నా ముందే బికినీ వేయ్.. హీరోయిన్‌ని హడలెత్తించిన డైరెక్టర్
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనుభవాలు అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి.
By: Tupaki Desk | 2 May 2026 11:09 AM ISTసినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనుభవాలు అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ హిందీ టీవీ నటి మదాలస శర్మ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని మీడియాతో షేర్ చేసారు. కెరీర్ ఆరంభంలో ఒక ప్రముఖ దర్శకుడు తనను కలిసినప్పుడు ప్రవర్తించిన తీరు గురించి మదాలస ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తాను కేవలం 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక సినిమా ఆడిషన్ కోసం వెళితే.. ఆ దర్శకుడు తన పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారని మదాలస పేర్కొన్నారు.
సినిమా కథ ప్రకారం బికినీ సీన్ ఉంటుందని.. అయితే తాను కెమెరా ముందు బికినీలో ఎలా ఉంటానో.. తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూడటానికి తన ముందే బికినీ వేసుకోవాలని సదరు దర్శకుడు కోరాడని మదాలస తెలిపారు. ఒక ప్రొఫెషనల్ మీటింగ్‌లో దర్శకుడు ఇలాంటి వింత కోరిక కోరడంతో తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. అయితే ఆ సమయంలో ఎంతో ధైర్యంగా, చాకచక్యంగా వ్యవహరించిన యువనటి ఆ దర్శకుడికి గట్టి సమాధానమే ఇచ్చారు.
కథ డిమాండ్ చేస్తే కెమెరా ముందు బికినీ ధరించడానికి అయినా.. చీర కట్టడానికి అయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అది తన వృత్తిలో భాగమని మదాలస స్పష్టం చేశారు. అయితే కేవలం ఒక వ్యక్తి ముందు బట్టలు మార్చుకోవడం తన వృత్తి కాదని.. అటువంటి పని తాను చేయనని ఆమె తేల్చి చెప్పారు. ఒకవేళ నా టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి.. లేదంటే బయటకు వెళ్లే దారి నాకు తెలుసు! అని ఆ దర్శకుడి ముఖం మీదే చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేసినట్లు తెలిపారు.
తెలుగులో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన `ఫిట్టింగ్ మాస్టర్` సినిమాతో మదాలస శర్మ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆలస్యం అమృతం, ఉదయ్ కిరణ్ చివరి చిత్రం `చిత్రం చెప్పిన కథ`, `రామ్ లీలా` వంటి చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌తో పాటు కన్నడ, తమిళ, పంజాబీ చిత్రాల్లోనూ ఈ నటి మెరిశారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కోడలిగా గ్లామర్ ప్రపంచానికి సుపరిచితురాలు. సీరియల్ నటిగా బిజీగా ఉన్నారు. స్టార్ ప్లస్ లో వచ్చిన అనుపమ సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
సినిమా రంగంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కొత్తగా వచ్చే వారు భయపడకుండా ధైర్యంగా స్పందించాలని మదాలస సూచిస్తున్నారు. సదరు దర్శకుడు ఆ పాత్రను ఆ తర్వాత తనతో వ్యక్తిగత సంబంధం ఉన్న మరో నటికే ఇచ్చాడని కూడా ఆమె వెల్లడించారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా తన వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా ఉండటమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని మదాలస ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మదాలస లాంటి ప్రతిభావని తిరిగి తెలుగు సినిమాల్లో నటిస్తారో లేదో కాలమే సమాధానమివ్వాలి.
