గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై డాక్యు సిరీస్.. మోకాలడ్డిన ప్రభుత్వం!
ప్రభుత్వ అడ్వైజరీని సవాల్ చేస్తూ జీ5 చట్టపరమైన చర్యలకు దిగింది. తమ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసుకునే హక్కును కాపాడాలని కోరుతూ న్యాయస్థానంలో ఊరట కోసం ప్రయత్నిస్తోంది.
By: Sivaji Kontham | 25 April 2026 9:15 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలా గ్యాంగ్ స్టర్ సినిమాలు యథేచ్ఛగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిజ జీవితకథల ఆధారంగా కొన్ని గ్యాంగ్ స్టర్ సినిమాలు తెరకెక్కాయి. అయితే ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టర్ గురించిన సినిమా తీవ్రమైన చిక్కుల్లో పడింది. ఈ సినిమాని రిలీజ్ కానివ్వకుండా ప్రభుత్వమే అల్టిమేటమ్ జారీ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలింతకీ ఎవరా గ్యాంగ్ స్టర్? అంటే.. నిరభ్యంతరంగా అతడు పంజాబీ గ్యాంగ్ స్టర్ `లారెన్స్ బిష్ణోయ్` అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్, అతడి అనుచరుల అరాచకాల గురించి మీడియాలో కథనాలొస్తున్నాయి. అతడు జైలు నుంచే శాసిస్తున్నాడు. పోలీసులను గడగడలాడిస్తున్నాడు. ఇప్పుడు అతడి జీవితంపై తెరకెక్కిన డాక్యు సిరీస్ హా*ట్ టాపిగ్గా మారింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 రూపొందించిన `లారెన్స్ ఆఫ్ పంజాబ్` అనే డాక్యు-సిరీస్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ను ప్రసారం చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేయడంతో జీ5 సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఈ సిరీస్ 27 ఏప్రిల్ 2026న విడుదల కావాల్సి ఉండగా.. విడుదలకు కేవలం మూడు రోజుల ముందే ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఈ సిరీస్ పై పంజాబ్ పోలీసులు ప్రాథమికంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి కంటెంట్ సమాజంలోని యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని.. ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాలను గ్లామరైజ్ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కూడా ఈ సిరీస్‌ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి ప్రసారాల వల్ల పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రభుత్వ అడ్వైజరీని సవాల్ చేస్తూ జీ5 చట్టపరమైన చర్యలకు దిగింది. తమ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసుకునే హక్కును కాపాడాలని కోరుతూ న్యాయస్థానంలో ఊరట కోసం ప్రయత్నిస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛ, వినోద రంగ హక్కులకు, సామాజిక భద్రత- శాంతిభద్రతలకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఏప్రిల్ 24న అడ్వైజరీ జారీ కావడంతో... ఈ వివాదం ఓటీటీ నిబంధనలపై కొత్త చర్చకు దారితీసింది.
సామాజిక బాధ్యత వెర్సెస్ సృజనాత్మక స్వేచ్ఛా: రెండువైపులా ఆలోచించాలి
అయితే కళాత్మక స్వేచ్ఛ -సామాజిక బాధ్యత మధ్య సమతుల్యతను సాధించడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించే క్రియేటివ్ కంటెంట్ సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబిస్తుంది. ఇది ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. అయితే గ్యాంగ్‌స్టర్ల జీవితాలను తెరపై చూపించేటప్పుడు వారు చేసే నేరాలను గొప్పగా చూపడం వల్ల యువత పెడదారి పట్టే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భాల్లో, ప్రభుత్వం లేదా సెన్సార్ బోర్డు జోక్యం చేసుకోవడం అనేది కేవలం అణచివేత మాత్రమే కాకుండా.. ప్రజా శాంతిని కాపాడే ఒక `ముందస్తు జాగ్రత్త` లేదా సామాజిక బాధ్యతగా కూడా చూడవచ్చు.
అదే సమయంలో ప్రతి కంటెంట్‌ను నిషేధించడం అనేది భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏది చూడాలో.. ఏది చూడకూడదో నిర్ణయించే హక్కు ప్రేక్షకుడికి ఉండాలి. కంటెంట్‌ను పూర్తిగా నిషేధించే బదులు.. తగిన రేటింగ్స్ - హెచ్చరికలు జారీ చేయడం ద్వారా నియంత్రించడం ఉత్తమమైన మార్గం. కళాకారులు కూడా తమ సృజనాత్మకత నేర ప్రవృత్తిని ప్రేరేపించకుండా.. వాస్తవాలను నిష్పాక్షికంగా చూపేలా స్వీయ నియంత్రణ పాటించడం అత్యవసరం. దీనివల్ల అటు కళాత్మక విలువలు దెబ్బతినకుండా.. ఇటు సామాజిక భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉంటుంది.
