నా పరిస్థితి దారుణంగా ఉంది
ప్రముఖ స్టాండప్ కమెడియన్ కుణాల్ కొన్ని వారాల క్రితం ముంబైలో ఒక షో లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై పేరడీ పాటను పాడాడు.
By: Tupaki Desk | 17 July 2025 7:00 AM ISTప్రముఖ స్టాండప్ కమెడియన్ కుణాల్ కొన్ని వారాల క్రితం ముంబైలో ఒక షో లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై పేరడీ పాటను పాడాడు. ఆ పాట ఏకంగా ప్రభుత్వంను విమర్శించే విధంగా ఉందని, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని కించ పరిచే విధంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంను, ఉప ముఖ్యమంత్రిని విమర్శించే విధంగా, అవమానించే విధంగా ఉందంటూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం కుణాల్ కోర్ట్ కేసులను ఎదుర్కొంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇటీవలే ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది.
ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. కోర్ట్‌లో కేసుకు సంబంధించిన వాదోపవాదాలు నడుస్తున్న సమయంలోనే కుణాల్ ఈ విషయమై ఎక్స్ ద్వారా స్పందించడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి కేసుల వల్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చాడు. కేసుల వల్ల రెగ్యులర్‌గా తాను కోర్ట్‌కు హాజరు కావాల్సి వస్తుంది. తద్వారా తాను షో లకు హాజరు కాలేక పోతున్నాను. అంతే కాకుండా తన సమయం అంతా కూడా వృధా అవుతుందని కూడా కుణాల్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 37 ఏళ్ల వయసున్న తనకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ కోర్ట్‌ల చుట్టూ తిరుగుతూ ఉంటే విడాకుల కోసం తీరుగుతున్నంత మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
కోర్ట్ కేసును ఎదుర్కోవడం అనేది పెళ్లి చేసుకోకుండానే విడాకులు తీసుకున్నంత క్షోభను కలిగిస్తుందని, ముందు ముందు అయినా తాను ఈ కేసు నుంచి బయట పడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ముంబై పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ముందస్తు బెయిల్ తీసుకోవడంతో అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడట. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడ కూడని రీతిలో మాట్లాడటంతో పాటు, ఆయన గురించి అవమానకంగా పాటను ఆలపించడం కూడా చాలా పెద్ద తప్పు అంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కుణాల్ కి ఖచ్చితంగా పెద్ద శిక్షను కోర్ట్ విదిస్తుందనే విశ్వాసంను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
బుల్లి తెరపైనే కాకుండా సోషల్ మీడియా ద్వారా చాలా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న కుణాల్ వివాదాస్పద షో కారణంగా న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాడు. కుణాల్ ఇప్పటికీ తాను ఏ తప్పు చేయలేదు అన్నట్లుగా వాదిస్తున్నాడు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ సైతం తనకు ఏ పాపం తెలియదు, తాను అమాయకుడిని అని చెప్పుకునే విధంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. కుణాల్ చేసింది తప్పా.. ఒప్పా అనే విషయాన్ని కోర్ట్ నిర్ణయిస్తుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి వర్సెస్ కమెడియన్ కుణాల్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.
