Begin typing your search above and press return to search.

ఆ విప్లవ నటుడికి క్రేజ్...ఎన్టీఆర్ కంటే ముందే సీఎం గా ?

అవి టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏఎన్నార్, క్రిష్ణ శోభన్ బాబులు శాసిస్తున్న రోజులు. వారి చిత్రాలకే ఆదరణ ఎక్కువగా ఉండేది. అలాంటి తరుణంలో మాదాల రంగారావు ఉవ్వెత్తిన ఎగిసినట్లుగా సినీ రంగంలో తన సత్తా చాటారు.

By:  Tupaki Desk   |   24 April 2025 4:00 AM IST
ఆ విప్లవ నటుడికి క్రేజ్...ఎన్టీఆర్ కంటే ముందే సీఎం గా ?
X

ఇప్పటి తరానికి విప్లవం గురించి ఎంత వరకూ తెలుసో తెలియదు. అసలు ఆ తరహా సినిమాలు రావడం లేదు కూడా. ఆలోచనాత్మకమైన సినిమాలు ఇప్పటికి నలభై యాభై ఏళ్ళ క్రితం వచ్చేవి. అయితే తెలుగు నాట విప్లవ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఒక నటుడు నిలిచారు.

అవి టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏఎన్నార్, క్రిష్ణ శోభన్ బాబులు శాసిస్తున్న రోజులు. వారి చిత్రాలకే ఆదరణ ఎక్కువగా ఉండేది. అలాంటి తరుణంలో మాదాల రంగారావు ఉవ్వెత్తిన ఎగిసినట్లుగా సినీ రంగంలో తన సత్తా చాటారు. ఆయన 70 దశకంలో సినీ పరిశ్రమలోకి వచ్చి చిన్న పాత్రలు విలన్ వేషాలు వేస్తూ వచ్చారు.

అయితే ఆయనలో వామపక్ష భావాలు నిండుగా ఉండేవి. ఆయన ఆ పార్టీలలో సభ్యుడు కూడా. దాంతో ఆయన కళా రంగాన్ని సామాజిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని భావించారు. అపుడే దానికి ఒక పరిపూర్ణత వస్తుందని తలచారు.

దీంతో ఆయన సొంతంగా చిత్రాలను నిర్మించడం మొదలెట్టారు. అలా 1979లో వచ్చిన తొలి చిత్రం యువతరం కదలింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఎర్ర మల్లెలు, విప్లవ శంఖం, మహా ప్రస్థానం ఇలా ఎన్నో సినిమాలు ఆయన నిర్మించారు. ఆయనే హీరోగా నటిస్తూ ఎంతో మంది వర్ధమాన కళాకారులకు అవకాశం ఇస్తూ తన సినిమాల్లో సామాజిక అంశాలను తీసుకుని జనంలో చర్చకు పెట్టేవారు. అవన్నీ ఘన విజయాలు సాధించాయి. అలా మాదాలకు జనాలు ఇచ్చిన బిరుదు రెడ్ స్టార్.

ఇదిలా ఉంటే 1980లలో ఉమ్మడి ఏపీలో రెండే రెండు పార్టీలు ఉండేవి. ఒకటి అధికార కాంగ్రెస్ అయితే రెండవది వామపక్ష పార్టీలు. ఇక మాదాల రంగారావు తన సినిమాల ద్వారా ఒక వైపు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మరో వైపు పార్టీ ప్రచారంలో పాల్గొనేవారు. అలా ఆయన నిబద్ధత కలిగిన కామ్రేడ్ గా మెలిగారు.

ఇలా నాటి ఏపీలో కాంగ్రెస్ ప్రజాదరణ తగ్గుతున్న వేళ ఆల్టర్నేషన్ గా వామపక్షాలే అధికారంలోకి వస్తాయన్న అభిప్రాయం ఉండేది. అలా ప్రజా వ్యతిరేకతను పోగు చేయడంలో మాదాల అగ్ర భాగాన ఉండేవారు. ఒక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా వామపక్షాల తరఫున మారు మోగింది.

అలా ఏపీలో వామపక్షాలను తీసుకుని రావాలని కూడా మాదాల ఎంతో తపించారు. కాంగ్రెస్ ని ఓడించి వామపక్ష ప్రభుత్వాన్ని ఏపీలో స్థాపించాలని ఆయన కలలు కనేవారు. వామపక్షాల ప్రభుత్వం వస్తే పుచ్చలపల్లి సుందరయ్య సీఎం గా గిరిప్రసాద్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని అభిలషించారు. తనకు ఉన్న ప్రజాకర్షణ సినీ క్రేజ్ అన్నీ కలిపి తననే సీఎం అభ్యర్థిగా ఉండమని కోరుతున్న వేళ ఆయన మాత్రం పదవులు వద్దే వద్దు అనుకున్నారు.

అయితే 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించడంతో కాంగ్రెస్ మీద ఉన్న ప్రజా వ్యతిరేకత కాస్తా ఆయన పార్టీకి ఎంతగానో ఉపయోగపడి సీఎం అయ్యారు. ఇది వేరే స్టోరీ. కానీ మాదాల తన చిత్రాల ద్వారా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని ఎండగట్టేవారు అని చెబుతారు. అంతే కాదు ఆయన నటించిన విప్లవ శంఖం మూవీలో అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు ఉండడంతో బ్యాన్ చేశారు. దాని కోసం ఆయన నిరాహార దీక్షలు చేసి మరీ ఒక్క కట్ కూడా లేకుండా థియేటర్లలో రిలీజ్ చేయించారు అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఈ విషయాలు అన్నీ ఆయన కుమారుడు నటుడు నిర్మాత అయిన మాదాల రవి ఒక యూట్యూబ్ చానల్ తో పంచుకున్నారు. తన తండ్రి సంపాదించినది అంతా దానాలకే ఖర్చు చేసేవారు అని సొంత ఇల్లు కూడా ఆయనకు లేదని చెప్పారు. ఏడు పదుల వయసులో ఆయన ఆ మధ్య కన్నుమూశారు ఏది ఏమైనా టాలీవుడ్ చరిత్రలో మాదాల ఎర్ర సినిమాలది ఒక చరిత్రగానే చెప్పాల్సి ఉంటుంది.