'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ
లవ్ టుడే.. డ్రాగన్.. డ్యూడ్ చిత్రాలతో తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ స్పందించిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.
By: Tupaki Desk | 10 April 2026 2:43 PM IST'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ - కృతి శెట్టి - ఎస్.జె.సూర్య - గౌరి కిషన్ - యోగిబాబు - సీమాన్ - మాళవిక తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: రవివర్మన్
నిర్మాతలు: నయనతార - లలిత్ కుమార్
రచన - దర్శకత్వం: విఘ్నేష్ శివ
లవ్ టుడే.. డ్రాగన్.. డ్యూడ్ చిత్రాలతో తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ స్పందించిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మరి ప్రదీప్ బ్లాక్ బస్టర్ స్ట్రీక్ ను ఈ చిత్రం కొనసాగించిందా? తెలుసుకుందాం పదండి.
కథ: ఇది 2040లో నడిచే కథ. ఆ టైంలో మొబైల్ వాడకానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా బతికే వాసు (ప్రదీప్ రంగనాథన్).. మొబైలే లోకంగా జీవించే ధీమా (కృతి శెట్టి)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తర్వాత ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ధీమా కూడా అతడ్ని ఇష్టపడుతుంది. కానీ తన మనసు కంటే లైక్ అనే యాప్ ను నమ్మే ధీమా.. దాని ఆధారంగా వాసుకు దూరం అవుతుంది. దీంతో లైక్ యాప్ మీద.. దాన్ని నడిపించే సూర్య మీద యుద్ధం ప్రకటిస్తాడు వాసు. యాప్ కంటే మనసు గొప్పది అని వాదించే వాసు.. ఆ విషయాన్ని ఎలా రుజువు చేశాడు.. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ: ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడికి మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన సినిమా ‘లవ్ టుడే’. మొబైల్ మన జీవితాల మీద ఎంతగా ప్రభావం చూపిస్తోందో.. దాని కారణంగా తలెత్తే అనర్థాలు ఎలాంటివో వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్. ఆ సినిమా చూసే స్ఫూర్తి పొందాడో ఏమో.. అదే హీరోతో మొబైల్ చుట్టూ తిరిగే ఇంకో కథతో వచ్చాడు విఘ్నేష్ శివన్. ప్రదీప్ కథను వర్తమానంలో నడిపిస్తే.. విఘ్నేష్ ఇంకో 14 ఏళ్లు ముందుకెళ్లి భవిష్యత్తులో నడిపించాడు. ఆ సమయానికి మొబైల్.. సోషల్ మీడియా.. కొత్త కొత్త యాప్స్ ఇంకెంతగా మన జీవితాలను ప్రభావితం చేస్తాయో.. ఎంటర్టైనింగ్ గా చూపించాలని చూశాడు విఘ్నేష్. భవిష్యత్ ముఖ చిత్రాన్ని కళ్ల ముందు పెట్టాలనే తన ఆలోచన చాలా కొత్తగా అనిపిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి ఒక ఊహాప్రపంచం చుట్టూ కథ రాసుకోవడం వల్ల ప్రతి సన్నివేశాన్నీ కొత్తగా చూపించడానికి అవకాశం లభించింది. ఒక దశ వరకు ఈ కొత్తదనమే కాక.. ఇందులోని వినోదం కూడా ఆకట్టుకుంటుంది. కానీ కథలో బలమైన సంఘర్షణ లేకపోవడంతో మధ్య దశ నుంచి ‘ఎల్ఐకే’ గాడి తప్పుతుంది. ఒకసారి అలా గాడి తప్పాక.. ఎంతకీ సినిమా ట్రాక్ ఎక్కలేదు. ఒక క్లారిటీ లేకుండా గజిబిజి గందరగోళంతో సాగే సన్నివేశాలు ‘ఎల్ఐకే’ను నీరుగార్చేశాయి. ఎంత మంచి ఐడియాను ఎలా చేసిపెట్టారో అన్నట్లుగా చాలా సాధారణంగా ముగుస్తుంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. కానీ ఇందులోని కొత్త ఐడియా కోసం.. కొన్ని ఎపిసోడ్ల కోసం ఒకసారి ట్రై చేసి చూడొచ్చు.
టెక్నాలజీ లేకుండా బతకలేని రోజులు ఇవి. కానీ ఆ సాంకేతికత మాయలో పడి.. మన ఆలోచనలను నమ్మడం మానేస్తే.. మనసును అనుసరించకపోతే ఏం జరుగుతుందో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు విఘ్నేష్ శివన్. యాప్ కంట్ హార్ట్ గొప్పదనే తన కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటికే సాంకేతికత మన జీవితాలను కమ్మేస్తుండగా.. ఇంకో పది పదిహేనేళ్లు ముందుకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో భలే గమ్మత్తుగా చూపించే ప్రయత్నం చేశాడు విఘ్నేష్ శివన్. మన భవిష్యత్తు జీవనాన్ని తెర మీద చూపిస్తే.. దాని మీద ఆటోమేటిగ్గా క్యూరియాసిటీ పెరగడం సహజం. 2040 నాటి ప్రపంచాన్ని చూపించే ప్రయత్నంలో విఘ్నేష్ తన క్రియేటివిటీని బాగానే వాడాడు. ఒక మనిషితో స్నేహం చేయాలన్నా.. ప్రేమించాలన్నా.. యాప్ సాయంతో కంపాటబిలిటీ చూసుకుని అడుగు ముందుకు వేసే రోజులను భవిష్యత్తులో చూడబోతున్నామంటూ వాటి చుట్టూ క్రేజీ సీన్లు రాసుకుని తెరపై ప్రెజెంట్ చేశాడు విఘ్నేష్. ఆ ఊహా ప్రపంచాన్ని చూపించడానికి అతను పడ్డ క్రియేటివ్ కష్టం తెరపై కనిపిస్తుంది. నిర్మాణ పరంగా కూడా అతడికి గొప్ప సహకారం అందింది. కొన్నేళ్ల వెనుకటి రోజులను చూపించాలంటే ఎంత కష్టమో.. భవిష్యత్ దర్శనం చేయించడం కూడా అంతే సవాలు. ఈ విషయంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ పెట్టిన ఎఫర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత ప్రేమ ఉందో యాప్ సాయంతో తెలుసుకోవడం.. స్కోర్ ఎక్కువైతేనే ప్రేమించుకోవడం.. లేదంటే బ్రేకప్ చెప్పుకోవడం.. ఈ కాన్సెప్ట్ అంతా క్రేజీగా అనిపిస్తుంది. ఒకవైపు ఈ సాంకేతిక మాయాజాలంలో జనాలు కొట్టుమిట్టాడుతుంటే.. ఇంకోవైపు నేరం చేసిన వాళ్లు శిక్ష కింద ఈ టెక్నాలజీకి పూర్తి దూరంగా ప్రకృతి ప్రపంచంలో గడపడం అనే కాన్సెప్ట్ కూడా అంతే క్రేజీగా అనిపిస్తుంది. సాంకేతికత మాయలో పడి మనం ఏం కోల్పోతున్నామో చెప్పే ప్రయత్నం కూడా బాగుంది.
ఐతే ప్రథమార్ధంలో కాన్సెప్ట్ ను ఎస్టాబ్లిష్ చేయడంలో విఘ్నేష్ మంచి నైపుణ్యం చూపించాడు. అలాగే భిన్న ప్రపంచాలకు చెందిన హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ ఏర్పడడానికి దారి తీసే సన్నివేశాలను కూడా బాగా డీల్ చేశాడు. వీరి మధ్య సంఘర్షణ మొదలై ఒకరికొకరు దూరమయ్యే సీన్ కూడా బాగానే పండింది. కానీ యాప్ కంటే హార్ట్ గొప్పది అని రుజువు చేస్తా అంటూ సవాలు చేశాక కథను ముందుకు తీసుకెళ్లే విషయంలో దర్శకుడు పూర్తిగా తేలిపోయాడు. తొలి సగంలో మాదిరి ఎగ్జైటింగ్ సీన్లు రాసుకోకపోవడంతో సెకండాఫ్ బాగా బోర్ కొట్టించేస్తుంది. విలన్ పాత్రను మరీ జోకర్ లాగా మార్చేయడం.. నాన్ సీరియస్ గా కథను నడిపించడంతో కథ పక్కదారి పట్టేసింది. అయోమయంగా అనిపించే హీరోయిన్ క్యారెక్టర్ వల్ల కూడా ‘ఎల్ఐకే’ బలహీనపడిపోయింది. ఆ పాత్రతో ఏ దశలోనూ ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడకపోవడంతో హీరో తన కోసం తపన పడే సీన్లు పండలేదు. ద్వితీయార్ధం అంతా చాలా మొక్కుబడిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రథమార్ధంలో అంతా కొత్తగా అనిపిస్తే.. సెకండాఫ్ విసుగు పుట్టించి ఈ కథతో డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. పతాక సన్నివేశాలు ఒక మోస్తరుగా అనిపిస్తాయి. ‘ఎల్ఐకే’లో కొత్తదనం ఉంది. ఒక మంచి ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఒక ఐడియాను బాగా మొదలుపెట్టి మధ్యలో దాన్ని పాడుచేసిన ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ సినిమాల మధ్య ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే ఒకసారి ‘ఎల్ఐకే’ ట్రై చేయొచ్చు కానీ.. ఇది పూర్తి సంతృప్తినైతే ఇవ్వదు.
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు. తన స్టైల్.. యువతకు నచ్చుతాయి. విషయం తగ్గిన సినిమాలో ప్రదీప్ తన వరకు బాగా ఎంగేజ్ చేశాడు. మొబైల్ యాప్ మీద ఆధారపడే.. మెచ్యూరిటీ లేని అమ్మాయి పాత్రకు కృతి శెట్టి సూట్ అయింది. క్యారెక్టర్ కు తగ్గట్లు పెర్ఫార్మ్ చేసింది. కానీ తన అప్పీయరెన్స్ అంత బాగా లేదు. తన పాత్ర కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేదు. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య మెప్పించాడు. తన పాత్ర వినోదాత్మకంగా సాగుతుంది. సూర్య టిపికల్ యాక్టింగ్.. డైలాగ్ డెలివరీ ఆ పాత్రకు ప్రత్యేకత తీసుకొచ్చాయి. గౌరి కిషన్ పర్వాలేదు. యోగిబాబు కొంత నవ్వించాడు. ఆనంద్ రాజ్.. సీమాన్.. మిగతా ఆర్టిస్టులు ఓకే.
సాంకేతిక వర్గం: అనిరుధ్ రవిచందర్ తన పాటలు.. నేపథ్య సంగీతంతో సినిమాకు తన వంతుగా ఏం చెయ్యాలో అదంతా చేశాడు. పాటలు హుషారు పుట్టిస్తాయి. బీజేఎంలోనూ మంచి ఫీల్ ఉంది. రవివర్మన్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. భవిష్యత్ ముఖచిత్రాన్ని చూపిస్తూ.. ఒక పెద్ద సినిమా స్థాయిలో కథకు అవసరమైన విధంగా ఖర్చు పెట్టారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. ఒక భిన్నమైన కథను ఎంచుకుని ప్రయోగం చేయడం వరకు బాగుంది. ఈ కొత్త ఐడియాను ఒక దశ వరకు బాగానే నడిపించాడు. కామెడీ సీన్స్ విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ కాన్ఫ్లిక్ట్ తర్వాత మాత్రం సినిమాను సరిగా ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ద్వితీయార్ధంలో ఏం చేయలేని అశక్తుడు అయిపోయాడు. సినిమాను సగం వండిన వంటకంలా తయారు చేశాడు.
చివరగా: ఎల్ఐకే.. ఐడియా అదరహో
రేటింగ్- 2.5/5
