Begin typing your search above and press return to search.

NBK అఖండ 2 త‌ర్వాత‌ లెజెండ్ 2

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2024 3:45 AM GMT
NBK అఖండ 2 త‌ర్వాత‌ లెజెండ్ 2
X

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎల‌క్ష‌న్ ముగిసిన అనంత‌రం త‌న త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి సారించ‌నున్నారు. ఎన్నిక‌ల అనంత‌రం ఆయ‌న‌ త‌న హిట్ సినిమాల సీక్వెల్స్ పై దృష్టి సారించ‌నున్నార‌ని స‌మాచారం. ఎన్బీకే కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచిన అఖండ, లెజెండ్ చిత్రాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్క‌నున్నాయ‌ని చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తుండ‌గా అఖండ 2ని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

2014 చిత్రం లెజెండ్ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లెజెండ్ మేకర్స్ ఇటీవ‌ల‌ థియేటర్లలో రీరిలీజ్ చేయ‌గా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జ‌యిట్ అయ్యారు. ఈ సినిమా కథాంశం ఎత్తుగ‌డ ఎప్ప‌టికీ ఆస‌క్తిక‌రం. లెజెండ్.. శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) అనే లెక్చరర్ స్టోరి. అతడు అన్యాయాన్ని సహించలేడు. చట్టాన్ని ఉల్లంఘించే దుర్మార్గుల భ‌ర‌తం ప‌ట్టే ధీరుడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 28 మార్చి 2014న థియేటర్లలో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. లెజెండ్‌కి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. తాజా స‌మాచారం మేర‌కు బోయ‌పాటి లెజెండ్ సీక్వెల్ స్క్రిప్టును రెడీ చేయిస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

లెజెండ్ తర్వాత బాలకృష్ణ - బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక‌లో `అఖండ` వ‌చ్చింది. 2021 యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌ తుఫాన్ సృష్టించింది. భారీ మాస్ యాక్ష‌న్ డ్రామాకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఇంత‌కుముందే సీక్వెల్ ని ప్రకటించాడు. ఇటీవ‌ల తేదేపా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాల‌య్య బిజీగా ఉండ‌గా, బోయ‌పాటి మ‌రోసారి అఖండ సీక్వెల్ ని అధికారికంగా ధృవీక‌రించారు. ఎన్నిక‌ల త‌ర్వాత సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిపారు. అఖండ సీక్వెల్ సామాజిక ఫాంటసీ అంశంతో పాటు అతీంద్రియ అంశాలతో తెర‌కెక్కే వీలుంద‌ని టాక్. పిల్ల‌లు నేచుర్ థ్రిల్స్ లాంటి ఎలిమెంట్స్ ఉత్కంఠ క‌లిగించ‌నున్నాయ‌ని తెలిసింది. ఎన్బీకే ఈ చిత్రంలో మరో ఎగ్జ‌యిటింగ్ అవతార్‌లో కనిపిస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఆఖండ 2లో నందమూరి బాలకృష్ణ కొన్ని హై-ఆక్టేన్ స్టంట్స్ తో అల‌రిస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికి ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. అఖండ 2 పూర్త‌యాక లెజెండ్ 2 పైనా బోయ‌పాటి పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు చేస్తారు. ఈలోగానే లెజెండ్ 2 క‌థాంశం కూడా రెడీ కానుంద‌ని తెలిసింది.