Begin typing your search above and press return to search.

గూఢ‌చారులను కాపాడ‌టంలో బాస్.. భార‌త ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం!

`దురంధ‌ర్` సినిమా రిలీజ‌య్యాక శ‌త్రుదేశంలో భార‌త గూఢ‌చారుల క‌థ‌ల గురించి ప్ర‌జ‌లు ఆరాలు తీయ‌డం ప్రారంభించారు.

By:  Sivaji Kontham   |   10 Feb 2026 9:21 AM IST
గూఢ‌చారులను కాపాడ‌టంలో బాస్.. భార‌త ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం!
X

`దురంధ‌ర్` సినిమా రిలీజ‌య్యాక శ‌త్రుదేశంలో భార‌త గూఢ‌చారుల క‌థ‌ల గురించి ప్ర‌జ‌లు ఆరాలు తీయ‌డం ప్రారంభించారు. అలా ఆరా తీసిన‌ప్పుడు చాలా మందిని 70ల‌లో స్పై రోష‌న్ లాల్ జ‌ల్లా క‌థ ఆక‌ర్షించింది. అయితే అతడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసి జైలులో వేసిన‌ప్పుడు భార‌త ప్ర‌భుత్వం అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని, అత‌డు జైలు నుంచి వ‌చ్చాక కూడా ఆద‌రించ‌క‌పోవ‌డంతో చివ‌రికి అనామ‌కంగా మ‌ర‌ణించాడ‌ని చాలా మీడియాల్లో క‌థ‌నాలు వండి వార్చారు.

ఈ క‌థ‌నాలు చ‌దివాక భార‌త ప్ర‌భుత్వం గూఢ‌చారుల‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించదా? మ‌న గూఢ‌చారి శ‌త్రువుల‌కు చిక్కిన‌ప్పుడు అత‌డిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించ‌దా? 70ల‌లో భార‌త స్పై రోష‌న్ లాల్ జ‌ల్లా పాకిస్తాన్ లో ప‌ని చేసిన‌ప్పుడు దొరికిపోతే ఎందుకు కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. భార‌త రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌లేదా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు మొద‌ల‌య్యాయి.

అప్ప‌టితో పోలిస్తే, ఇప్ప‌టి గూఢ‌చారి వ్య‌వ‌స్థ ఎలా ఉంది? శ‌త్రువుల స‌మాచారం అందించే మ‌న గూఢ‌చారుల‌కు భార‌త ప్ర‌భుత్వం ఎలాంటి సౌక‌ర్యాల‌ను క‌లుగ‌జేస్తోంది? అంటూ ఆరాలు కూడా మొద‌ల‌య్యాయి. నిజానికి రోష‌న్ లాల్ జ‌ల్లాకు భార‌త ప్ర‌భుత్వం అన్యాయం చేసిందా లేదా? అనేది అటుంచితే, ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా భార‌త ప్ర‌భుత్వం గూఢ‌చారుల‌కు సౌక‌ర్యాల‌ను పెంచింది. వారిని అన్నివిధాలా ర‌క్షించుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం ప‌క‌డ్భందీగా త‌యారు చేసుకుంది. ఇప్పుడు గూఢ‌చార వ్య‌వ‌స్థ అత్యంత ప‌టిష్ఠంగా ఉంది. అలాగే సైన్యానికి, అత్యంత కీల‌క‌మైన `రా` వింగ్ కి అవ‌స‌ర‌మైన స‌దుపాయ‌ల‌ను క‌ల్పించ‌డంలో, విదేశాల‌కు యాక్సెస్ ను కల్పించ‌డంలో అన్ లిమిటెడ్ ఫండ్ తో భార‌త ప్ర‌భుత్వం హైలో ఉందిప్పుడు.

ముఖ్యంగా రోష‌న్ లాల్ జ‌ల్లా త‌ర్వాత అత్యంత చ‌ర్చ‌నీయాంశ‌మైన గూఢ‌చారి కుల‌భూషణ్ జాదవ్. అత‌డి కేసు భారత గూఢచారి వ్యవస్థ చరిత్రలో అంతర్జాతీయ దౌత్య నీతిలో ఒక కీలక మలుపు. రోషన్ లాల్ జల్లా లేదా రవీంద్ర కౌశిక్ వంటి గత తరం గూఢచారుల విషయంలో భారత్ మౌనంగా ఉంటే, జాదవ్ విషయంలో మాత్రం ప్రభుత్వం అత్యంత దూకుడుగా వ్యవహరించింది.

కులభూషణ్ జాదవ్ భారత నావికాదళంలో మాజీ అధికారి. 2016 మార్చి 3న బలూచిస్థాన్‌లో గూఢచర్యం చేయ‌డ‌మే గాక విధ్వంశ‌క‌ర చర్యలకు పాల్పడుతుండగా జాదవ్‌ను అరెస్ట్ చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. జాదవ్ నావికాదళం నుండి పదవీ విరమణ చేశారని, ఆయనకు గూఢచర్యంతో సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది. ఇరాన్‌లోని చాబహార్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను పాక్ బలగాలు అపహరించి, సరిహద్దు దాటించి బలూచిస్థాన్‌లో అరెస్ట్ చేసినట్లు నాటకం ఆడాయని భారత్ వాదించింది.

2017లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ భారత్ వెంటనే నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఐసిజేను ఆశ్రయించింది. పాకిస్థాన్ `వియన్నా ఒప్పందాన్ని` ఉల్లంఘించిందని భారత్ వాదించింది. ఒక విదేశీయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. కానీ పాక్ అది చేయలేదు. ఆ త‌ర్వాత‌ 2019లో ICJ సంచలన తీర్పు ఇచ్చింది. జాదవ్ మరణశిక్షపై `స్టే` విధించింది. ఆయనకు తక్షణమే కాన్సులర్ యాక్సెస్` (భారత అధికారులను కలిసే అవకాశం) కల్పించాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. పాక్ మిలిటరీ కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని సూచించింది.

రోషన్ లాల్ జల్లా వంటి వారి విషయంలో ప్రభుత్వం ఎందుకు పోరాడలేదు, జాదవ్ విషయంలో ఎందుకు పోరాడింది అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్ప‌ట్లో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాల ప్ర‌భావం అంత‌గా లేదు. అందువ‌ల్ల గూఢ‌చారుల‌ను కాపాడుకునే ప‌రిస్థితులు లేవు. అప్ప‌ట్లో ఎవ‌రైనా దొరికిపోతే అత‌డు మావాడు కాదు అని స‌రిపెట్టుకోవ‌డం త‌ప్ప చేసేదేమీ లేదు. కానీ ఇప్పుడు అలా కాదు.. సీజేఐలో న్యాయ‌పోరాటం చేసేందుకు అవ‌కాశం ఉంది.

ప్రస్తుతం కులభూషణ్ జాదవ్ పాకిస్థాన్ జైలులోనే ఉన్నారు. అయితే భారత ప్రభుత్వం చేసిన దౌత్యపరమైన , న్యాయపరమైన పోరాటం వల్ల ఆయనకు మరణశిక్ష అమలు కాకుండా ఆగింది. తన కుటుంబ సభ్యులతో (తల్లి, భార్య) మాట్లాడే అవకాశం కూడా దక్కింది. ఈ కేసు ద్వారా భారత ప్రభుత్వం ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. దేశం కోసం పనిచేసే లేదా విదేశాల్లో చిక్కుకున్న భారత పౌరుడిని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుంది! అనే సంకేతం ఇచ్చింది.