Begin typing your search above and press return to search.

మెగా కోడలికి కూడా ఆ ఇబ్బందులు తప్పలేదా? అసలేం జరిగింది?

తాజాగా మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

By:  M Prashanth   |   10 March 2026 10:51 AM IST
మెగా కోడలికి కూడా ఆ ఇబ్బందులు తప్పలేదా? అసలేం జరిగింది?
X

సోషల్ మీడియా వేధింపులు సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు. తాజాగా మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై నెట్టింట అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పరువు నష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆమె హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పర్పుల్ క్రెయాన్ 00 అనే ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనను టార్గెట్ చేసుకుని తప్పుడు మాటలు అంటున్నారని లావణ్య త్రిపాఠి తెలిపారు. కొంతకాలంగా ఆ అకౌంట్ నుంచి తన పర్సనల్ లైఫ్, కుటుంబ సభ్యుల గురించి తప్పుడు ప్రచారం చేస్తూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె వివరించారు. కామెంట్ల రూపంలో అసభ్య పదజాలంతో తిడుతున్నారని అన్నారు.

ఆ వేధింపుల వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని, చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఆ ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ ను రన్ చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తనపై పెట్టిన పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67తో పాటు భారత న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్ గుర్తించేందుకు డిజిటల్ ప్రూఫ్స్ తో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ట్రోలింగ్ పెరుగుతోంది.

కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని పర్సనల్ కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవి గురించి సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ట్రోల్స్‌ పై కొన్నిరోజుల క్రితం లావణ్య త్రిపాఠి స్పందించిన విషయం తెలిసిందే.

తన కుటుంబానికి సంబంధించిన హ్యాపీ మూమెంట్స్ తో అసభ్యకర వ్యాఖ్యలతో వక్రీకరించడం కరెక్ట్ కాదని ఆమె వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులపై ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరమని చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు మెగా కోడలిపై సోషల్ మీడియాలో వేధింపులు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ ఘటనపై లావణ్య త్రిపాఠి తీసుకున్న చట్టపరమైన చర్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ కు ఒక వార్నింగ్ గా మారాయని పలువురు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.