లెజెండరీ క్రికెటర్ లాలా అమరనాథ్ బయోపిక్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
By: Sivaji Kontham | 12 July 2026 10:16 AM ISTఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచిన ఆమిర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ మళ్లీ ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఆస్కార్ నామినేషన్ సాధించిన క్లాసిక్ హిట్ `లగాన్` విడుదలై సరిగ్గా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చారిత్రక స్పోర్ట్స్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. భారత క్రికెట్ పితామహుడిగా పిలుచుకునే లెజెండరీ క్రికెటర్ లాలా అమరనాథ్ జీవిత విశేషాల ప్రేరణతో `లాల్‌కార్` అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ సినిమా కేవలం ఒక సాధారణ బయోపిక్ మాత్రమే కాదు. 1952లో స్వతంత్ర భారతదేశం - పాకిస్తాన్ మధ్య జరిగిన చారిత్రాత్మకమైన టెస్ట్ క్రికెట్ సిరీస్ ఆధారంగా ఈ కథను అల్లారు. దేశ విభజన తాలూకు గాయాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం కేవలం ఆటకే పరిమితం కాకుండా.. ఇరు దేశాల మధ్య శత్రుత్వం, స్నేహం, దేశభక్తి , జాతీయత వంటి అత్యంత బలమైన భావోద్వేగ అంశాల సమాహారంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో స్వతంత్ర భారతదేశపు తొలి టెస్ట్ కెప్టెన్ లాలా అమర్‌నాథ్ పాత్రను మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పోషిస్తుండగా... మరో స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో మెరిపించనున్నారు. లాలా అమర్‌నాథ్ 1933లో భారతదేశం తరఫున తొలి టెస్ట్ సెంచరీ సాధించడం.. ఆ తర్వాత 1952లో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత జట్టుకు మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించడం వంటి అద్భుతమైన చారిత్రక ఘట్టాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు.
ఈ చిత్రానికి బాలీవుడ్ దిగ్గజాలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలకు చెందిన `ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్`తో పాటు.. స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ సైతం రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా మారారు. ఆమిర్ ఖాన్‌కు గతంలో `దిల్ చాహతా హై` వంటి కల్ట్ హిట్ ఇచ్చిన ఫర్హాన్.. అలాగే `3 ఇడియట్స్`, `పీకే` వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన రాజ్‌కుమార్ హిరాణీ.. ఇప్పుడు ఈ సినిమా కోసం చేతులు కలపడం పరిశ్రమలో భారీ అంచనాలను పెంచేసింది.
2019లో ఈ కథతో షారుఖ్ ఖాన్ హీరోగా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణంలో సినిమా రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. చివరకు `దంగల్` ఫేమ్ పీయూష్ గుప్తా, `నిల్ బట్టే సన్నాటా` ఫేమ్ నీరజ్ సింగ్‌లు రాసిన పకడ్బందీ స్క్రిప్ట్ ఆమిర్ ఖాన్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. నిజానికి రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో `3 ఇడియట్స్` సీక్వెల్ చేయాల్సి ఉన్నా ..`లాల్‌కార్` స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధంగా ఉండటంతో ఆమిర్ ఖాన్ ఈ చారిత్రక స్పోర్ట్స్ డ్రామాను పట్టాలెక్కించేందుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.
