గ్లామర్‌కు జీవ రూపం.. జెఫ్ భార్య వెడ్డింగ్ గౌన్ విశేషాలివీ
ఇటలీలోని శోభాయమానమైన వెనిస్ నగరాన్ని సాక్షిగా చేసుకుని, ప్రపంచపు అగ్రకుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ , ప్రముఖ టీవీ యాంకర్, పైలట్ లారెన్ సాంచెజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు
By: Tupaki Desk | 30 Jun 2025 5:59 PM ISTఇటలీలోని శోభాయమానమైన వెనిస్ నగరాన్ని సాక్షిగా చేసుకుని, ప్రపంచపు అగ్రకుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ , ప్రముఖ టీవీ యాంకర్, పైలట్ లారెన్ సాంచెజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట శనివారం రాత్రి జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జీవితాంతం గుర్తుండిపోయే లుక్స్‌తో మెరిసారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రత్యేక అంశం… లారెన్ ధరించిన ఆ కలల గౌన్!
-డోల్స్ & గబ్బానా డిజైన్ చేసిన కలల గౌన్
లారెన్ సాంచెజ్ తన పెళ్లికి ప్రత్యేకంగా డోల్స్ & గబ్బానా ఆల్టా మోడా సంస్థ రూపొందించిన వెడ్డింగ్ గౌన్‌ను ఎంపిక చేసుకుంది. ఇది విన్న క్షణంలో సాధారణంగా ఏదైనా డిజైనర్ గౌన్ అనిపించవచ్చు కానీ దీని వెనుక ఒక అద్భుతమైన ప్రయాణం ఉంది. ఈ గౌన్ తయారీకి ఏకంగా 900 గంటల సమయం పట్టింది. అద్భుతమైన చేతిపనితో తయారైన ఇటాలియన్ లేస్, 180 సిల్క్ చిఫ్ఫాన్‌తో కవర్ చేసిన బటన్లు ఈ గౌన్‌కు ప్రీమియమ్ అందాన్ని తీసుకొచ్చాయి.
ఈ డిజైన్‌కు 1950ల హౌస్‌బోట్ సినిమాలో నటి సోఫియా లోరెన్ ధరించిన డ్రెస్ ప్రేరణగా నిలిచిందని సమాచారం. ఈ గౌన్ విలువ సుమారు రూ. 12 కోట్లు ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
- అంతరిక్షం నుంచి అద్భుతానికి ప్రయాణం
లారెన్ ఇటీవలి స్పేస్ ఫ్లైట్ అనుభవం ఈ వెడ్డింగ్ డ్రెస్ ఎంపికపై ప్రేరణగా నిలిచిందట. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థతో ఏప్రిల్‌లో ఆమె చేసిన అంతరిక్ష యాత్ర తన ఆలోచనలకే కాదు, ఆత్మవిశ్వాసానికీ ఒక కొత్త దిశ ఇచ్చిందని వోగ్‌కు తెలిపింది.
"తొలుత స్ట్రాప్‌లెస్ డ్రెస్ ధరించాలనుకున్నాను. కానీ చివరికి నా జీవితాన్ని ప్రతిబింబించేలా, ఆ రోజు ప్రత్యేకతను అందించగలిగేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది కేవలం గౌన్ కాదు, అది ఒక కవిత, ఒక భావోద్వేగం" అని ఆమె పేర్కొంది.
- బెజోస్ కోసం బిగ్ సర్‌ప్రైజ్
జెఫ్ బెజోస్ తన పెళ్లి గౌన్‌ను ముందే చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూసాడట. అయితే లారెన్, "అది ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ కావాలి" అనే ఉద్దేశంతో అతనికి చూపించకుండా ఉంచింది. చివరకు పెళ్లి వేడుక సమయంలో లారెన్ అందులో మెరిసిపోవడంతో ఆ క్షణం మరింత మధురంగా మారింది.
2019 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట, గత ఏడాది నిశ్చితార్థం చేసుకుని, 2025 జూన్ 27న తమ ప్రేమ కథను శాశ్వత బంధంగా మార్చుకున్నారు. ఈ అద్భుతమైన వెడ్డింగ్ వేడుక, ప్రత్యేకమైన డ్రెస్, అంతరిక్షాన్ని తాకిన ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలసి లారెన్ సాంచెజ్‌ను ఈ శతాబ్దపు అత్యంత గుర్తుండిపోయే వధువుగా నిలిపాయి.
