కుబేర మూవీ పైరసీ.. అక్కడ జరిగిందట..
అయితే ఆ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులు.. ఏడాదిన్నరలో 40 సినిమాలను పైరసీ చేసిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 July 2025 7:11 PM ISTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన కుబేరా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ధనవంతుడికి, బిచ్చగాడికి మధ్య జరిగిన సంఘర్షణనే సినిమాగా తీయగా.. అందరినీ ఆకట్టుకుంది.
అయితే సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లో పైరసీ కాపీ ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. దీంతో మూవీ టీమ్ అంతా ఒక్కసారిగా షాకైంది. ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలోని యాంటీ వీడియో పైరసీ సెల్.. పైరసీ మూలాలను గుర్తించేందుకు వాటర్ మార్కింగ్ టెక్నాలజీలను వినియోగిస్తూ పని చేసింది.
హైదరాబాద్ లోని సెంట్రల్ మాల్ లో ఉన్న పీవీఆర్ థియేటర్, స్క్రీన్-5లో కుబేరను చట్టవిరుద్ధంగా వీడియో రికార్డు చేసినట్టు గుర్తించింది. రీసెంట్ గా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్ లైన్ పైరసీని అరికట్టాలని పోలీసులను కోరింది. వాటర్ మార్కింగ్ టెక్నాలజీలతో పైరసీని అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశామని చెప్పింది.
ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఆ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులు.. ఏడాదిన్నరలో 40 సినిమాలను పైరసీ చేసిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వచ్చిందని పోలీసులు గుర్తించారు.
ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు నేపథ్యంలో కుబేర పైరసీ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే సినీ ఇండస్ట్రీకి పైరసీ తీవ్రమైన సమస్యగా మారింది. చాలా ఇబ్బందిగా తయారైంది. ఇప్పుడు అటు ఫిల్మ్ ఛాంబర్.. ఇటు పోలీసులు కఠిన చర్యలతో ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడే అవకాశం అయితే ఉంది.
కాగా, పీవీఆర్ మల్టీప్లెక్స్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడి నుంచే సినిమా కాపీ లీక్ అవ్వడం పైరసీ సమస్య తీవ్రతను స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుండగా.. అసలేం జరిగిందో పక్కన పెడితే.. కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
