మెంబర్‌షిప్‌లు అడగలేక MAA ట్రబుల్స్?
చాలా మంది సినీ కళాకారులు మూవీ ఆర్టిస్టుల సంఘం (MAA) సభ్యత్వానికి దరఖాస్తు చేసుకునే స్థితిలో లేరు.
By: Tupaki Desk | 2 Jun 2025 8:45 AM ISTచాలా మంది సినీ కళాకారులు మూవీ ఆర్టిస్టుల సంఘం (MAA) సభ్యత్వానికి దరఖాస్తు చేసుకునే స్థితిలో లేరు. గతంలో మా-తెలుగు అసోసియేషన్ సభ్యత్వం పొందడానికి లక్ష రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. అయితే సీనియర్ నరేష్ MAA అధ్యక్షుడైన తర్వాత, మార్గదర్శకాలలో చాలా మార్పులు చేసారు. MAA సభ్యత్వం పొందడానికి ఒక్కో సభ్యత్వానికి రూ. 90,000 చెల్లించాలి. అవకాశం లేని నటీనటులు దానిని నాలుగు వాయిదాలలో చెల్లించవచ్చు.
అలాగే ఎవరైనా నటీనటులు MAA సభ్యత్వం పొందాలనుకుంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. కనీసం మూడు సినిమాల్లో నటించాలి. టైటిల్ కార్డులలో పేరు వేయాలి. డైలాగులు చెప్పాలి. చిన్న చిన్న నటులకు `మా`లో సభ్యత్వం దక్కడం అంత సులువు కాదు అనే అభిప్రాయం ఉంది. దీనికి కారణం ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సి రావడం.. కానీ ఆ తర్వాత ఈఎంఐ ఆప్షన్ ఏర్పాటవ్వడం కలిసొచ్చిందని `మా` సభ్యులు చెప్పారు.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే, అవకాశం ఉండీ సభ్యులు కాని అగ్ర కథానాయికల గురించి ప్రతిసారీ చర్చ సాగుతూనే ఉంది. త్రిష, నయనతార లాంటి కథానాయికలు ఇప్పటికీ `మా` అసోసియేషన్ లో మెంబర్లు కాలేదు. వీరంతా 90,000 చెల్లించలేని దుస్థితిలో లేరు. పొరుగు భాషల నుంచి వచ్చి సెటిలైన కథానాయికలు మా అసోసియేషన్ ని పట్టించునే పరిస్థితి లేదని అంతర్గత సభ్యుడు ఒకరు చెప్పారు.
సీనియర్లు కొందరిని మా సభ్యత్వం తీసుకోమని అడగలేని పరిస్థితి. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, మమ్ముట్టి, శరత్ కుమార్, రాధిక వంటి పొరుగు భాష సీనియర్లను మెంబర్షిప్‌లు అడగలేమని.. వారికి గౌరవ సభ్యత్వాలు కల్పించామని ఇటీవల `మా` అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు.
