బాలీవుడ్ లో 'చిరంజీవి' యూనివర్స్.. ఆ కథలతో..
మాడాక్ ఫిల్మ్స్ రెండు సంవత్సరాలకు పైగా ది అరేబియన్ నైట్స్ ఫాంటసీ యూనివర్స్ ను అభివృద్ధి చేస్తోంది.
By: Tupaki Desk | 24 July 2025 11:03 PM ISTబాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నేతృత్వంలోని మాడాక్ ఫిల్మ్స్.. స్త్రీ 2, చావా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత దూసుకుపోతోంది. ఇప్పటికే కామెడీ హారర్ యూనివర్స్ కొనసాగిస్తుండగా.. మరో రెండు ప్రతిష్టాత్మక సినిమాటిక్ యూనివర్స్ లపై ఫోకస్ పెట్టింది. అందులో ఒకటి అరేబియన్ నైట్ ఫాంటసీ ఫ్రాంచైజీ.. మరొకటి చిరంజీవి యూనివర్స్.
మాడాక్ ఫిల్మ్స్ రెండు సంవత్సరాలకు పైగా ది అరేబియన్ నైట్స్ ఫాంటసీ యూనివర్స్ ను అభివృద్ధి చేస్తోంది. భారతీయ సాంస్కృతిక దృష్టితో పురాణ కథలను తిరిగి ఊహించుకుని భారీ స్థాయి చిత్రాలను ప్లాన్ చేస్తోంది. అలీ బాబా అండ్ ది ఫోర్టీ థీవ్స్ తో యూనివర్స్ ప్రారంభించనుంది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు రానున్నాయి.
అదే సమయంలో మాడాక్ ఫిల్మ్స్.. చిరంజీవి యూనివర్స్ ను కూడా అభివృద్ధి చేస్తోంది. హిందూ గ్రంధాల ప్రకారం అమరులు అని నమ్మే పాత్రలపై కేంద్రీకృతమైన పౌరాణిక సిరీస్ గా తీసుకురానుంది. వీరిలో పరశురాముడు, అశ్వత్థామ, హనుమంతుడు సహా పలువురు చుట్టూ సినిమాలు ఉండనున్నాయి.
చిరంజీవి యూనివర్స్ లో మొదటి చిత్రం మహావతార్ కాగా.. అందులో పరశురాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించనున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్న ఆ సినిమా విష్ణువు పది అవతారాలలో ఒకటైన ఋషి కథను చెబుతుంది. మహావతార్ ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లనుంది. 2026 క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
మహావతార్ భారీ స్థాయిలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి యూనివర్స్ సక్సెస్ అయితే.. రామాయణం, మహా భారతంలోని ఇతర పౌరాణిక అమరవీరుల ఆధారంగా మరిన్ని చిత్రాలు అభివృద్ధి చేయాలని మాడాక్ ఫిల్మ్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పురాతన ఇతిహాసాలకు ఆధునిక VFX జోడించి కథలు చెప్పనున్నట్లు సమాచారం.
అయితే మోడ్రన్ సినిమా టెక్నిక్ లు, స్టార్ పవర్‌తో పెద్ద ఎత్తున పౌరాణిక కథలను భారతీయ సినీ ఇండస్ట్రీలో పెరుగుతున్న అన్వేషించే ట్రెండ్ ను మాడాక్ ఫిల్మ్స్ చిరంజీవి యూనివర్స్ తో కూడా కంటిన్యూ చేస్తున్నట్లే అయింది. కానీ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పూర్తి షెడ్యూల్ ను మేకర్స్ ప్రకటించలేదు.
