'బడ్జెట్ తగ్గించుకోవాలని తెలియదా?'.. డైరెక్టర్ కన్నీళ్లపై డిస్ట్రిబ్యూటర్ ఫైర్
అయితే తాజాగా ఆ విషయంపై ప్రముఖ కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
By: M Prashanth | 11 Jun 2026 4:52 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమా విడుదల ముందు ఎదురైన ఇబ్బందులు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. కొన్ని ఏరియాల్లో మార్నింగ్ షోలు రద్దవడం, ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్ కు బ్రేకులు పడడం హాట్ టాపిక్ గా మారాయి. ఆ సమయంలో దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ తాను చాలా బాధపడుతున్నానని, కారులో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.
అయితే తాజాగా ఆ విషయంపై ప్రముఖ కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ ఏడవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట ఆ సినిమాను సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో ప్రారంభించారని, తర్వాత అది రూ.40 కోట్ల వరకు పెరిగినా అర్థం చేసుకోవచ్చని సుబ్రహ్మణ్యం అన్నారు.
కానీ చివరకు సినిమా బడ్జెట్ దాదాపు రూ.80 కోట్లకు చేరుకుందని ఆరోపించారు. ఒక నిర్మాతపై ఇంత భారీ ఆర్థిక భారం పడే పరిస్థితి ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేశారు.. "సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురైతే దర్శకుడు కారులో కూర్చుని ఏడుస్తూ వీడియోలు పెడతారు. కానీ సినిమా తీస్తున్న సమయంలో బడ్జెట్ అదుపులో ఉండేలా చూసే బాధ్యత దర్శకుడికి లేదా? అప్పుడే నిర్మాతకు అండగా నిలిస్తే ఆ పరిస్థితి వచ్చేదా?" అంటూ ప్రశ్నించారు సుబ్రహ్మణ్యం .
అదే సమయంలో నిర్మాతలు ఎదుర్కొనే కష్టాలను కూడా ఆయన ప్రస్తావించారు. విడుదలకు ముందు రెండు మూడు నెలల పాటు ప్రొడ్యూసర్లు డబ్బులు సెట్ చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటారని, ఆ సమయంలో దర్శకులు ఎక్కువగా కనిపించరంటూ మాట్లాడారు. కానీ సినిమా విజయం సాధించిన తర్వాత మాత్రం క్రెడిట్ తీసుకునేందుకు ఎప్పుడూ ముందుంటారని అన్నారు.
అయితే ఆ వ్యవహరంలో హీరో సూర్య రోల్ పై మాత్రం సుబ్రమణ్యం ప్రశంసలు కురిపించారు. తనకు రావాల్సిన మొత్తంలో కేవలం 50 శాతం మాత్రమే ముందుగా తీసుకుని, మిగిలిన పేమెంట్ విషయంలో సూర్య పర్సనల్ గా హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆ సినిమా విడుదల కావడానికి నిజంగా సహాయం చేసింది సూర్య మాత్రమేనని, మిగతావారు కాదని పేర్కొన్నారు.
అంతేకాకుండా, సినిమా హిట్ అయిన తర్వాత అందరూ సక్సెస్ జోష్ లో కనిపిస్తారని, అదే సినిమా అనుకున్న రేంజ్ లో రిజల్ట్ సాధించకపోతే మిగిలిన బాకీలు చెల్లించేందుకు దర్శకులు ముందుకు వస్తారా అని ప్రశ్నించారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆర్జే బాలాజీ విడుదల రోజు చేసిన ఎమోషనల్ కామెంట్స్ ను ఇప్పుడు పలువురు నెటిజన్లు తిరిగి ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఒకవైపు డైరెక్టర్ ఆవేదన నిజమేనని కొందరు భావిస్తుండగా.. మరోవైపు నిర్మాతల ఆర్థిక బాధ్యతల విషయంలో దర్శకుల పాత్రపై సుబ్రహ్మణ్యం లేవనెత్తిన ప్రశ్నలు కూడా ఆలోచింపజేస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సుబ్రహ్మణ్యం కామెంట్స్ కరుప్పు మూవీ విజయం వెనుక ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు, నిర్మాతల కష్టాలు, దర్శకుల బాధ్యతలపై మరోసారి పెద్ద చర్చకు దారితీశాయి.
