Begin typing your search above and press return to search.

'క్లాస్' మూవీస్ వర్సెస్ 'మాస్' పల్స్: బాక్సాఫీస్ అసలు నిజం

అయితే, ఈ విజయం వెనుక ఉన్న బాక్సాఫీస్ సత్యాన్ని గమనిస్తే.. అచ్చం తండ్రి నాగార్జున లాగే అఖిల్ కూడా మాస్ పల్స్ పట్టుకుని పల్లెటూరి కథతోనే సక్సెస్ ట్రాక్ ఎక్కడం విశేషం.

By:  Madhu Reddy   |   11 July 2026 3:33 PM IST
క్లాస్ మూవీస్ వర్సెస్ మాస్ పల్స్: బాక్సాఫీస్ అసలు నిజం
X

సినీ ఇండస్ట్రీలో కొన్ని అనుకోకుండా జరిగేది చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం దాటినా సరైన సాలిడ్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్‌కు ఎట్టకేలకు 'లెనిన్' సినిమాతో ఒక ఊరట లభించింది. నిన్నే విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్, కలెక్షన్ల నెంబర్లు చూస్తుంటే అఖిల్ ఖాతాలో పక్కా హిట్ పడినట్టే కనిపిస్తోంది. అయితే, ఈ విజయం వెనుక ఉన్న బాక్సాఫీస్ సత్యాన్ని గమనిస్తే.. అచ్చం తండ్రి నాగార్జున లాగే అఖిల్ కూడా మాస్ పల్స్ పట్టుకుని పల్లెటూరి కథతోనే సక్సెస్ ట్రాక్ ఎక్కడం విశేషం.

నాగార్జున ఫ్లాష్ బ్యాక్ స్టోరీ:

కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే.. 1989లో వచ్చిన ‘శివ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాగార్జున గారు వరుసగా ప్రయోగాలు చేశారు. కొత్త తరహా సినిమాల కోసం ఇతర భాషల దర్శకులను కూడా తీసుకొచ్చారు. కానీ నిర్ణయం, చైతన్య, అంతం, కిల్లర్ లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఇవన్నీ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అర్బన్ కథలు కావడం వల్ల సాధారణ ప్రేక్షకుడికి అంతగా కనెక్ట్ కాలేదు.

పల్లెటూరి కథే నాగ్ ను రక్షించింది:

అలాంటి క్లిష్ట సమయంలో నాగార్జున గారు రూట్ మార్చి ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ సినిమా చేశారు. పూర్తిగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ పల్లెటూరి యువకుడిగా నాగ్ కనిపించిన విధానం సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన అల్లరి అల్లుడు, హలో బ్రదర్ సినిమాలు కూడా అదే మాస్ టచ్‌తో సాగి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. సిటీ కథల కంటే పల్లెటూరి నేటివిటీ ఉన్న సినిమాలే నాగ్‌ను స్టార్‌గా నిలబెట్టాయి.

క్లాస్ సినిమాలతో అఖిల్ కి నష్టం:

ఇక అఖిల్ విషయానికి వస్తే, డెబ్యూ మూవీ ‘అఖిల్’ నుంచి మొన్నటి ‘ఏజెంట్’ దాకా తను ఎప్పుడూ మాస్ వర్గాలను పెద్దగా పట్టించుకోలేదు. మోడ్రన్ యువతను మెప్పించేలా ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి అర్బన్ స్టైల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. ఇవి చూడటానికి స్టైలిష్‌గా ఉన్నా, బి, సి సెంటర్లలో ఉండే సామాన్య జనాలకు అస్సలు ఎక్కలేదు. ఇక దీనివల్ల చాలా కాలం పాటు సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది.

‘లెనిన్’ తో మారిన అఖిల్ రాత:

కానీ ఇప్పుడు వచ్చిన ‘లెనిన్’ సినిమా అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉంది. ఇందులో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా చదువు రాని ఒక పల్లెటూరి యువకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. తనలోని అసలైన యాక్టింగ్ పవర్‌ను బయటకు తీశాడు. ఇక అచ్చం తండ్రి నాగార్జున లాగే, అఖిల్‌కు కూడా సిటీ డ్రామాలు ఇవ్వని పెద్ద సక్సెస్‌ను ఈ పల్లెటూరి నాటు కథే తెచ్చిపెట్టింది.

బాక్సాఫీస్ దగ్గర అసలైన కలెక్షన్లు రావాలంటే 'మాస్ పల్స్' పట్టడం ఎంత ముఖ్యమో నాగార్జున, అఖిల్ కెరీర్లను చూస్తే అర్థమవుతుంది. అర్బన్ సినిమాలు కేవలం క్లాస్ ఆడియన్స్‌కు మాత్రమే నచ్చుతాయి, కానీ నేటివిటీ ఉన్న మాస్ సినిమాలే థియేటర్లను కళకళలాడేలా చేస్తాయి. మరి 'లెనిన్' ఇచ్చిన ఈ జోష్‌తో అఖిల్ మున్ముందు ఎలాంటి మాస్ కథలను ఎంచుకుంటాడో చూడాలి..