ధనుష్ తప్ప ఎవరూ అలాంటి సాహసం చేయలేరు!
ఇండియన్ సినీ రంగంలో ఉన్న గొప్ప నటుల్లో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా ఒకడు. అయితే ధనుష్ కు కేవలం తమిళంలోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది.
By: Tupaki Desk | 21 Jun 2025 11:11 AM ISTఇండియన్ సినీ రంగంలో ఉన్న గొప్ప నటుల్లో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా ఒకడు. అయితే ధనుష్ కు కేవలం తమిళంలోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందులో భాగంగానే ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నాడు ధనుష్. గతంలో ధనుష్ తెలుగులో సార్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోగా ఇప్పుడు మరోసారి తెలుగు డైరెక్టర్ తో కలిసి సినిమా చేశాడు.
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున కీలక పాత్రలో నటించిన సినిమా కుబేర. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. కుబేరలో ధనుష్ నటనకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దేవా అనే బిచ్చగాడి పాత్రలోకి ధనుష్ పరకాయ ప్రవేశం చేసి మరీ నటించి అందరినీ మెప్పించాడు.
కుబేరలోని ఫస్ట్ సీన్ నుంచి ఆఖరి సన్నివేశం వరకు ధనుష్ నటన అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా బిచ్చగాడిగా ఇంట్రడక్షన్ సీన్ లో ధనుష్ చేసిన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కుబేర చూశాక ధనుష్ తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరనిపిస్తుంది. న్యాయం సంగతి అలా ఉంచితే ధనుష్ తప్ప ఇంకెవరూ అలాంటి పాత్రలు చేసే సాహసం కూడా చేయరేమో అని అందరూ భావిస్తున్నారు.
దేవా పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు ధనుష్. ఒక్కమాటలో చెప్పాలంటే కుబేర సినిమా ధనుష్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని అతని ఫ్యాన్స్ అంటున్నారు. పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమాకు ప్రస్తుతం ఎక్కడ చూసినా హౌస్ ఫుల్సే. అసలే గత కొంతకాలంగా సరైన సినిమా లేక థియేటర్లు డ్రై గా ఉన్న టైమ్ లో కుబేర డిస్ట్రిబ్యూటర్లలో ఆశల్ని రేకెత్తిస్తుంది.
