కుబేర.. క్లిక్కయితే ఎంత మంచిదంటే..
ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జునలతో వచ్చిన 'కుబేరా' సినిమాపై ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది.
By: Tupaki Desk | 20 Jun 2025 3:24 PM ISTఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ పరిస్థితి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఏదైనా సినిమా విడుదలయినా… ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కావడం లేదు. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు అంత ఈజీగా రావడం లేదు అంటే వారి అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది. ఇక ఈమధ్య వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్లకు కాస్త బూస్ట్ ఇచ్చాయి.
ముఖ్యంగా 'హిట్ 3', 'సింగిల్' వంటి సినిమాలు మాత్రమే కొంత మేర క్రేజ్‌ను నిలబెట్టుకున్నాయి. కానీ మిగిలిన సినిమాలూ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జునలతో వచ్చిన 'కుబేరా' సినిమాపై ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది.
ఈ రోజు థియేటర్లలో విడుదలైన 'కుబేరా' సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ మొదలై, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. శేఖర్ కమ్ములకు ఇది పూర్తి స్థాయి కమర్షియల్ డ్రామా కావడంతో, ఆయన ప్రత్యేకమైన టచ్‌తో వచ్చిన ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ధనుష్ నటన, నాగార్జున పాత్ర డెప్త్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ గెటప్, నాగార్జున పాత్ర వెనుకున్న ఇంటెన్సిటీతో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రివ్యూలలో ఓ కామన్ కామెంట్ వినిపిస్తోంది:
ఈ పాజిటివ్ టాక్ చూసిన ట్రేడ్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇప్పటికే థియేటర్లలో బిజినెస్ స్లోగా సాగుతుండగా.. ‘కుబేరా’కి వచ్చిన అంచనాలు నిజమవుతే ఈ సినిమా బాక్సాఫీస్‌కు మళ్ళీ బూస్ట్ ఇవ్వనుంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకు మంచి ఊరట లభించనుంది. సినిమా థియేట్రికల్ వాల్యూ ఏపీ, తెలంగాణలో సుమారు రూ.30 కోట్లు, వరల్డ్ వైడ్ కలిపి దాదాపు రూ.70 కోట్ల వరకు ఉందని అంచనా. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.140 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది.
ఈ నెంబర్ పెద్దదిగా అనిపించినా, టాక్, పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే ఆ టార్గెట్ చేరుకోవడం సాధ్యమేనని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘కుబేరా’ని హిట్ చేస్తే శేఖర్ కమ్ములకి కూడా కొత్త లెవెల్ ఓపెనింగ్ అవుతుంది. మరి ఈ సినిమా నిజంగానే థియేటర్లకు బూస్ట్ ఇస్తుందా.. తెలుగు సినిమా మార్కెట్ మళ్లీ ఊపందుకుంటుందా.. అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
