Begin typing your search above and press return to search.

ఆర్టిస్టులకు హెచ్చరిక: MAA ఒక్కటే అధికారికం.. మిగిలినవన్నీ నకిలీవే!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అని సదరు సంఘం మరోసారి స్పష్టం చేసింది.

By:  Sivaji Kontham   |   6 May 2026 3:56 PM IST
ఆర్టిస్టులకు హెచ్చరిక: MAA ఒక్కటే అధికారికం.. మిగిలినవన్నీ నకిలీవే!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అని సదరు సంఘం మరోసారి స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలోని కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన సంస్థ ఇదని.. దీనికి మించి మరే ఇతర సంఘాలకు అధికారిక హోదా లేదని `మా` కార్యవర్గం ఒక ప్రకటనలో వెల్లడించింది. కళాకారులు ఎవరూ తప్పుదారి పట్టవద్దని ఈ సందర్భంగా గట్టి హెచ్చరిక జారీ చేసింది.

ముఖ్యంగా `AP- MAA` లేదా `MAA- AP` వంటి పేర్లతో వస్తున్న సంస్థలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని అసోసియేషన్ నొక్కి చెప్పింది. కొంతమంది వ్యక్తులు .. అనధికారిక సమూహాలు `మా` పేరును దుర్వినియోగం చేస్తూ.. కొత్తగా పరిశ్రమలోకి వచ్చే కళాకారుల నుండి చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అసోసియేషన్ తెలిపింది. ఇటువంటి తప్పుదారి పట్టించే టైటిల్స్‌తో గందరగోళాన్ని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో అనుబంధం కలిగి.. గుర్తింపు పొందిన ఏకైక సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాత్రమే. టాలీవుడ్‌లోని 24 క్రాఫ్ట్‌ల సమన్వయంతో పనిచేస్తూ.. తన సభ్యుల ప్రయోజనాలను కాపాడటానికి ఏకీకృత సంస్థగా `మా` కృషి చేస్తోంది. కాబట్టి ఇతర సంఘాల పేరిట ఎవరైనా సంప్రదిస్తే వారు అధికారిక వ్యక్తులు కాదని గుర్తించాలని కోరింది.

డబ్బు వసూలు చేసే విషయంలో `మా` ఎంతో పారదర్శకంగా ఉంటుందని.. తన తరపున నిధులు వసూలు చేయడానికి ఏ వ్యక్తికీ లేదా ఏ బాహ్య సమూహానికి అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత సంఘాలలో సభ్యత్వాలు తీసుకోవద్దని.. ఎటువంటి చెల్లింపులు చేయవద్దని కొత్త ఆర్టిస్టులకు.. సభ్యులకు విన్నవించింది. ఒకవేళ ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కళాకారులు ఎవరైనా ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలకు గురైతే లేదా అక్రమ సంఘాల గురించి సమాచారం తెలిస్తే.. నేరుగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని `మా` కార్యాలయానికి నివేదించాలని కోరింది. ఇండస్ట్రీ ఐక్యతను, సమగ్రతను కాపాడటానికి అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. నిబంధనలు అతిక్రమించి `మా` పేరును వాడుకునే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

అయితే `మా` అసోసియేష‌న్ తో పాటు యాక్టివ్ గా ఉన్న ఆర్టిస్టుల సంఘాల‌లో టిఎంటిఏయు (తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టుల సంఘం) దాదాపు 1000 పైగా స‌భ్యుల‌తో ద్వితీయ శ్రేణి ఆర్టిస్టుల‌కు వ‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో ల‌క్ష‌ల్లో చెల్లించి స‌భ్య‌త్వం తీసుకోలేని వారంతా ఈ గ్రూపులో అధికారికంగా చేరుతున్నారు. సినిమాలకు ఆడిష‌న్స్, షూటింగులు స‌హా ఇండ‌స్ట్రీకి సంబంధించిన‌ చాలా వివ‌రాల‌ను వాట్సాప్ గ్రూపులోను స‌భ్యుల‌కు చేర‌వేస్తూ ఈ సంఘం యాక్టివ్ గా ఉంది.