Begin typing your search above and press return to search.

'కుబేర'.. క్లాస్ లుక్ లో కింగ్ నాగ్ మాస్ వైబ్స్!

ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ ఫస్ట్ లుక్ అండ్ క్యారక్టర్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   2 May 2024 3:54 PM GMT
కుబేర.. క్లాస్ లుక్ లో కింగ్ నాగ్ మాస్ వైబ్స్!
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్‌, కింగ్‌ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''కుబేర''. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ లో రష్మిక మందన్న హిరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ ఫస్ట్ లుక్ అండ్ క్యారక్టర్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

'కుబేర' సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ పోస్టర్ లో నాగార్జున టక్ చేసుకుని, కళ్లజోడు పెట్టుకొని ఫార్మల్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. వర్షంలో గొడుగు పట్టుకొని నిలబడి, క్లాస్ లుక్ లోనూ మాస్ వైబ్స్ క్రియేట్ చేసారు. ఆయన బ్యాక్ సైడ్ డబ్బుల కట్టలతో నిండి ఉన్న ఒక పెద్ద కంటైనర్ ను మనం గమనించవచ్చు. రూ. 500 నోటు వర్షంలో తడిచిపోవడం చూసి తన పర్స్ లో నుంచి మరో నోటు తీసి ట్రక్ లో పెట్టడం చూస్తుంటే.. నాగ్ ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ అని తెలుస్తోంది.

నాగార్జున పాత్రకు సంబంధించిన ఇతర వివరాలు గ్లింప్స్ లో వెల్లడించనప్పటికీ, ఆయనొక సీబీఐ ఆఫీసర్ గా లేదా ఈడీ అధికారిగా నటిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే నాగ్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా కనిపిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బీజీఎం అద్భుతంగా ఉంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఆల్రెడీ రిలీజ్ చేసిన 'కుబేర' ఫస్ట్ లుక్ లో ధనుష్ ను చిరిగిన దుస్తుల్లో ఒక బిచ్చగాడిగా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు నాగార్జునను దానికి పూర్తి భిన్నంగా, క్లాస్ లుక్ లో ప్రజెంట్ చేసి ఆసక్తిని రెట్టింపు చేశారు. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, ఈసారి తన కంపర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఈ పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది.

'కుబేర' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏడాది చివరిలో విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.