Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఖుషి

By:  Tupaki Desk   |   1 Sep 2023 6:49 AM GMT
మూవీ రివ్యూ : ఖుషి
X

'ఖుషి' మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్ దేవరకొండ-సమంత-మురళీ శర్మ-సచిన్ ఖేద్కర్-శరణ్య పొన్ వన్నన్ -లక్ష్మి-రోహిణి-జయరాం-వెన్నెల కిషోర్-రాహుల్ రామకృష్ణ-శరణ్య ప్రదీప్-శ్రీకాంత్ అయ్యంగార్-శత్రు తదితరులు

సంగీతం: అబ్దుల్ హేషమ్ వహాబ్

ఛాయాగ్రహణం: మురళి.జి

నిర్మాతలు: యలమంచిలి రవిశంకర్-నవీన్ ఎర్నేని

రచన-దర్శకత్వం: శివ నిర్వాణ

విజయ్ దేవరకొండ.. సమంత.. శివ నిర్వాణ.. ఎంతో ఆసక్తి రేకెత్తించిన కాంబినేషన్ ఇది. తమ చివరి చిత్రాలతో నిరాశ పరిచిన ఈ ముగ్గురూ కలిసి చేసిన 'ఖుషి' మంచి పాటలు.. ప్రోమోలతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఖుషి' ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

విప్లవ్ (విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం సంపాదించి తొలి పోస్టింగ్ ఏరి కోరి కశ్మీర్లో తీసుకుంటాడు. కానీ అక్కడికి వెళ్లాక ఎదురైన ఇబ్బందులు చూసి.. తిరిగి తన సొంత సిటీ అయిన హైదరాబాద్ వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ అక్కడ ముస్లిం అమ్మాయిలా వేషం వేసుకుని తిరుగుతున్న ఆరాధ్యతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆరాధ్య ముస్లిం కాదని.. బ్రాహ్మణ అమ్మాయి అని తెలుస్తుంది. ఆరాధ్యకు కూడా విప్లవ్ మీద ప్రేమ ఉన్నప్పటికీ.. వీరి పెళ్లికి సమస్యలు తలెత్తుతాయి. విప్లవ్ తండ్రి రాష్ట్ర నాస్తిక సంఘానికి అధ్యక్షుడైతే.. ఆరాధ్య తండ్రి సృష్టిని నడిపించేది దేవుడే అని నమ్మే వ్యక్తి. ఈ వైరుధ్యాల నేపథ్యంలో విప్లవ్-ఆరాధ్య.. పెద్దల్ని కాదని ప్రేమ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్లిద్దరికీ ఎదురైన అనుభవాలేంటి.. వీరి ప్రయాణం ఎలా ముందుకు సాగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సినిమా జానర్లలో ఎవర్ గ్రీన్ అంటే ప్రేమకథలే. ఇన్నేళ్ల సినిమా చరిత్రలో ఈ జానర్లో వచ్చినన్ని సినిమాలు మరెందులోనూ వచ్చి ఉండవు. ఐతే వీటిలో ప్రతిసారీ కొత్తదనం చూపించాలంటే కష్టం. ప్రేమకథల్లో రచయితలు.. దర్శకులు ఎన్నో కోణాలను చూపించేశారు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం.. వారి ప్రేమకు ఏవో అడ్డంకులు ఎదురు కావడం.. వాటిని అధిగమించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తడం.. తిరిగి ఆ జంట ఒక్కటవ్వడం.. ఈ ఫార్మాట్లో కొన్ని వందల కథలు చూశాం. ఐతే ఈ రకమైన కథల్లో మణిరత్నం 'సఖి' మూవీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. మణిరత్నంకి వీరాభిమాని, ఏకలవ్య శిష్యుడు అయిన శివ నిర్వాణ.. ఆయనకు ట్రిబ్యూట్ ఇస్తున్నట్లుగా 'సఖి'ని ఇప్పటి కాలానికి తగ్గట్లు మార్చి తీశాడు. కథ పాతదే అయినా.. విజయ్ దేవరకొండ-సమంత రూపంలో ఒక మంచి లీడ్ పెయిర్ ను ఎంచుకుని.. హేషమ్ అబ్దుల్ నుంచి అదిరిపోయే పాటలు రాబట్టుకుని.. ఆహ్లాదకరమైన కథనంతో సినిమాను నడిపించేశాడు. ప్రేక్షకులకు ఇందులో 'సర్పైజింగ్'గా అయితే ఏమీ అనిపించదు. అదే సమయంలో సినిమా అయితే పెద్దగా బోర్ కొట్టదు. ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి కోరుకునే అంశాలకు ఇందులో లోటు లేదు.

ఒక లవ్ స్టోరీకి చాలా కీలకమైన అంశాలు.. చక్కటి లీడ్ పెయిర్.. మంచి సంగీతం.. ఆహ్లాదకరమైన విజువల్స్. మిగతా విషయాలు వీక్ గా ఉన్నా సరే.. ఇవి క్లిక్ అయితే ఆ సినిమా పాసైపోతుంది. 'ఖుషి' ఈ కోవకు చెందిన సినిమానే. కథ పరంగా అయితే 'ఖుషి' ఎక్కడా పెద్దగా ఎగ్జైట్ చేయదు. ప్రేమ.. పెళ్లి.. ఎడబాటు.. చివరగా కథ సుఖాంతం.. ఇలా రొటీన్ గా సాగిపోయే సినిమా ఇది. కానీ ఈ కథకు ఎంచుకున్న నేపథ్యం.. కథనాన్ని నడిపించిన తీరు 'ఖుషి'ని భిన్నంగా నిలబెడతాయి. దేవుడిని ప్రగాఢంగా నమ్మే హీరోయిన్ తండ్రి.. పరమ నాస్తికుడైన హీరో తండ్రి.. ఈ కుటుంబాల మధ్య వైరుధ్యాన్ని కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ గా ఎంచుకోవడం బాగుంది. దీని మీద సంఘర్షణను శివ నిర్వాణ బాగా నడిపించాడు. ఈ పాయింట్ ను మినహాయిస్తే సినిమాలో కొత్తగా.. బలంగా అనిపించే విషయాలేమీ లేవు. అమ్మాయిని చూడగానే అబ్బాయి మైమరిచిపోతూ తన వెంట తిరగడం.. ఆమె అతణ్ని పట్టించుకోకపోవడం.. చివరికి అతడి ప్రేమను గుర్తించి తనూ ప్రేమలో పడిపోవడం.. ఇలా ప్రథమార్ధంలో సాగే ప్రేమకథ ఏమంత గొప్పగా అనిపించదు. కాకపోతే సన్నివేశాలు మరీ బోర్ కొట్టకుండా వినోదాత్మకంగా నడిపించడం ప్లస్. వెన్నెల కిషోర్ సాయంతో విజయ్ బాగానే ఎంటర్టైన్ చేయగలిగాడు. కానీ కథలో మాత్రం పెద్దగా కదలిక కనిపించదు.

హీరో హీరోయిన్ల తండ్రుల ఆలోచనల్లో వైరుధ్యం వల్ల సమస్య తలెత్తి విరామ సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి బాగానే అనిపించినా.. పెళ్లి తర్వాత భార్యా భర్తల మధ్య తలెత్తే అపార్థాల నేపథ్యంలో నడిచే తర్వాతి వ్యవహారం మళ్లీ రొటీన్ అనిపిస్తుంది. కానీ సన్నివేశాలను సాధ్యమైనంత మేర ఎంటర్టైనింగ్ గా ఉండేలా చూసుకోగలిగాడు శివ నిర్వాణ. చివరి అరగంటలో సినిమాను పూర్తిగా ఎమోషన్ల మీద నడిపించాడు. 'ఖుషి'కి పెద్ద ప్లస్ ఆ అరగంటే. రోహిణి-జయరాం జంట చుట్టూ తిరిగే కేరళ ట్రాక్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇక్కడ్నుంచి చివరి వరకు ఎమోషన్ క్యారీ అవుతుంది. భార్యకు దూరమైన భర్త పడే బాధ.. అతడిలో వచ్చే మార్పు.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు.. డైలాగులు బాగా కుదిరాయి. పతాక సన్నివేశాలతో మరింత మార్కులు కొట్టేసిన శివ.. అంతకుముందు దొర్లిన తప్పులను మన్నించేలా చేయగలిగాడు. ప్రథమార్ధంలో కథ పరంగా ఏదైనా కొత్తదనం చూపించి ఉంటే.. సినిమాను వేగంగా నడిపించి ఉంటే.. 'ఖుషి' స్పెషల్ ఫిల్మ్ అయ్యుండేది. ఆ ప్రతికూలతల వల్ల 'ఓకే' అనే ఫీలింగ్ దగ్గర ఆగిపోయింది.

నటీనటులు:

తన సినిమాలు ఫెయిలైనా విజయ్ పెర్ఫామెన్స్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. మంచి పాత్ర పడితే.. కథ కుదిరితే విజయ్ ఎలా సినిమాను తన భుజాల మీద నడిపిస్తాడో 'ఖుషి'లో చూడొచ్చు. విప్లవ్ పాత్రతో.. విజయ్ నటనతో యూత్ బాగా కనెక్ట్ అవుతారు. తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయడమే కాక.. ఎమోషనల్ సీన్లలో కూడా విజయ్ చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. పతాక సన్నివేశాల్లో అతడి నటన చాలా బాగా సాగింది. సమంత లుక్స్ పరంగా విజయ్ కు దీటుగా నిలవలేకపోయింది కానీ.. తన నటన ఓకే. సామ్ లో మునుపటి చార్మ్ అయితే కనిపించలేదు. కథలో కీలకమైన సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సచిన్ ఖేద్కర్.. మురళీ శర్మ తమ అనుభవాన్ని చూపించారు. వాళ్ల పాత్రలు కథకు బలమయ్యాయి. వెన్నెల కిషోర్ ప్రథమార్ధ:లో.. రాహుల్ రామకృష్ణ ద్వితీయార్ధంలో నవ్వులు పంచే బాధ్యత తీసుకున్నారు. శరణ్య ప్రదీప్.. శరణ్య పొన్ వన్నన్.. శత్రు.. రోహిణి.. జయరాం.. వీళ్లంతా తమ పాత్రలో పరిధిలో బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

హేషమ్ అబ్దుల్ సంగీతం సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. ఆడియో పెద్ద హిట్ కావడంతో పాటల కోసం ప్రేక్షకులు సినిమాలో ఎదురు చూస్తారు. పాట వచ్చినపుడల్లా ఉత్సాహం రెట్టింపవుతుంది. సినిమాలో డల్ మూమెంట్స్ తర్వాత పాటలే హుషారు తీసుకొస్తాయి. కాకపోతే పాటల ప్లేస్మెంట్ సరిగా కుదరలేదు. హేషమ్ నేపథ్య సంగీతం కూడా బాగా సాగింది. మురళి.జి ఛాయాగ్రహణం కూడా ఆహ్లాదకరంగా సాగింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు మైత్రీ మూవీ మేకర్స్ స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శివ నిర్వాణ 'టక్ జగదీష్' తర్వాత తన దారిలోకి వచ్చేశాడు. నిన్ను కోరి.. మజిలీ అంత బలమైన.. వైవిధ్యం ఉన్న కథ కాకపోయినా.. దాన్ని బోర్ కొట్టని కథనంతో ముందుకు నడిపించాడు. నటీనటులు.. సాంకేతిక నిపుణుల నుంచి అతను మంచి ఔట్ పుట్ రాబట్టుకున్నాడు. శివ టేకింగ్ ప్లెజెంట్ గా అనిపిస్తుంది. తన డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి.

చివరగా: ఖుషి.. చల్తా చల్తా

రేటింగ్- 2.75/5