Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మా ఇంటి బంగారం

తెలుగులో హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. కెరీర్లో కొంచెం గ్యాప్ తర్వాత ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రం.. మా ఇంటి బంగారం.

By:  Tupaki Desk   |   19 Jun 2026 12:30 PM IST
మూవీ రివ్యూ : మా ఇంటి బంగారం
X

'మా ఇంటి బంగారం' మూవీ రివ్యూ

నటీనటులు: సమంత - దిగంత్ - గుల్షన్ దేవయ్య - గౌతమి - ఆనంద్ - కృష్ణ చైతన్య - శ్రీనివాస్ గవిరెడ్డి - శ్రీముఖి తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్

నిర్మాతలు: రాజ్ నిడిమోరు - సమంత - హిమాంక్ రెడ్డి

రచన: రాజ్ నిడిమోరు - వసంత్ మరిగంటి

దర్శకత్వం: నందిని రెడ్డి

తెలుగులో హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. కెరీర్లో కొంచెం గ్యాప్ తర్వాత ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రం.. మా ఇంటి బంగారం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

స్వర్ణ (సమంత) 90వ దశకంలో రాయలసీమ ప్రాంతంలో బల్లవరం అనే ఊరికి చెందిన ఓ పెద్ద కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడలు. స్వర్ణను ఆమె భర్త అనిరుధ్ (దిగంత్) ఇంట్లో వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకోవడంతో కొన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన ఈ జంటకు ఆ కుటుంబంలో కలవడం కష్టంగా మారుతుంది. ఈ స్థితిలో అనిరుధ్ కుటుంబాన్ని మెప్పించడానికి స్వర్ణ ఏం చేసింది.. ఇంతకీ తన గతం ఏంటి.. ఆ గతం ఆమెను ఎలా వెంటాడింది.. చివరికి స్వర్ణ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

పైకి సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడి పాత్రల్లో హీరోలను చూడడం మన ప్రేక్షకులకు అలవాటే. ఒక మామూలు ఆటోడ్రైవర్ మాణిక్యం.. నాకు ‘బాషా’ అని ఇంకో పేరుంది అన్నపుడు ప్రేక్షకులు ఎలా ఊగిపోయారో.. ఆ తర్వాత ఈ స్ఫూర్తితో రూపొందిన ఈ తరహా హీరో పాత్రలు ఎన్నింటినో ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఐతే హీరోలను ఇలాంటి క్యారెక్టర్లలో చూసి ఒకింత విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు.. ఒక హీరోయిన్ని ఇలాంటి పాత్రలో చూడడమే ‘మా ఇంటి బంగారం’ను భిన్నంగా నిలిపే విషయం. ఇలాంటి పాత్రల్లో హీరోలు చేసే పనులు ఒకలా ఉంటాయి. మరి ఒక భయంకరమైన గతం ఉన్న అమ్మాయి ఆ గతాన్ని కప్పెట్టేసి ఒక పల్లెటూరిలోని ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టినపడు ఆమె చేసే పనులు ఇంకోలా ఉంటాయి. ఆ విశేషాల చుట్టూనే ‘మా ఇంటి బంగారం’ నడుస్తుంది. ఇటు ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక సన్నివేశాలు.. అటు కథానాయికలోని మరో కోణాన్ని చూపించే యాక్షన్ ఘట్టాలు బాగానే పండాయి ఈ చిత్రంలో. కానీ బేసిక్ స్టోరీ లైన్.. ఫ్లాష్ బ్యాక్.. విలన్ ట్రాక్ మరీ సాధారణంగా ఉండడం వల్ల ‘మా ఇంటి బంగారం’ ఒక మోస్తరు స్థాయిని మించలేకపోయింది. కానీ రెండున్నర గంటలు ప్రేక్షకులకు టైంపాస్ చేయించడంలో మాత్రం సమంత అండ్ టీం విజయవంతం అయింది.

స్టార్ హీరోయిన్లలో హీరోయిక్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లు అరుదుగా కనిపిస్తారు. దక్షిణాదిన అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లలో విజయశాంతి.. అనుష్క లాంటి వాళ్లు యాక్షన్ ప్రధానంగా సినిమాలు చేసి మెప్పించారు. నయనతార లాంటి వాళ్ల సినిమాలు ఎమోషనల్ సినిమాలకు పేరు పడ్డారు. ఐతే ఇటు యాక్షన్ అదరగొడుతూ.. ఇంకోవైపు కామెడీ పండిస్తూ.. మరోవైపు ఎమోషనల్ పెర్ఫామెన్స్ తోనూ మెప్పించడం సమంతకే చెల్లింది. ‘మా ఇంటి బంగారం’తో సమంత చూపించిన ప్రత్యేకత ఇది. ఈ సినిమా ప్రధానంగా తన హీరోయిక్ ఇమేజ్.. పెర్ఫామెన్స్ మీదే నడుస్తుంది. రాజ్ నిడిమోరు క్రియేషన్ అంటే స్క్రిప్టు నుంచి ఆశించేంత ప్రత్యేకత ఇందులో లేకపోయినా.. సమంత వన్ ఉమన్ షోతో ఈ సినిమాను తన భుజాల మీద నడిచింది. స్క్రీన్ మీద ఆమె కనిపిస్తుంటే చాలు.. తనకు కనెక్ట్ అయిపోయి.. ఆయా సన్నివేశాలను ఎంజాయ్ చేసేలా ‘మా ఇంటి బంగారం’ అలా అలా నడిచిపోతుంటుంది. ఝాన్సీ అలియాస్ స్వర్ణ పాత్రలో సమంత లుక్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది కానీ.. తన పెర్ఫామెన్సుకు మాత్రం వంకలు పెట్టడానికి లేదు. సినిమాలో మొదటి షాటే సమంత మీద ఓపెన్ చేశారు. అక్కడ్నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు సమంత ప్రతి సన్నివేశంలోనూ ఎంగేజ్ చేసింది.

ఒక పెద్ద ఊరు.. అందులో బాగా పలుకుబడి ఉన్న కుటుంబం.. ఇంటి పెద్దకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఆ ఇంటి పెద్ద కొడుకు కొన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగొస్తే ఆ జంటకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్న దాని మీద ఈ కథ నడుస్తుంది. పల్లెటూరి కుటుంబంలో కోడలిగా ఒదిగిపోవడానికి అవసరమైన లక్షణాలు ఏమీ లేని అమ్మాయి.. వాటిని అందిపుచ్చుకోవడానికి తనతో పాటు భర్తను ఆ కుటుంబంలో కలపడానికి ఏం చేసిందనే క్రమంలో కథనం సాగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సింపుల్ సీన్లే ఎక్కువ వినోదాన్ని పంచాయి. తులసి మొక్కకు పూజ చేసే సీన్ దగ్గర్నుంచి.. వంట కోసం కథానాయిక వేసే ఎత్తుగడల చుట్టూ నడిచే సన్నివేశాల వరకు ఫన్నీగా సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఘట్టాలు కూడా బాగా పండాయి. ఐతే కథానాయికలోని భిన్న కోణాన్ని చూసి తన నేపథ్యం గురించి ఎంతో ఆసక్తి కలుగుతుంది కానీ.. దాని మీద నడిచే ఫ్లాష్ బ్యాక్ మాత్రం తేలిపోయింది. అలాగే గుల్షన్ దేవయ్య లాంటి నటుడు చేశాడంటే విలన్ పాత్ర నుంచి ఎంతో ఆశిస్తాం. కానీ దాన్ని ఏ విశిష్ఠత లేకుండా మామూలుగా లాగించేయడం కూడా నిరాశపరుస్తుంది. కథ పరంగా ఎక్కడా సర్ప్రైజింగ్ గా ఏమీ అనిపించదు. తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసిపోతుండడంతో క్యూరియాసిటీ ఉండదు. ఐతే సమంత పాత్ర.. తన పెర్ఫామెన్సుకి తోడు.. ఫ్యామిలీ సీన్లు-యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ సాగడం వల్ల ‘మా ఇంటి బంగారం’ ఎక్కడా బోర్ అయితే కొట్టించదు. కుటుంబంతో కలిసి ఒకసారి చూడ్డానికి ఢోకా లేని సినిమా ఇది.

నటీనటులు:

తెలుగులో చివరగా నటించిన ‘శాకుంతలం’లో తనకు ఏమాత్రం సూట్ కాని పాత్ర చేసి నిరాశపరిచిన సమంత.. ఈసారి పర్ఫెక్ట్ రోల్ తో అభిమానులను అలరించింది. ‘మా ఇంటి బంగారం’లో సమంతది ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను చక్కగా పండిస్తూనే.. ఇంకోవైపు అదిరిపోయే యాక్షన్ తోనూ ఆమె కట్టిపడేసింది. కామెడీలోనూ తన మార్కును చూపించింది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సామ్ పాత్ర.. తన పెర్ఫామెన్సే. సమంతకు జోడీగా నటించిన హిందీ నటుడు దిగంత్ పాత్ర పరిధి తక్కువే. అందులో అతను నీట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య తన ప్రత్యేకతను అక్కడక్కడా చూపించాడు కానీ.. తన పాత్ర మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. దాన్నుంచి ఇంకా ఏదో ఆశిస్తాం. సహాయ పాత్రల్లో సమంత స్నేహితురాలి క్యారెక్టర్ భలేగా అనిపిస్తుంది. అమాయకత్వంతో కూడిన ఆ పాత్రను చేసిన నటి చాలా బాగా నటించింది. గౌతమి.. ఆనంద్.. శ్రీ లక్ష్మి తమ అనుభవాన్ని చూపించారు. కృష్ణచైతన్య.. శ్రీముఖి.. శ్రీనివాస్ గవిరెడ్డి తమ తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

‘మా ఇంటి బంగారం’లో టెక్నీషియన్స్ అందరూ మంచి పనితనమే చూపించారు. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణగా మారింది. సన్నివేశాలకు తగ్గట్లుగా బీజీఎం ఇచ్చాడు సంతోష్. ఎలివేషన్ సీన్లలో స్కోర్ మంచి ఊపునిస్తుంది. ఉన్న ఒక్క పాట పర్వాలేదు. కెమెరామన్ ఓం ప్రకాశ్.. 90వ దశకంలో నడిచే ఈ కథకు అందుకు తగ్గ విజువల్స్ అందించాడు. పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగానే కుదిరాయి. వసంత్ మరిగంటితో కలిసి రాజ్ నిడిమోరు అందించిన స్క్రిప్టులో కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ.. రాజ్ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. ముఖ్యంగా ఫ్లాఫ్ బ్యాక్.. విలన్ ట్రాక్ విషయంలో రాజ్ మార్కు కనిపించలేదు. నందిని రెడ్డి టేకింగ్ బాగుంది. వినోదాత్మక సన్నివేశాల్లో తన మార్కు కనిపిస్తుంది. యాక్షన్ ఘట్టాలను కూడా బాగా తీర్చిదిద్దింది. కానీ రాతలో-తీతలో రాజ్-నందిని నుంచి ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశిస్తారు.

చివరగా: మా ఇంటి బంగారం.. సమంత షో

రేటింగ్ - 2.75/5