారని మాధవన్ విమర్శించారు. జనరల్ డయ్యర్ .. భారతీయ సైనికులను ఉగ్రవాదులు అని, కాల్చి పారేయొచ్చని హుంకరించాడు. చరిత్రను తప్పుగా రాయించాడని విమర్శించారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం చరిత్రను తప్పుగా లిఖించడం సరికాదని, వాస్తవాలను ప్రతిబింబించాలని కూడా మాధవన్ అన్నారు.
