మరో 90 రోజుల షూట్ బ్యాలన్స్
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో 'లవ్ అండ్ వార్' సినిమా ఒకటి. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు.
By: Tupaki Desk | 12 July 2025 10:00 PM ISTబాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో 'లవ్ అండ్ వార్' సినిమా ఒకటి. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగానే సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటే బాలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉంటాయి. రాజమౌళి రేంజ్‌లో భారీ సినిమాలను తీస్తాడు అంటూ ఈయనకు పేరు ఉంది. ఎన్నో పీరియాడిక్ డ్రామా మూవీస్‌తో పాటు, యుద్ద నేపథ్యంలోని సినిమాలను రూపొందించిన సంజయ్ లీలా భన్సాలీ ఈ మధ్య కాలంలో రూటు మార్చి కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వెబ్ సిరీస్ తర్వాత ఇప్పుడు లవ్ అండ్ వార్ సినిమాతో రాబోతున్నాడు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ హీరోలుగా పేరున్న రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లు హీరోలుగా నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలకు బాలీవుడ్‌లో మంచి ఆధరణ లభిస్తూ ఉంటుంది. ఇద్దరు హీరోలతో పాటు ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్ నటించడం వల్ల ఇది ముగ్గురు హీరోల స్థాయి భారీ మల్టీస్టారర్ అంటూ హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాను 2025 క్రిస్మస్‌కి విడుదల చేయాలని భావించారు. కానీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమా షూటింగ్‌ను పెంచుతూ పోతున్నాడు. ముందు అనుకున్నట్టుగా సినిమా పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
గతంలో సినిమాను 120 నుంచి 130 రోజుల్లో పూర్తి చేయాలి అనుకున్నారు. ఇప్పటి వరకు సినిమా 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ సగం పూర్తి అయిందని, ఇంకా బ్యాలెన్స్ చాలా ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 'లవ్ అండ్ వార్' సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా 90 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. 90 రోజుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నట్లు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న ఖరీదైన సినిమాల్లో ఇది ఒకటి అంటూ మీడియా సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
రణబీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెల్సిందే. రాముడిగా రణబీర్ కపూర్ మొదటి సారి నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది దీపావళి కి ఆ సినిమా రాబోతుంది. రామాయణ సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు లవ్ అండ్ వార్ సినిమా రాబోతుంది. 2026 మార్చిలో విడుదల చేసే విధంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆలియా భట్ చేసిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో లవ్ అండ్ వార్ సినిమాకు మరింతగా బజ్ క్రియేట్ అవుతోంది.
