Begin typing your search above and press return to search.

ఎవరేమి అనుకున్నా పర్వాలేదు..!

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎల్‌ 2 : ఎంపురాన్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది

By:  Tupaki Desk   |   29 March 2025 12:52 PM IST
Abhimanyu Singhs Controversial Role Sparks Debate
X

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎల్‌ 2 : ఎంపురాన్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. విడుదలైన రెండు రోజుల్లోనే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎల్‌ 2 రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు స్వయంగా మోహన్‌లాల్‌ అధికారికంగా ప్రకటన చేశాడు. లాంగ్‌ రన్‌లో సినిమా అత్యధిక వసూళ్లు సాధించి మలయాళ సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్‌ను సైతం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. లూసీఫర్‌ కి సీక్వెల్‌గా రూపొందిన ఈ ఎల్‌ 2 సినిమాతో మరోసారి మోహన్‌ లాల్‌ సర్‌ప్రైజ్ చేశాడు. అంతే కాకుండా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ మేకింగ్‌తో, టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు అంటూ రివ్యూలు వచ్చాయి.

సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినప్పటికీ అభిమన్యు సింగ్ పోషించిన పాత్ర విషయంలో వివాదం రాజుకుంది. హిందుత్వ ఉగ్రవాదిగా అభిమన్యు సింగ్‌ పాత్రను చూపించడంతో పాటు, గుజరాత్‌ నుంచి వెళ్లి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన తీరును చూపించారు. ఒక విలన్‌ను అలా చూపించడం ద్వారా రాజకీయ దుమారం చెలరేగింది. ఒక జాతీయ పార్టీ నాయకులు ప్రస్తుతం ఆ పాత్రపై, మొత్తం సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కి ఎంతటి హిందుత్వ వ్యతిరేకి అనే విషయం దీంతో నిరూపితం అయిందని వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని ఆ పాత్రను తొలగించాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తే, మొత్తం సినిమాను బ్యాన్‌ చేయాలని కొందరు డిమాండ్‌ చేసిన విషయం తెల్సిందే.

అభిమన్యు సింగ్‌ వివాదంపై 'ఎల్‌ 2 : ఎంపురాన్‌' రచయిత మురళీ గోపీ స్పందించారు. ప్రస్తుత సమయంలో తాను ఈ వివాదం గురించి ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు అంటూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరికి నచ్చిన విధంగా వారు ఈ సినిమా గురించి అనుకుంటే తప్పేం లేదు. సినిమాను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన విధంగా వారు ఊహించుకుంటూ ఉంటారు. కొందరు పాజిటివ్‌గా ఊహించుకుంటే కొందరు నెగటివ్‌గా ఊహించుకుంటారు. అలా ఊహించుకునే వారిని మనం ఏం చేయగలం. వారు ఎలా ఊహించుకున్న వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోనివ్వండి... వారి ఊహల గురించి తాము మాట్లాడాలి అనుకోవడం లేదు. ఈ విషయమై పూర్తి మౌనంగా ఉంటామని ఆయన చెప్పుకొచ్చాడు.

వామపక్ష భావజాలం పేరుతో కొందరు చేస్తున్న హడావిడి పైన ఆయన సున్నిత వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే వామపక్ష భావజాలం అంటూ మాట్లాడుతూ ఉన్నారో వారు ఎప్పుడో తమ ఆలోచన తీరును మార్చుకుని తమ భావజాలం ను పక్కన పెట్టేశారని అన్నాడు. లూసిఫర్ సమయంలోనూ వివాదాలు చుట్టు ముట్టాయి. కానీ ఆ సమయంలో ఈ స్థాయిలో వార్తల్లో నిలవలేదు. రాజకీయంగా ఆ సమయంలో కొందరు విమర్శలు చేసినప్పటికీ సినిమా టాక్‌ ముందు ఆ వివాదాలు నిలవలేదు. కానీ ఈసారి అలా కాదు.. కాస్త సీరియస్‌గానే వివాదం కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో రచయిత మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకోండి అంటూ వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశం అయింది. ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల తరపున ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.