దేశంలో పేదరికం - న్యూయార్క్ కంటే మెరుగైనదేనా?
ఒకప్పుడు అత్యంత పేదరికంలో ఉన్న భారత్ ఇప్పుడు ఆర్దికంగా గొప్ప శక్తిగా ప్రపంచ దేశాల సరసన నిలవడమే కాదు.
By: Srikanth Kontham | 4 May 2026 1:00 AM ISTఒకప్పుడు అత్యంత పేదరికంలో ఉన్న భారత్ ఇప్పుడు ఆర్దికంగా గొప్ప శక్తిగా ప్రపంచ దేశాల సరసన నిలవడమే కాదు. ఎకనమిక్ గ్రోత్ లో టాప్ 5 లోనూ నిలిచింది. ఇదంతా ఇప్పటి మాట. ఒకప్పుడు భారత్ అంటే పేదరిక దేశం గానే ప్రపంచానికి సుపరిచితం. పాశ్చాత్య దేశాలు భారతీయ పేదరికాన్ని జాలిగా విమర్శనాత్మకంగా చూసేవి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికన్ స్టాండ్-అప్ కమెడియన్ లూయిస్ సీకే ఇటీవల భారతదేశ పర్యటనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. లూయిస్ మాత్రం దీనికి భిన్నమైన విశ్లేషణ చేశారు. `భారతదేశంలో ఉన్నది ఫంక్షనింగ్ పావర్టీ (పనిచేసే పేదరికం) అని అర్దం.
ఇది న్యూయార్క్ నగరంలోని దుస్థితి కంటే చాలా మెరుగైనదని పేర్కొనడం విశేషం. లూయిస్ సీకే అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో పేదరికం ఉన్నా? ఇక్కడ ప్రజల మధ్య ఒక విధమైన సామాజిక అనుబంధం కనిపిస్తుంది. పేదరికంలో ఉన్నవారు కూడా సమాజంలో భాగంగానే ఉంటారు. వారు పనుల్లో నిమగ్నమై ఉంటారని ఆయన గమనించారు. కానీ న్యూయార్క్ వంటి సంపన్న నగరాల్లోని పేదరికం చాలా భయంకరంగా ఉంటుందని అక్కడ నిరాశ్రయులను ఎవరూ కనీసం మనుషులుగా కూడా గుర్తించరన్నారు. వారిని పట్టించుకోకుండా దాటి వెళ్లిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశ వీధుల్లోని పేదరికాన్ని చూసినప్పుడు అది ఒక రకమైన జీవకళతో ఉంటుందని లూయిస్ అభివర్ణించారు. ఇక్కడ పేదవారు కూడా ఏదో ఒక పని చేస్తూ ఇతరులతో మాట్లాడుకుంటూ సమాజంతో కలిసి జీవిస్తుంటారని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లో పేదవాడు అంటే సమాజానికి దూరంగా ఏకాకిగా మారిపోతాడని ఆ పరిస్థితి భారత్ కంటే దారుణంగా ఉంటుందని పోల్చారు. ఈ వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాల సామాజిక ఒంటరితనంపై చర్చకు దారితీశాయి.
న్యూయార్క్‌లో ఎవరైనా రోడ్డుపై పడి ఉంటే? ప్రజలు వారిని చూడనట్లుగా వెళ్లిపోతారని.. అక్కడ మనుషుల మధ్య అదృశ్య గోడలు ఉంటాయని లూయిస్ అభిప్రాయపడ్డారు.
కానీ భారతదేశంలో పేదరికంలో కూడా ఒక విధమైన మర్యాద, గుర్తింపు ఉంటాయన్నారు. పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదని మనుషుల మధ్య సంబంధాలు తెగిపోవడం అంతకంటే పెద్ద శాపమని స్టాండ్-అప్ కామెడీ స్పెషల్‌లో భాగంగా చర్చించారు. భారతదేశ దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను లూయిస్ పాజిటివ్ కోణంలో చూడటం గమనార్హం. ఇక్కడ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు కనిపించినా? ప్రజలు ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తారని కొనియాడారు. పాశ్చాత్య దేశాల్లోని ఆధునికత మానవత్వానికి దూరంగా జరుగుతోందనే చేదు నిజాన్ని ఆయన తన హాస్య ప్రసంగం ద్వారా ఎండగట్టారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నా? సామాజికంగా కలిసి ఉండటం అనేది దేశానికి ఎంతటి బలాన్నిస్తుందో ఆయన మాటలు నిరూపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఒంటరితనం కంటే కలిసి జీవించే పేదరికం కొంత మేలనే ఆయన విశ్లేషణ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది.
