రాజమౌళి (X) లోకేష్: ఎన్ని రోజుల్లో తీశామన్నది కాదన్నయ్యా!
ఇప్పుడు మహేష్ తో సినిమా కోసం రెండేళ్లు కేటాయిస్తున్నాడు రాజమౌళి. కరోనా లాంటి విపత్తు ఏదీ లేదు కాబట్టి ఆర్ఆర్ఆర్ కి పట్టినంత సమయం పట్టదు.
By: Tupaki Desk | 14 May 2025 9:33 PM ISTఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఒకే ఏడాదిలో 15పైగా సినిమాలను రూపొందించి రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. మలయాళ చిత్రసీమలో పరిమిత బడ్జెట్ తో తక్కువ సమయంలో సినిమాలను తెరకెక్కించి విడుదల చేయడం ఆనవాయితీ. చిన్న బడ్జెట్లతో పెద్ద విజయాల్ని అందిస్తారు అక్కడ దర్శకులు. కానీ అందుకు భిన్నంగా ఏళ్ల తరబడి సినిమాలు తీయడం అనే ఆనవాయితీని పరిచయం చేసిన కొందరు దర్శకులు ఉన్నారు. వారిలో ఎస్.శంకర్, రాజమౌళి ప్రథములు. శంకర్ తన రోబో, 2.0 లాంటి చిత్రాల కోసం చాలా సమయం తీసుకుని, భారీ బడ్జెట్లతో అసాధారణ కాన్వాసుతో రూపొందించారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నాలుగేళ్ల పాటు చిత్రీకరించాడు. కరోనా క్రైసిస్ కష్ట కాలం ఎదురైనా పాన్ ఇండియన్ సినిమా కోసం అతడు రాజీకి రాలేదు.
అదంతా అటుంచితే .. తాను రాజమౌళి తరహాలో ఏళ్ల తరబడి ఆర్టిస్టులను లాక్ చేయనని అన్నాడు లోకేష్ కనగరాజ్. అతడు తెరకెక్కించిన కూలీ త్వరలో విడుదల కానుండగా, తాజా ఇంటర్వ్యూలో పైవిధంగా వ్యాఖ్యానించాడు. రజనీ సర్‌తో కూలీ చిత్రాన్ని కేవలం ఏడాది కాలంలోనే పూర్తి చేసానని లోకేష్ వెల్లడించాడు. రాజమౌళిలా మూడు సంవత్సరాలు తాను ఆర్టిస్టులను కూచోబెట్టలేదని కూడా అతడు అన్నాడు. కూలీ మల్టీస్టారర్ సినిమా.. కాబట్టి చిన్న సమస్యలు లేదా జాప్యాలు తలెత్తాయి.. అది మన నియంత్రణకు మించినది. ఆర్ఆర్ లేదా మరేదైనా సినిమా లాగా... అందరు నటులను మూడు సంవత్సరాలు కూర్చోబెట్టడం నేను చేయను. ఆరు నుండి ఎనిమిది నెలల్లోనే షూటింగ్ పూర్తి చేస్తాను అని అన్నాడు.
నా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ గెటప్ మార్చుకోకూడదని లేదా మరొక సినిమా చేయకూడదని నేను చెప్పాల్సిన పని లేదు. వారు తమకు తాముగా దానిని చేయాలి... అని అన్నారు. నటుడు సౌబిన్ ఈ ఎనిమిది నెలల్లో ఆరు నుండి ఏడు చిత్రాలను వదులుకున్నారని, తన కూలీ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ఈ త్యాగం చేసారని అన్నారు.
అయితే పరిమిత బడ్జెట్లతో తక్కువ సమయంలో సినిమాలు తీయడం వేరు.. రాజమౌళిలా భారీ కాన్వాసును ఎంచుకుని దానికి తగ్గట్టు భారీతనంతో పాన్ ఇండియన్ ఆడియెన్ ని టార్గెట్ చేయడం వేరు. ఈ రెండో పనిని లోకేష్ కనగరాజ్ ఇప్పటివరకూ చేయలేదు. రాజమౌళి ఎంచుకున్న కథల స్పాన్ చాలా పెద్దది. దానికోసం ఆయన ఏళ్ల తరబడి పని చేసాడు. ఆ శ్రమ ఫలించి మినిమం 1000 కోట్లు కొల్లగొడుతున్నారు.
ఇప్పుడు మహేష్ తో సినిమా కోసం రెండేళ్లు కేటాయిస్తున్నాడు రాజమౌళి. కరోనా లాంటి విపత్తు ఏదీ లేదు కాబట్టి ఆర్ఆర్ఆర్ కి పట్టినంత సమయం పట్టదు. గ్లోబల్ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని జక్కన్న అత్యంత భారీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తాను ఎంచుకున్న ఫార్ములాతో 1000 కోట్ల క్లబ్ సినిమా తీయగలడా? అతడు దర్శకధీరుడి రికార్డులను తిరగరాయగలడా? దీనికి ప్రాక్టికల్ ఆన్సర్ అతడు ఇవ్వాల్సి ఉంది.
