Begin typing your search above and press return to search.

ఆస్కార్ బ‌రికి పంపిన మూవీపై పెద్ద కాపీ క్యాట్ వివాదం

ఈ వీడియో చూడగానే నెటిజన్లు స్పందిస్తూ.. కిరణ్ రావు అరబిక్ సినిమా థీమ్‌ను కాపీ చేశారా! అంటూ ఆశ్చర్యపోయారు.

By:  Tupaki Desk   |   2 April 2025 4:11 PM IST
ఆస్కార్ బ‌రికి పంపిన మూవీపై పెద్ద కాపీ క్యాట్ వివాదం
X

బాలీవుడ్ ప్ర‌ముఖ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య‌, ద‌ర్శ‌కురాలు కిరణ్ రావు తెర‌కెక్కించిన‌ `లాపాటా లేడీస్` ఆస్కార్ రేసులోను పోటీకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఇది ఒక సెటైరిక‌ల్ కామెడీ మూవీ. ఈ చిత్రం 2019లో వచ్చిన `బుర్కా సిటీ` అనే అరబిక్ ల‌ఘు చిత్రానికి కాపీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల `బుర్కా సిటీ` నుండి వచ్చిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైర‌లైంది. ఇది చూశాక‌.. కిరణ్ రావు బాలీవుడ్ సినిమా ఒరిజిన‌లేనా? కాదా అనే సందిగ్ధత‌ మొదలైంది. వైరల్ `అరబిక్` సినిమా క‌థాంశం ప్ర‌కారం.. ఒక నూతన వరుడు తన భార్య కోసం వెతుకులాడుతూ ఉంటాడు. ఆమె స్థానంలో బుర్కా ధరించిన మరొక మహిళ పొరపాటున వచ్చి చేరుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా. ఇదే లైన్ తో `లాపాటా లేడీస్` కూడా తెర‌కెక్కింది. దీంతో నెటిజ‌నులు ఖంగు తిన్నారు. అంత పెద్ద స్టార్ హీరో వైఫ్‌.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు ఇలా కాపీ క్యాట్ సినిమా చేయ‌డ‌మే గాక‌, ఆస్కార్ అవార్డ్స్ రేసుకి పంపుతారా? అంటూ నెటిజనులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ వీడియో చూడగానే నెటిజన్లు స్పందిస్తూ.. కిరణ్ రావు అరబిక్ సినిమా థీమ్‌ను కాపీ చేశారా! అంటూ ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ లో అన్నీ కాపీ క్యాట్ సినిమాలే. ఏదీ ఒరిజిన‌ల్ కళాఖండంలా అనిపించదు. అవన్నీ వేరే చోట నుండి కాపీ పేస్ట్ చేసిన‌వే. సిగ్గులేకుండా ఒరిజిన‌ల్ రచనగా ప‌బ్లిసిటీ చేసుకుంటారు!`` అని ఒక నెటిజ‌న్ ఘాటుగా స్పందించాడు. భారతదేశంలో దోపిడీ క‌థ‌లే కానీ, కొత్త క‌థ‌లేవీ ఉండ‌వు.. అని మరొకరు విమ‌ర్శించారు. లాపాటా లేడీస్ ఒరిజిన‌ల్ సినిమా అని నేను భావించాను.. కాదు అని తేలింది! అని మ‌రో వ్య‌క్తి అన్నారు.

లాపాటా లేడీస్ 2024 మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్పర్ష్ శ్రీవాస్తవ, ప్రతిభా రంతా, నితాన్షి గోయెల్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విలేజ్ నేప‌థ్యంలో ఆద్యంతం కామెడీ సెటైరిక‌ల్ కంటెంట్ తో ఇది రూపొందింది. రైలు ప్రయాణంలో ఇద్ద‌రు పెళ్లి కొడుకులు త‌మ పెళ్లికూతుళ్లు మారిపోయాక ఎలా షాక్ కి గుర‌య్యారు? ఆ త‌ర్వాత క‌థేమిటి? అన్న‌ది తెర‌పై ఆవిష్క‌రించారు. మారిపోయిన వ‌ధువుల‌ కోసం భ‌ర్త‌ల వెతుకులాట, ఆరాటం నేప‌థ్యంలో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది.

ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ -కిండ్లింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో నిర్మించిన ఈ చిత్రంలో ప్ర‌ధాన‌మైన‌ పాయింట్ ఆక‌ర్షిస్తుంది. ధోబీ ఘాట్ తర్వాత కిరణ్ రావు దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చిన చిత్ర‌మిది. థియేటర్లలో విడుదలకు ముందు ఈ చిత్రం 2023లో ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శిత‌మైంది. ఉత్సవంలో హాజరైన ప్రేక్షకుల నుండి దీనికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. 2025 ఆస్కార్లలో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం త‌ర‌పున అధికారికంగా `లాపాటా లేడీస్` పోటీబ‌రిలో నిలిచింది.