కుబేర సినిమా చూస్తూ గాయాలపాలైన ప్రేక్షకులు.. థియేటర్లో ఏం జరిగిందంటే?
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలయికలో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’.
By: Tupaki Desk | 26 Jun 2025 4:46 PM ISTకోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలయికలో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 20న గ్రాండ్ గా విడుదలై మంచి స్పందనతో ముందుకెళ్తోంది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌లు, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటున్నాయి.
రిలీజ్ రోజునుంచే హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తోంది. అయితే సినిమా సక్సెస్ లో కొనసాగుతున్న వేళ ఓ షాకింగ్ ఘటన ప్రేక్షకుల హృదయాల్లో గందరగోళం రేపింది. తాజా సమాచారం ప్రకారం, మహబూబాబాద్ జిల్లాలోని ముకుంద థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన సందర్భంగా ఓ ప్రమాదం చోటుచేసుకుంది.
సెకండ్ షోలో సినిమా నడుస్తుండగా సడన్‌గా థియేటర్ సీలింగ్ కూలిపోయింది. అప్పటికే ప్రేక్షకులు సినిమాలో మునిగిపోతుండగా పై నుంచి వస్తున్న సీలింగ్ భాగాలు కళ్లముందు కూలిపోవడంతో కాస్త భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. వెంటనే థియేటర్ సిబ్బంది స్పందించి ప్రథమ చికిత్స అందించారు.
క్షతగాత్రులంతా ప్రమాదం నుండి బయటపడినప్పటికీ, అలాంటి పరిస్థితులు థియేటర్లలో చోటుచేసుకోవడం ప్రేక్షకుల భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. థియేటర్ యాజమాన్యం సరైన నిర్వహణ చేయలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక సినిమా వసూళ్ల విషయానికి వస్తే, కుబేర అమెరికాలో ఇప్పటికే రెండు మిలియన్ల డాలర్ల మార్క్ దాటి దూసుకుపోతోంది. ఇది నాగార్జున కెరీర్‌లో ఓ అరుదైన విజయంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ వీకెండ్ తరువాత కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
