యాక్టింగ్ డెబ్యూ కోసం ట్రైనింగ్ లో స్టార్ డైరెక్టర్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్‌పుల్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకడు. మా నగరం సినిమాతో లోకేష్ డైరెక్టర్ గా డెబ్యూ చేశాడు.
By: Tupaki Desk | 15 Jun 2025 11:20 AM ISTఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్‌పుల్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకడు. మా నగరం సినిమాతో లోకేష్ డైరెక్టర్ గా డెబ్యూ చేశాడు. ఆ సినిమా మంచి టాక్ కూడా తెచ్చుకుంది. కానీ మా నగరం తర్వాత లోకేష్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలే అతనికి మరింత క్రేజ్ ను తెచ్చి పెట్టి లోకేష్ ను స్టార్ డైరెక్టర్ గా మార్చాయి. సినిమాటిక్ యూనివర్స్ అనే కొత్త ఒరవడిని పరిచయం చేసిన ఘనత కూడా లోకేష్‌దే.
తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా లోకేష్ కు మంచి క్రేజ్ ఉంది. కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి అందులో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా లోకేష్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్, నివిన్ పౌలి నటిస్తున్న బెంజ్ సినిమాను లోకేష్ నిర్మిస్తున్నాడు. మొత్తానికి ఓ వైపు డైరెక్టర్ గా, మరోవైపు నిర్మాతగా లోకేష్ చాలా బిజీ అయ్యాడు.
ఇంత బిజీగా ఉన్న లోకేష్ ఇప్పుడు యాక్టింగ్ లోకి కూడా అడుగుపెట్టనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆల్రెడ శృతి హాసన్ తో కలిసి ఇనిమేల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించి యాక్టర్ గా మంచి ప్రశంసలు అందుకున్నాడు లోకేష్. అప్పట్నుంచి లోకేష్ సినిమాలు చేస్తే బావుంటుందని ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేయగా, ఇప్పుడు వారి కోరికను లోకేష్ సీరియస్ గా తీసుకుని హీరోగా అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది.
ఇన్నేళ్లూ కెమెరా వెనుక ఉండి విభిన్న కథలను తెరకెక్కించిన లోకేష్, ఇప్పుడు తెరపైకి వచ్చి హీరోగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడని, ఇప్పటికే దానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయని, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
కథలో భాగంగా లోకేష్ ఆ సినిమా కోసం రెడీ అవుతున్నాడని, అందులో భాగంగానే లోకేష్ మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన స్పెషల్ ట్రైనింగ్ ను థాయ్‌లాండ్ లో తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఓ వైపు తన సినిమాలకు సంబంధించిన పనులను చూసుకుంటూనే లోకేష్ ట్రైనింగ్ కూడా కొనసాగిస్తున్నాడని అంటున్నారు. డైరెక్టర్ గా లోకేష్ ప్రస్తుతం రజినీకాంత్ తో కూలీ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న కూలీ ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ ఖైదీ2 తో పాటూ ఆమిర్ ఖాన్ హీరోగా ఓ సూపర్ హీరో సినిమాను చేయనున్నాడు.
