దివికేగిన గానకోకిల ఎస్.జానకి.. తీవ్ర విషాదంలో అభిమానులు!
దక్షిణాది గానకోకిలగా కోట్లాది మంది సంగీత ప్రియులచే `జానకమ్మ`గా ఎంతో ఆప్యాయంగా పిలుపు అందుకున్న పాపులర్ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు.
By: Sivaji Kontham | 11 July 2026 9:30 PM ISTదక్షిణాది గానకోకిలగా కోట్లాది మంది సంగీత ప్రియులచే `జానకమ్మ`గా ఎంతో ఆప్యాయంగా పిలుపు అందుకున్న పాపులర్ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. శనివారం రాత్రి జరిగిన ఈ విషాద పరిణామం యావత్ భారత చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకి మరణవార్త విన్న వెంటనే కర్ణాటక మంత్రి యాతింద్ర సిద్ధరామయ్య ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించగా.. ఈ అసమాన గాయని మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఎస్. జానకి బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 23 ఏప్రిల్ 1938న జన్మించారు. తండ్రి సిస్ట్లా శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడిగా, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. జానకి బాల్యమంతా సిరిసిల్లలోనే సాగింది. అక్కడ కేవలం 9 సంవత్సరాల వయసులోనే మొదటిసారి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నా.. శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి అధికారిక శిక్షణ తీసుకోకుండానే లెజెండరీ సింగర్‌గా ఎదగడం విశేషం.
ఎస్.జానకి మాతృభాష తెలుగు అయినా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడటంతో పాటు రాయగల అద్భుతమైన బహుభాషా నైపుణ్యం ఉండేది. 1959లో వి. రాంప్రసాద్‌తో ఆమె వివాహం జరగ్గా... ఆయన జానకి మ్యూజిక్ కెరీర్‌కు ఎంతో మద్దతుగా నిలిచి ప్రతి రికార్డింగ్‌కు తోడుగా వచ్చేవారు. 1997లో ఆయన గుండెపోటుతో మరణించారు. జానకి 1957లో తన 19వ ఏట `విధియిన్ విలయాట్టు` అనే తమిళ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఆరు వేర్వేరు భాషల్లో పాటలు పాడి రికార్డు సృష్టించారు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగిన ఈ గానకోకిల సుదీర్ఘ కెరీర్ 2016లో అధికారిక రిటైర్మెంట్ ప్రకటనతో ముగిసింది. అయితే 2018లో `పన్నాడి` అనే తమిళ చిత్రం కోసం మళ్లీ మైక్ పట్టి ఒక పాట పాడి... తన 60 ఏళ్ల సుదీర్ఘ సంగీత వారసత్వానికి ఘనమైన ముగింపు పలికారు. తన అద్భుతమైన కెరీర్‌లో ఉత్తమ గాయనిగా 4 జాతీయ చలనచిత్ర అవార్డులను.. పలు రాష్ట్రాల నుండి రికార్డు స్థాయిలో 33 రాష్ట్ర చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకున్నారు.
సంగీతానికి ఈ సీనియర్ గాయని ఎంతో చేసారు. అయితే ప్రభుత్వాలు గుర్తించడంలో తడబడ్డాయి. చాలా ఆలస్యంగా ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తృణప్రాయంగా తిరస్కరించారు జానకి. తనకు భారతరత్న రావాల్సి ఉందని, తన సేవల్ని ఎప్పుడో గుర్తించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాయని జానకి సున్నితంగా తన పద్మ పురస్కారాన్ని తిరస్కరించారు. అవార్డులకతీతంగా దశాబ్దాల పాటు తన గాత్రంతో భారతీయ సినిమాను ఓలలాడించిన జానకమ్మ భౌతికంగా దూరమైనా.. మేటి గాయని పాడిన వేలాది అమరగానాలు ఎప్పటికీ శ్రోతల గుండెల్లో నిలిచే ఉంటాయి.
