Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. కృతి సనన్ దర్శకత్వం?

ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి డిపార్ట్‌మెంట్ గురించి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటానని తెలిపింది. తన పాత్ర కోణంలోనే కాకుండా సన్నివేశాల గురించి తరచుగా ఆలోచిస్తానని చెప్పింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 3:00 AM GMT
#గుస‌గుస‌.. కృతి సనన్ దర్శకత్వం?
X

'1-నేనొక్క‌డినే' సినిమాతో టాలీవుడ్ లో క‌థానాయిక‌గా అడుగుపెట్టింది కృతి స‌నోన్. దోచేయ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఈ భామ‌ దుర‌దృష్ట నాయిక అనే చెప్పాలి. కెరీర్ ఆరంభం త‌న‌కు ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా రాణిస్తోంది. ఇటీవ‌లే హిందీ సినిమా 'మిలీ'లో అద్భుత న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును కూడా గెలుచుకుంది. త‌న సినిమాలు ఫ్లాపులైనా న‌టిగా కృతికి మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. మ‌హేష్ స‌ర‌స‌న 1-నేనొక్క‌డినేలో అద్భుత న‌ట‌న‌తో ఈ బ్యూటీ క‌ట్టి ప‌డేసింది. సుకుమార్ ఎంపిక‌ను త‌ప్పు ప‌ట్టిన వారు కూడా సినిమా రిలీజ్ త‌ర్వాత ఇది స‌రైన నిర్ణ‌యం అని పొగిడేశారు.

ఆస‌క్తిక‌రంగా కృతి హిందీ చిత్ర‌సీమ‌లో రోజురోజుకు ఎదుగుతోంది. ఇటీవ‌లే 'దో పట్టి' సినిమాతో నిర్మాతగా మారిపోయింది. భవిష్యత్తులో ద‌ర్శ‌కురాలుగా మారుతుంద‌న్న ప్ర‌చారం కూడా సాగుతోంది. తాజా ఇంటర్వ్యూలో కృతి సనన్ దర్శకత్వం వహించే ఆలోచనల గురించి మాట్లాడింది. ద‌ర్శ‌క‌త్వం స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది అని అంగీక‌రించింది. ఇంకా మాట్లాడుతూ- "నాకు కెమెరా ముందు ఉండటమంటే చాలా ఇష్టం. దర్శకుడి పని చాలా కష్టం. మీరు ఆ ఒక్క ప్రాజెక్ట్‌తో చాలా కాలం పాటు ఉండాలి. నేను అలా చేయగలనని అనుకోను" అని తెలిపారు. మిమీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఏదో ఒక రోజు సినిమాకు దర్శకత్వం వహించే ప్ర‌తిభ నీకు ఉంద‌ని తనతో చెప్పాడని కృతి తెలిపింది. అయితే త‌న‌కు మాత్రం దానిపై నమ్మకం లేదని అంది. "లక్ష్మణ్ (ఉటేకర్) సార్ నేను ఎప్పుడో ఒక‌ప్పుడు డైరెక్షన్ చేస్తానని చెప్పేవారు. కానీ నేను నటిగా మాత్రమే సంతోషంగా ఉండ‌గ‌ల‌నని అతడికి చెబుతూనే ఉండేదానిని. ప్రస్తుతానికి నేను నిర్మాతగా నా సృజనాత్మకత వైపు దూసుకుపోతున్నాను" అని తెలిపింది.

నిర్మాత‌గా తొలి చిత్రం 'దో పట్టి' గురించి కృతి మాట్లాడుతూ.. దో పట్టి ప్రొడక్షన్‌లోని ప్రతి బిట్‌ను తాను ఆస్వాధించానని కృతి చెప్పింది. కనికా ధిల్లాన్‌తో కలిసి ఈ సినిమా స్క్రిప్టింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకున్నానని చెప్పింది. సంగీతం ఇష్ట‌మైన‌ది.. దానిని అభివృద్ధి చేసే ప్ర‌క్రియ‌లో పాలుపంచుకున్నాను. సంగీత స్వరకర్తలతో క‌లిసి ప‌ని చేసే నిర్మాతగా ఉండ‌డం ఆనందాన్నిచ్చింది. సంగీతం ప‌రంగా నా చిత్రానికి ఏది సరైనదో గుర్తించడం నాకు చాలా ఇష్టం. నేను ఇంకా ప్రారంభంలో ఉన్నాను. ఇంకా చాలా నేర్చుకోవలసిన శిశువును అని భావించి ప‌ని చేస్తున్నాను" అని తెలిపింది.

ప్రొడక్షన్‌లోకి వెళ్లడం వెనుక తన ఉద్దేశ్యాన్ని వివరిస్తూ.. దాదాపు ఒక దశాబ్దం పాటు పరిశ్రమలో ఉన్న తర్వాత 'గేర్ మార్చడానికి ఇది స‌రైన సమయం' అని కృతి అంది. ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి డిపార్ట్‌మెంట్ గురించి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటానని తెలిపింది. తన పాత్ర కోణంలోనే కాకుండా సన్నివేశాల గురించి తరచుగా ఆలోచిస్తానని చెప్పింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో దో పట్టీ సెట్ నుండి వీడియోలు ఫోటోలను కృతి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో కృతి, కాజోల్, కనికా ధిల్లాన్, తన్వీ అజ్మీ తదితరులు ఉన్నారు. "ప్రతి సినిమాలో నా హృదయం ఉంటుంది, కానీ కొన్నింటిలో నా ఆత్మ కూడా ఉంటుంది.. #దో ప‌ట్టి నా హృదయం, ఆత్మ, మెదడు, ప్రేమ, కన్నీళ్లు, కలలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బ్లూ బ‌ట‌ర్ ఫ్లై ఫిలిమ్స్ అఫీషియ‌ల్.. నేను ఈ సృజనాత్మక ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించాను!!" అని ఎమోష‌న‌ల్ గా రాసింది కృతి.

దో పట్టి కి కృతి సనన్ - కనికా ధిల్లాన్ నిర్మాత‌లు. బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్- ఏ స్టోరి పిక్చర్స్ బ్యానర్‌లపై నిర్మించారు. ఇందులో కాజోల్, తన్వీ అజ్మీ, షాహీర్ షేక్ నటిస్తున్నారు. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. దో పట్టి కాకుండా, కృతి షాహిద్ కపూర్‌తో ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఓ రొమాంటిక్ చిత్రం కూడా చేస్తోంది. కరీనా కపూర్ ఖాన్, టబు , దిల్జిత్ దోసాంజ్‌లతో కలిసి ది క్రూ చిత్రంలోను న‌టిస్తోంది. కొత్త సంవ‌త్స‌రంలో వ‌రుస చిత్రాల‌తో కృతి బిజీగా ఉంది.