'కుబేర' మూవీ రివ్యూ
ధనుష్.. నాగార్జున.. శేఖర్ కమ్ముల.. ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది. వీరి కలయికలో మొదలైన 'కుబేర' ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది.
By: Tupaki Desk | 20 Jun 2025 1:39 PM IST'కుబేర' మూవీ రివ్యూ
నటీనటులు: ధనుష్- అక్కినేని నాగార్జున- రష్మిక మందన్నా- జిమ్ సర్భ్- దలిప్ తాహిల్- సునైనా- హరీష్ పేరడి- షాయాజి షిండే-భాగ్యరాజ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
రచనా సహకారం: చైతన్య పింగళి
నిర్మాతలు: సునీల్ నారంగ్- పుస్కుర్ రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల
ధనుష్.. నాగార్జున.. శేఖర్ కమ్ముల.. ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది. వీరి కలయికలో మొదలైన 'కుబేర' ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. టీజర్.. ట్రైలర్ తో అంచనాలను మరింత పెంచిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను 'కుబేర' ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ: దేవా (ధనుష్) ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను.. బిచ్చగాడిగా మారతాడు. తిరుపతిలో అడుక్కుంటూ జీవిస్తున్న అతణ్ని నీరజ్ చోప్రా (జిమ్ సర్భ్) అనే పెద్ద వ్యాపారవేత్తకు చెందిన మనుషులు తీసుకెళ్తారు. దేవాతో పాటు ఇంకో ముగ్గురు బిచ్చగాళ్లను ఒక పెద్ద కుంభకోణానికి పావులుగా వాడుకోవాలని అనుకుంటాడు నీరజ్. తన చేతికి మట్టి అంటకుండా ఈ పనిని పూర్తి చేసే బాధ్యతను మాజీ సీబీఐ అధికారి అయిన దీపక్ (నాగార్జున)కు అప్పగిస్తాడు నీరజ్. వాళ్లు అనుకుంటున్న పని సాఫీగా సాగిపోతున్న సమయంలో.. చిన్న ఇబ్బంది తలెత్తి దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. దీంతో మొత్తం గందరగోళం నెలకొంటుంది. ఇంతకీ బిచ్చగాళ్లతో నీరజ్ మనుషులు చేయించాలనుకున్న పనేంటి.. సీబీఐ అధికారిగా పని చేసిన దీపక్ ఇలాంటి పనిలో ఎందుకు భాగం అయ్యాడు.. ఇంతకీ దేవా వీళ్లకు దొరికాడా లేదా? వాళ్ల మిషన్ ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: ఒక దర్శకుడి నుంచి కొన్ని సినిమాలు వచ్చాక.. అతడి శైలి మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. తన నుంచి ఓ కొత్త చిత్రం రాబోతోందంటే అదెలా ఉండొచ్చు అని ముందే ఒక అంచనాకు వచ్చేస్తాం. అలా శేఖర్ కమ్ముల మీద ఉన్న అభిప్రాయంతో.. అంచనాతో 'కుబేర' ప్రోమోలు చూసిన వాళ్లంతా కచ్చితంగా ఆశ్చర్యపోయే ఉంటారు. ఆ ప్రోమోలు చూస్తే అతను ఈసారి ఏం తీశాడన్నది సరిగా అర్థం కాకపోయినా.. తనకు అలవాటైన సినిమా మాత్రం ఇది కాదని స్పష్టమైంది. ఓవైపు ఇది శేఖర్ కమ్ముల మార్కు సినిమా కాదనే అంచనాతో.. ఇంకోవైపు ట్రైలర్ చూసి కథేంటో అర్థం కాని అయోమయంతో.. ప్రి నోషన్స్ అంటూ ఏమీ లేకుండా 'కుబేర' థియేటర్లోకి అడుగు పెట్టే ప్రేక్షకులను ఇది సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. మొదలైన తొలి సన్నివేశం నుంచి తెరపై జరిగే ప్రతి విషయం ఆసక్తికరంగా అనిపిస్తూ.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తూ.. ఏం జరగబోయేది అంచనా వేయలేని విధంగా సాగుతూ.. మూడు గంటల పాటు ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి కూర్చోబెట్టి ఉర్రూతలూగిస్తుంది 'కుబేర'. ''మీరు ఎప్పుడూ చూడనిది చూస్తే ఎలా షాకవుతారో.. ఈ సినిమా చూసినపుడూ అలాగే ఆశ్చర్యపోతారు. వావ్ ఇదేం చిత్రంరా అనిపించేలా ఉంటుంది'' అంటూ కమ్ముల రిలీజ్ ముంగిట విలేకరులతో అన్నాడు. ఇలా తమ సినిమాల గురించి రిలీజ్ ముందు అందరూ గొప్పలు పోయేవాళ్లేలే కానీ.. 'కుబేర' చూశాక మాత్రం శేఖర్ మాటలు అక్షర సత్యం అనిపిస్తాయి. నిజంగా ఇది ఎప్పుడూ మనం చూడని సినిమా. చూశాక వావ్ అనుకునే చిత్రం.
ప్రపంచంలోనే అతి పెద్ద ధనవుతుండు కావాలని ఆశపడి- అందుకోసం ప్రజలకు సొంతమైన ప్రకృతి వనరును చెడబట్టాలని చూసే ఒక వ్యాపారవేత్త.. చిన్నప్పుడే అందరినీ కోల్పోయి అనాథగా మారి-కడుపు నింపుకోవడం కోసం బిచ్చమెత్తుకునే పేదవాడు.. ఈ ఇద్దరికీ మధ్య జరిగే పోరే 'కుబేర'. ఈ ఐడియా క్రేజీగా వినడానికి క్రేజీగా అనిపించొచ్చు. కానీ ఈ పాయింట్ మీద ఒక కథ రాసి.. మూడు గంటల పాటు బిగి సడలకుండా నరేట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. శేఖర్ కమ్ముల ఈ పనిని గొప్ప నైపుణ్యంతో చేశాడు. హీరో అంటే ఇలాంటి లక్షణాలుండాలి.. విలన్ పాత్ర ఇలా ప్రవర్తించాలి.. సహాయ పాత్రల పరిధి ఇంతమేరకు ఉండాలి.. ఇంట్రో ఇలా.. ఇంటర్వెల్ బ్యాంగ్ అలా.. అంటూ ఏ రూల్స్ పెట్టుకోకుండా.. కేవలం ఒక కథను పకడ్బందీగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నించాడు శేఖర్. హీరో అయినా.. విలన్ అయినా.. ఓ ప్రత్యేక పాత్ర అయినా.. అందులో ఇమిడిపోయాయి తప్ప ఏదీ కథను దాటి ప్రవర్తించదు. ఏ పాత్రా కృత్రిమంగా అనిపించదు. అదే సమయంలో మొనాటనీ తెప్పించదు. ఎమోషన్ పండినా.. ఎలివేషన్ కుదిరినా.. ఆలోచింపజేసే ఒక డైలాగ్ పడినా.. అవి కథ పరిధిలోనే ఉంటాయి. ఒక భారీ కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోవడం తర్వాత.. ఆ తర్వాత జరిగే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆరంభ సన్నివేశాలతో కథ మీద ఒక ఐడియా వచ్చినా.. తర్వాతి పరిణామాలు ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయి. మూడు గంటల పాటు ప్రేక్షకులను గెస్సింగ్ లో ఉంచుతూ.. కథనం నడుస్తుంది. ఏ దశలోనూ కథ ఆగకుండా పరుగులు పెట్టడంతో ప్రేక్షకులు ఏ దశలోనూ డీవియేట్ అవ్వరు.
'క్లాస్ వార్' అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ నేపథ్యంలో సినిమా అంటే ప్రీచీగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఎక్కడా క్లాసులు పీకకుండా.. మొనాటనస్ సన్నివేశాలు లేకుండా.. థ్రిల్లర్ స్టయిల్లో ఈ సబ్జెక్టుని డీల్ చేశాడు. రేసీ స్క్రీన్ ప్లే వల్ల సినిమా థ్రిల్లింగ్ గా సాగుతుంది. అదే సమయంలో హృద్యమైన సన్నివేశాలు.. బలమైన డైలాగులతో ఇవ్వాల్సిన సందేశాన్ని కూడా ఇస్తుంది. ''నాది నాది..'' అంటూ మొదట్లో విలన్ పాత్రను సూచిస్తూ సాగే పాట.. చివర్లో ''మాది మాది..'' అంటూ హీరో దృక్కోణంలో ముగియడం.. 'కుబేర' ఎసెన్సుని తెలియజేస్తుంది. సినిమాతో ఒక విషయాన్ని ఎంత బలంగా చెప్పొచ్చడానికి ఇది ఉదాహరణ. రచయితగా-దర్శకుడిగా శేఖర్ కమ్ములది ఎంత గొప్ప స్థాయి అన్నది ఇక్కడే అర్థమవుతుంది. ఎవరైనా ఈ కథ వింటే ఈ రోజుల్లో ఇంత సీరియస్ సబ్జెక్టా.. దీన్ని ఎవరు చూస్తారు అనుకుంటారు. కానీ అంత సీరియస్ సబ్జెక్టుని రేసీ స్క్రీన్ ప్లేతో జనరంజకంగా మార్చాడు శేఖర్. అదే సమయంలో చెప్పాలనుకున్న మంచి విషయాలనూ బలంగా చెప్పాడు. బిచ్చగాడి పాత్రను హీరోగా చూపించి 'బిచ్చగాడు' సినిమా కల్ట్ స్టేటస్ సాధిస్తే.. అదే పాత్రను ఇంకో కోణంలో మరింత ప్రభావవంతంగా తెరపై చూపించి 'కుబేర' మార్కులు కొట్టేస్తుంది. కొన్ని సీన్లలో లాజిక్కులు మిస్సవడం.. అక్కడక్కడా సన్నివేశాలు కన్వీనియెంట్ గా సాగడం.. లక్షల కోట్ల అధిపతికి చెందిన మనుషులు ఒక మామూలు బిచ్చగాడిని పట్టుకోలేక అవస్థలు పడడం.. తన వల్ల ఆ స్థాయి వ్యక్తి చిక్కుల్లో పడడం.. లాంటి అంశాలు 'కుబేర'లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ కావాల్సినంత 'హై' ఇచ్చే 'కుబేర'లో అవన్నీ చిన్న విషయాల్లా అనిపిస్తాయి. ఇది కచ్చితంగా ఇంతకుముందెప్పుడూ చూడని కొత్త కథ. ఏం చూడబోతున్నామో తెలియకుండా థియేటర్లలో అడుగు పెట్టి.. ఇక్కడ చూసింది చాన్నాళ్లు గుర్తు పెట్టుకుంటాం.
నటీనటులు: శేఖర్ కమ్ముల సినిమాల్లో ఎవరూ నటిస్తున్నట్లు అనిపించదు. బిహేవ్ చేస్తున్నట్లే ఉంటుంది. 'కుబేర'లో కూడా అదే చూస్తాం. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే ధనుష్.. బిచ్చగాడి పాత్రలో ఎంత గొప్పగా ఒదిగిపోయాడో మాటల్లో చెప్పలేం. స్టార్ ఇమేజ్ ఉన్న మరే హీరో అయినా ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా అంటే సందేహమే. ఈ పాత్రలో ధనుష్ ను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేనట్లుగా.. రవ్వంత కూడా ఇమేజ్ ఛాయలు పడకుండా.. బిచ్చగాడి పాత్రను అద్భుతంగా చేశాడతను. కొన్ని నిమిషాల్లోనే అక్కడున్నది ధనుష్ అని మరిచిపోయి దేవా అనే బిచ్చగాడి పాత్రను మాత్రమే చూసేలా అతను ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు ధనుష్. పాత్రకు సంబంధించి చిన్న చిన్న విషయాలను కూడా తన బాడీ లాంగ్వేజ్.. నటనతో తెరపై చూపించిన విధానానికి ఆశ్చర్యపోవాల్సిందే. తన నట కిరీటంలో ఇది మరో కలికుతురాయి అవుతుందనడంలో సందేహం లేదు. కొంచెం తమిళ వాసనలు ఉన్నప్పటికీ.. ఎంతో శ్రద్ధగా డబ్బింగ్ కూడా చెప్పాడతను. దీపక్ పాత్రలో నాగార్జునను చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆయన కూడా ఇమేజ్ చొక్కాను పక్కన పడేసి నటించాడు. పాత్రకు తగ్గట్లుగా సటిల్ గా నటించి మెప్పించాడు నాగ్. ఆయన కెరీర్లో ఇది చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్ర అవుతుంది. సమీర పాత్రలో రష్మిక కూడా రాణించింది. స్క్రీన్ టైం తక్కువే కానీ.. తన పాత్రా సినిమాలో చాలా కీలకమే. ఒక మామూలు మధ్య తరగతి అమ్మాయిగా ఆమె తన పాత్రలో ఇమిడిపోయింది. ఇక విలన్ పాత్ర కొంచెం రొటీన్ అనిపించినా.. జిమ్ సర్భ్ దానికి వైవిధ్యం తీసుకొచ్చాడు. కనిపించినపుడల్లా ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టాడు. సునైనా.. షాయాజి షిండే.. దలిప్ తాహిల్.. భాగ్యరాజ్.. హరీష్ పేరడి.. వీళ్లందరివీ చిన్న చిన్న పాత్రలే అయినా బాగా చేశారు.
సాంకేతిక వర్గం: దేవిశ్రీ ప్రసాద్ అనగానే తన సంగీతం ఇలా ఉంటుందని ఒక ముద్ర పడిపోయింది. కానీ తన ఫిల్మోగ్రఫీలో 'కుబేర' వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుంది. కథను అనుసరించి తన శైలిని పక్కన పెట్టి అతను డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. సన్నివేశాల తాలూకు ఇంటెన్సిటీ ఇంకా పెంచి.. ప్రేక్షకులను సినిమా అంతా ఒక మూడ్ లో ఉండేలా చేయడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. ఇక పాటల్లో 'నాది నాది' స్టాండౌట్ గా నిలుస్తుంది. సినిమాలో సిగరెట్ సాంగ్స్ ఏమీ లేవు. అన్నీ కథలో మిళితం అయినవే. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం సినిమాలో మరో హైలైట్. విజువల్స్ పరంగా కూడా సినిమా భిన్నంగా కనిపించేలా అతను జాగ్రత్త పడ్డాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు. రైటర్ కమ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తనకు అలవాటైన దారి నుంచి పక్కకు వచ్చి ఒక గొప్ప కథను నరేట్ చేశాడు. చైతన్య పింగళి సహకారంతో గొప్ప కథను రాసి.. అంతే గొప్పగా తెరపైకి తీసుకొచ్చాడు. శేఖర్ నుంచి ఇలాంటి హార్డ్ హిట్టింగ్ డ్రామాను ఊహించలేం. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి అతను అందించిన సర్ప్రైజ్ ఇది. రైటింగ్.. టేకింగ్.. అన్నింట్లోనూ ఒక ఇంటెన్సిటీ చూపించాడు శేఖర్. తన కెరీర్లో ఎంతో వైవిధ్యమైన.. అలాగే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా 'కుబేర' నిలుస్తుంది.
చివరగా: కుబేర.. కమ్ముల చెప్పిన గొప్ప కథ
రేటింగ్-3.25/5
